మానేరుపై కూలిన చెక్ డ్యాం..అడవి సోమన్ పల్లి దగ్గర కొట్టుకుపోయిన చెక్ డ్యాం

మానేరుపై కూలిన చెక్ డ్యాం..అడవి సోమన్ పల్లి దగ్గర కొట్టుకుపోయిన చెక్ డ్యాం

మానేరునదిపై చెక్ డ్యాం కూలిపోయింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్ పల్లి దగ్గర మానేరుపై నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోయింది.  చెక్ డ్యాం వంద మీటర్ల వరకు తెగిపోయింది. గత ప్రభుత్వ హయాంలో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన  ఈ డ్యాం కూలిపోవడంతో అధికారులు, స్థానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.  

పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్ పల్లి దగ్గర మానేరు పై గత ప్రభుత్వ హయాంలో 39.82 కోట్ల నిధులతో నిర్మించిన చెక్ డ్యాం కూలిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మానేరు డ్యాం గేట్లు ఎత్తి నీటిని క్రిందికి వదలడంతో అడవి సోమన్ పల్లి చెక్ డ్యాం లో భారీగా నీరు చేరింది.బుధవారం ఉదయం 11గంటల సమయంలో చెక్ డ్యాం వంద మీటర్ల వరకు ఒక్కసారిగా కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. 

కూలిన చెక్ డ్యాం ను పరిశీలించిన మంథని ఇరిగేషన్ శాఖ అధికారులు  పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గతేడాది 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకొని నిలిచిన చెక్ డ్యాం తక్కువ నీరు ఉన్న సమయంలో కూలిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంథని పోలీస స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే కూలిన చెక్ డాం ప్రాంతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులో వస్తుందని ఆ ప్రాంత పోలీసులు ఫిర్యాదు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.