గత 20 ఏండ్లుగా దేశంలోని గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఉపాధిని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అందిస్తోంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ పేరుతో పేద కూలీల వలసలను నివారిస్తూ, కరువు సమయంలో వారి కడుపు నింపుతోంది. అలాంటి ఈ పథకం లక్ష్యం, రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. పేద కూలీలకు పని దినాలను పెంచుతున్నామని పస్ర్తుత ఏన్డీఏ ప్రభుత్వం పైకిచెపుతున్నా, ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కనబడుతోంది.
సోమవారం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాతచట్టం పేరుతో సహా పూర్తిగా మార్చిన, ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ - గ్రామీణ్’ (వీబీ జీ రామ్ జీ -2025) పేరుతో నూతన బిల్లు ప్రతులను లోక్సభలో సభ్యులకు అందించారు. 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ప్రవేశపెట్టింది. కరువు పరిస్థితులలో వ్యవసాయ కూలీల వలసలను నివారిస్తూ, వారికి తమ గ్రామంలోనే పని కల్పించడం ఈ పథకం లక్ష్యం.
సోనియాగాంధీ ప్రత్యేక చొరవతో...
గత 20 సంవత్సరాలుగా పేద కూలీలకు ఇంత క్రియాశీలకంగా ఉపయోగపడ్డ పథకం మరొకటి లేదు. దీనికి నిదర్శనం ప్రస్తుతం దేశంలో దాదాపు 12 కోట్ల మందికిపైగా ఉపాధి హామీ కార్డును కలిగి ఉన్నారు. నాటి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రత్యేక చొరవతో ఈ పథకం ప్రారంభమైంది. ఈ పథకం అమలు గురించి సోనియాగాంధీ నిరంతరం ఆరా తీసేవారు.
ఈ పథకం పేదల కడుపు నింపుతుండడంతో 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం దీనికి జాతిపిత మహాత్మా గాంధీ పేరును పెట్టి మరింత బలోపేతం చేసింది. ఇంతటి ముఖ్యమైన ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గతంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఇది గుంతలు తీసే పథకం’ అని చులకనగా మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం
పాత చట్టం ప్రకారం సంవత్సరానికి కనీసం 100 రోజులు వ్యవసాయ కూలీలకు పని కల్పించాలి. కొత్త చట్టం ప్రకారం ఈ పని దినాలను 125 రోజులకు పెంచారు. మరోవైపు సెక్షన్ 5 ప్రకారం వ్యవసాయ పనుల రద్దీ సీజన్లో ఈ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు కచ్చితంగా 60 రోజుల సెలవులు ఇవ్వాలనే నిబంధనను చేర్చారు.
ఒకవైపు పని దినాలను 25 రోజులు పెంచుతూనే, మరోవైపు కచ్చితంగా 60 రోజుల సెలవులు పేద కూలీలకు ఇవ్వడం ఏమిటి? ఇది భూస్వాములకు చవకగా కూలీలు దొరకడం కోసం చేస్తున్న కుటిల ప్రయత్నం కాదా? పాతచట్టం ప్రకారం ఈ పథకానికి అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం 90 శాతం భరించేది. కానీ, నూతన చట్టం ప్రకారం 60 శాతం మాతమే భరిస్తుంది.
మిగతా 40 శాతం రాష్ట్రాలు భరించాలి. అంటే ఈ పథకానికి ఇచ్చే నిధులను కేంద్రం తగ్గించుకుంటుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. అంతేకాదు కేంద్రం ఆయా రాష్ట్రాలకు కొన్ని పరిమితుల ద్వారా నిధులను కేటాయిస్తుంది. కేటాయించిన నిధులకు మించి పనులు జరిగితే ఆ అదనపు ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి.
సంక్షోభంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
పాత చట్టం ప్రకారం ఏయే గ్రామీణ ప్రాంతాలలో, ఎలాంటి పనులు చేయించాలనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించేవి. కానీ, కొత్తచట్టం సెక్షన్ 5 పక్రారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం రాష్ట్రాలపై పెరుగుతుంది. నూతన చట్టం ప్రకారం పనులు ముగిసిన 15 రోజులలో కూలీలకు వేతనాలు చెల్లించాలి.
కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల జాప్యం చేస్తే ఈ భారం మొత్తం రాష్ట్రాల మీద పడుతుంది. గత 8 ఏండ్లుగా ఈ పథకం కింద పనిచేస్తున్న కూలీల వేతనాలను పెంచడానికి మోదీ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. 2024 దేశ సాధారణ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఈ పథకం కూలీలకు ప్రస్తుతం ఇస్తున్న ఒకరోజు వేతనం 370 రూపాయలను రూ.400కు పెంచుతామని హామీ ఇచ్చింది.
ఈ పథకం కింద మరింత ఎక్కువ మంది కూలీలకు పని కల్పిస్తామని భరోసా ఇచ్చింది. సోనియా గాంధీ పేదలకు కడుపు నింపాలని ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడమే మోదీ ప్రభుత్వ ఉద్దేశం. దీనికి ఒకే ఒక్క కారణం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ పథకానికి మంచి పేరు ఉండడమే. ఈ పథకం
నిర్వీర్యం అయితే పేద కూలీల చేతులకు పని దొరకడం కష్టంగా మారుతుంది.
పేదలు మళ్లీ ఆకలితో అలమటించే రోజులు వస్తాయి. దీంతో వలసలు మరింత పెరుగుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతుంది. కావున, ప్రజాస్వామికవాదులు, పేదల పక్షపాతులు ఈ నూతన చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటాలలో భాగస్వామ్యం కావాలి.
నిధులు విడుదల చేయకుండా కేంద్రం జాప్యం
ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. జీఎస్టీ రూపంలో రాష్ట్రాల నుంచి వసూలు చేసిన పన్నులను, తిరిగి రాష్ట్రాల వాటా కింద ఇచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెడుతున్నది. ఇలాంటి సందర్భంలో ఈ పథకం కింద ఇచ్చే నిధులలో కేంద్రం తగ్గించుకోవడం సరికాదు. ఇదేనా పేద కూలీల మీద కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి? ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాలను మరింత సంక్షోభంలోకి నెట్టడమే వికసిత భారత్ లక్ష్యమా? పాత చట్టం ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధులను కూడా సక్రమంగా విడుదల చేయడం లేదు.
ఉదాహరణకు గత నాలుగేళ్లుగా పశ్చిమ బెంగాల్లో ఈ పథకం కింద పనిచేసిన కూలీలకు ఇచ్చే వేతనాలు రూ. 3 వేల కోట్లకు పైగా బకాయిలను కేంద్రం విడుదల చేయకుండా జాప్యం చేస్తోంది. దీనిని నిరసిస్తూ ‘పశ్చి మ్ బంగా ఖేత్ మజ్దూర్ సమితి’ కలకత్తా హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఈ నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
హైకోర్టు తీర్పును నిరసిస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత అక్టోబర్ నెలలో సుప్రీంకోర్టు కూడా ఈ నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఈ పథకం అమలుపై ఉన్న చిత్తశుద్ధి ఇది.
- నుమాన్ మహమ్మద్, ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్
