గద్వాల, వెలుగు: డిజిటల్ క్రాఫ్ట్ సర్వే ఫార్మర్ రిజిస్ట్రేషన్ పక్కాగా నిర్వహించాలని, రైతులకు కొరత లేకుండా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆఫీసర్లకు ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎరువుల స్టాక్ వివరాలు ప్రతిరోజూ బోర్డుపై ప్రదర్శించాలన్నారు.
అన్ని విక్రయాలు ఈపాస్ యంత్రం ద్వారా మాత్రమే జరపాలని, లైసెన్స్ లేకుండా ఎరువులు అమ్మకాలు జరగకూడదన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బస్తీ ఆస్పత్రులను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. అనంతరం గోన్పాడు శివారులో కలెక్టర్ పొలాలను సందర్శించి పంటల స్థితిగతులను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో జిల్లా స్థాయి చార్ట్ ఆఫీసర్లు, అదనపు చార్ట్ ఆఫీసర్లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు.
