హైదరాబాద్ చందానగర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న 52 అంతస్తుల భారీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. కన్స్ట్రక్షన్ సైట్ లో పని చేసే వర్కర్స్ కోసం ఏర్పాటు చేసిన గుడిసెల్లో సిలిండర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. ఘటన జరిగిన సమయంలో గుడిసెల్లో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో దట్టమైన పొగ పరిసరాలను కమ్మేసింది. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. గురువారం ( డిసెంబర్ 18) నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ రోజు రెండు గంటలకు కోర్టును పేల్చివేస్తామంటూ ఈ మెయిల్ పంపించారు. అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు.
గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బాంబ్ థ్రెట్ ఈ మెయిల్స్ పంపించారు దుండగులు.. దీంతో కోర్టు హాల్లోని న్యాయమూర్తులు, సిబ్బంది, న్యాయవాదులను వెంటనే బయటకు పంపించి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు పోలీసులు. రంగంలోకి దిగిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీం తనిఖీలు చేపట్టారు. కోర్టు ఆవరణలో అణువణువూ గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించినట్లు అధికారిక సమాచారం లేదు.
