బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్ అసోసియేషన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేరాలు జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా.. అసోసియేషన్ 'సొంత కోర్టులు' నడుపుతూ తీర్పులు ఇస్తున్నట్లు తేలింది. దీంతో అపార్ట్‌మెంట్ అసోసియేషన్, సెక్యూరిటీ ఏజెన్సీపై బెంగళూరు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
సొంత చట్టాలు.. వింత జరిమానాలు:
బెంగళూరులోని దొడ్డబెలె ప్రాంతంలో ఉన్న 'ప్రావిడెంట్ సన్‌వర్త్ అపార్ట్‌మెంట్' అసోసియేషన్, భద్రతను పర్యవేక్షించే 'టైకో సెక్యూరిటీ' సంస్థపై కుంబల్గోడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అపార్ట్‌మెంట్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు నివసిస్తున్నారు. అయితే అక్కడ డ్రగ్స్ వాడకం, దొంగతనాలు, చివరకు మహిళలపై లైంగిక వేధింపుల వంటి తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు అసోసియేషన్ వాటిని పోలీసులకు నివేదించకుండా దాచిపెట్టినట్లు విచారణలో తేలింది.
ఈ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ రాజ్యాంగానికి విరుద్ధంగా తమకోసం కొన్ని ప్రత్యేక రూల్స్ రూపొందించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను అసోసియేషన్ సభ్యులే విచారించేవారు. అలాగే నేర తీవ్రతను బట్టి భారీగా నగదు జరిమానాలు విధించేవారు. గత కొద్ది నెలల్లోనే డ్రగ్స్ వాడిన వారి నుంచి సుమారు రూ. 25వేల వరకు జరిమానాలు వసూలు చేసి, వారిని వదిలేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేరస్థులను రక్షించే ప్రయత్నం చేస్తూ.. ఫైన్ విధించి సొంత రాజ్యాంగం నడపటం చట్టాలను చేతుల్లోకి తీసుకోవటమేనని సోషల్ మీడియాలా చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయంపై సౌత్ వెస్ట్ డివిజన్ డీసీపీ అనిత బి. హద్దన్నవర్ స్పందిస్తూ.. మహిళలపై వేధింపులు, డ్రగ్స్ వంటి తీవ్రమైన కేసులను కూడా అంతర్గతంగా పరిష్కరించుకోవడం చట్టవిరుద్ధమని అన్నారు. ఇలా చేయటంతో బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుపడటమే కాకుండా, నేరస్థులు తప్పించుకోవడానికి అసోసియేషన్ సహకరించిందని ఆమె మండిపడ్డారు. అందుకే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ప్రైవేట్ అసోసియేషన్లకు లేదా అపార్ట్‌మెంట్ కమిటీలకు నేరాలను విచారించే అధికారాలు, జరిమానాలు విధించే హక్కులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఏదైనా నేరం జరిగినప్పుడు వెంటనే చట్టబద్ధమైన అధికారులకు సమాచారం అందించాలని, లేనిపక్షంలో నేరస్థులకు సహకరించినట్లుగా భావించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు నేరాలపై సొంత దర్యాప్తులు ఏంటంటా చాలా మంది నెట్టింట ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
