వరకట్నం చావు కేసులపై సుప్రీం సీరియస్

వరకట్నం చావు  కేసులపై సుప్రీం సీరియస్

విచారణలో ఉన్న వరకట్నం చావు,  క్రూరత్వ కేసులని  త్వరితగతిన  పరిష్కరించడానికి అన్ని హైకోర్టులు  సమీక్షించాలని,  అన్ని  రాష్ట్రాల్లో  వరకట్న  నిషేధ అధికారులను నియమించాలని, ఈ చావుల పరిణామాలను వివరించడానికి పోలీసులకి,  న్యాయమూర్తులకి తగిన శిక్షణను ఇవ్వాలన్న ఆదేశాలతోపాటు పలు ఆదేశాలను  సుప్రీంకోర్టు  జారీ చేసింది.  

భగవంత్ సింగ్ వర్సెస్​ కమిషనర్​ ఆఫ్​  పోలీస్​ కేసులో సుప్రీంకోర్టు వరకట్న నిషేధ చట్టం ఎంత అసమర్థంగా కొనసాగుతోందో  గమనించి ఆదేశాలు జారీ,  వార్షిక గణాంకాలు భయంకరంగా  ఉన్నాయని  కోర్టు అభిప్రాయపడింది.  చట్టం  సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపించలేకపోతోంది.  సెక్షన్​ 498ఎ, సెక్షన్​304ఎ  చట్టంలో  చేర్చినప్పటికీ తగు ఫలితాలు రావడం లేదు.  అదేవిధంగా సెక్షన్​ 498‘ఎ’ని  తమ  దురుద్దేశాల కోసం  ఉపయోగించుకుంటున్నారు.  ఈ  ప్రభావ రాహిత్యం,  దుర్వినియోగం మధ్య ఉండే ఊగిసలాటలో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి తప్ప కేసుల సంఖ్య తగ్గడం లేదు. 

కేసు విషయాలు

నస్రీన్​అనే యువతికి  అజ్మల్ ​బేగ్​తో  వివాహం జరిగింది.  ఆమె  భర్త  బేగ్​ అతడి కుటుంబ సభ్యులు ఆమెపై,  ఆమె  తండ్రిపై  కలర్​  టెలివిజన్​ కోసం,  మోటార్​ సైకిల్​ కోసం,  అదనపు కట్నం కోసం వేధించేవారు. 2001వ  సంవత్సరంలో  మృతురాలు  నస్రీన్​పై  దాడి  చేశారు.  ఆమె  భర్త  ఆమెపై  కిరోసిన్​పోసి నిప్పంటించాడు. ఆమె మామ అక్కడికి చేరుకునేటప్పటికే  ఆమె కాలి చనిపోయింది.  

ఆ తరువాత ఎఫ్ఐఆర్​  విడుదలైంది.  పోలీసులు దర్యాప్తు చేసి ఆమె భర్త  బేగ్​పై,  అతని తల్లిపై 304 బి,  498ఎ  ప్రకారం అదేవిధంగా వరకట్న నిషేధ చట్టంలోని సె.3, సె.4 ప్రకారం చార్జిషీట్​ను  దాఖలు చేశారు.  సెషన్స్​ కోర్టు కేసుని  విచారించి,  వాళ్లను  దోషులుగా నిర్ధారించి వారికి జరిమానాతోపాటు  జీవిత ఖైదు విధించింది.  వాళ్లు  అలహాబాద్​ హైకోర్టులో  అప్పీలు దాఖలు చేసుకున్నారు. 

హైకోర్టు వారిని అన్ని నేరాలకు తన  ఉత్తర్వులు ద్వారా నిర్దోషులుగా  ప్రకటించి విడుదల చేసింది. ఇతర కారణాలు పేర్కొంటూ  ఆమె మామ  ఈ  సంఘటనకు ప్రత్యక్ష సాక్షి  కాదని  అలహాబాద్​ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.  ఈ తీర్పుకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలును దాఖలు చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు

కేసులోని  సాక్ష్యాలను  పరిశీలించి  మృతురాలి తండ్రి,  తల్లి,  మేనమామ  సాక్ష్యాల  ప్రకారం  వరకట్నం కేసులో  నిరంతర వేధింపులు జరిగాయి. ఈ సాక్ష్యాలు  స్థిరంగా ఉన్నాయని  సుప్రీంకోర్టు భావించింది.  నిందితులు  నేరస్థలం నుంచి  పారిపోవడాన్ని తాను చూశానని  మేనమామ సాక్ష్యం కూడా ఉంది.  వీరి  సాక్ష్యాల  ద్వారా  వరకట్నం డిమాండ్,  మోటార్​ సైకిల్ డిమాండ్ అనే విషయాలు  అనుమానానికి అతీతంగా  రుజువైనాయని సుప్రీంకోర్టు ధర్మాసనం  అభిప్రాయపడింది.  

మృతురాలు చనిపోవడానికి  ఒకరోజు ముందు కూడా ఈ డిమాండ్​ను  నేరస్తులు  చేశారు.  అశోక్​కుమార్​ వర్సెస్​ హర్యానా రాష్ట్రం (2010) కేసులో  సుప్రీంకోర్టు  సె.304‘బి’లో  చెప్పిన మరణానికి  ముందు అన్న విషయం ఈ కేసుకి వర్తిస్తుంది.  సె.113బి  భారతీయ  సాక్ష్యాధారాల చట్టంలోని  ప్రకారం  నిజమనే  భావనని తీసుకోవాల్సి ఉంటుంది.  

ఆ తీర్పు ప్రకారం ‘ఆమె మరణానికి కొంతకాలం ముందు’ అన్న పదబంధం  ప్రకారం  క్రూరత్వానికి  లేదా  వేధింపులకి  మధ్య  ప్రత్యక్ష  సంబంధం లేకపోయినా సహేతుకమైన సంబంధం ఉండాలి.  మృతురాలి తల్లి  అత్తవారింట్లో సంతోషంగా ఉందని చెప్పడమంటే,   ఆమెను ఇంటికి తీసుకుని వస్తానని  తండ్రి  చెప్పినప్పుడు  ఆవిధంగా  చెప్పిందని అర్థం చేసుకోవాలి. 

ఈ విషయంలో హైకోర్టు తప్పు పడిందని  సుప్రీంకోర్టు  అభిప్రాయపడింది.  వరకట్న  డిమాండ్​ అనేది పెళ్లికి ముందు ఉండవచ్చు.  ఆ తర్వాత కూడా ఉండవచ్చు.  అందరి  సాక్ష్యాలు ఒకేరకంగా ఉండటం వల్ల  సుప్రీంకోర్టు,  హైకోర్టు వారిని  విడుదల చేస్తూ మృతురాలి  భర్తకి  జీవిత ఖైదుని విధించింది.  ఆమె అత్త వయస్సు 94 సంవత్సరాలు  కారణంగా  ఇంకా శిక్షను విధించలేదు.  జైలులో ఉన్న కాలానికే దాన్ని సరిచేసింది. ఈ తీర్పును ప్రకటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని ఆదేశాలను  సుప్రీంకోర్టు జారీ చేసింది. 

వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం అనే విషయాలు మన సమాజంలో పాతుకుపోయి ఉన్నాయి. వరకట్న నిషేధ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి సంవత్సరాలు గడిచినా అనుకున్న ఫలితాలు కనిపించడం లేదు. అదేవిధంగా ‘వరకట్నం చావు’ని తీవ్రమైన నేరంగా పరిగణించి ఐపీసీలో, అదేవిధంగా సాక్ష్యాధారాల చట్టంలో మార్పులను తీసుకొచ్చినప్పటికీ అవి ఇంకా కొనసాగడం ఓ విషాదం.  వరకట్నం చావు, క్రూరత్వానికి పాల్పడిన ఓ కేసులో భర్తకి,  అతని తల్లికి కింది కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పుని సుప్రీంకోర్టు రద్దు చేస్తూ,  ఈ వరకట్నం చావు కేసులను ఎదుర్కోవడానికి  సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేసింది. 

స్టేట్ ఆఫ్​ ​యూపీ వర్సెస్​ అజ్మల్ బేగ్​ కేసులో (2025 లైవ్​ లా, సుప్రీంకోర్టు 1209) 20 సంవత్సరాల యువతి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వరకట్నాన్ని సామాజిక దురాచారంగా కోర్టు అభివర్ణించింది. ఈ కేసులో అత్తింటివారి అత్యాశను తీర్చే వనరులు లేక ఆ యువతి దురదృష్టకరమైన ముగింపును ఎదుర్కొంది అని జస్టిస్​ సంజయ్​ కరోల్, జస్టిస్​ ఎన్​కే సింగ్​లతో  కూడిన ధర్మాసనం  పేర్కొంది.

సుప్రీంకోర్టు ఆదేశాలు

1.    వివాహ ప్రక్రియలో వధూవరులు ఇద్దరూ ఒకరికొకరు సమానం. ఇందులో ఎవరూ ఎక్కువ కాదు. తక్కువ కాదు. వివాహ సమయంలో డబ్బులు, వస్తువులు ఇవ్వడం సరైంది కాదు. ఇద్దరూ సమానమే. ఒకరికొకరు సమానం. అధములు కాదు. ఈ విషయాన్ని రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వం అన్ని స్థాయిలలో విద్యా పాఠ్య ప్రణాళికలో చేర్చి అవసరమైన మార్పులు చేయాలని  కోర్టు ఆదేశించింది. 
2.    వరకట్న నిషేధ చట్టప్రకారం.. వరకట్న నిషేధ అధికారులను  నియమించాలి. తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించేవిధంగా వారికి అవగాహన కల్పించాలి. వారి విధులను నిర్వర్తించడానికి అవసరమైన నిధులను అందించాలి.   ఈ అధికారుల పేరు, వివరాలు, ఫోన్​ నంబరు, ఇ–మెయిల్​ను స్థానిక అధికారులు తగినంత ప్రచారం చేయాలి. ఆ ప్రాంత పౌరులకు
 అవగాహన కల్పించాలి. 
3.    పోలీసు అధికారులకి, ఈ కేసులని విచారిస్తున్న న్యాయాధికారులకి కాలానుగుణంగా శిక్షణను ఇవ్వాలి. ఈ కేసుల పట్ల సున్నితంగా వ్యవహరించేవిధంగా శిక్షణను ఇవ్వాలి. దానివల్ల ఈ నిబంధనలను దుర్వినియోగం చేసే నిరాధారమైన  కేసుల పట్ల అప్రమత్తంగా ఉండటానికి ఈ శిక్షణ సహాయపడుతుంది. 
4.    సె.304బి, 408‘ఎ’కి సంబంధించిన పెండింగ్ కేసులను గుర్తించి, వాటిని సత్వరం పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది. 2001వ  సంవత్సరంలో  మొదలైన ఈ కేసు 24 సంవత్సరాల తరువాత ఈ తీర్పు ద్వారా ముగిసింది.  ఇలాంటి కేసులు ఇంకా అనేకం ఉంటాయనేది స్పష్టం. 
5.    ఈ రోజుకి కూడా చాలామంది విద్యా పరిధికి దూరంగా ఉన్నారు.  కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరాలు అన్న విషయాలు శారీరక, మానసిక క్రూరత్వం విషయాలు వాళ్లకి అర్థమయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలి.

జిల్లా  పరిపాలనా యంత్రాంగం,  జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు,  పౌర సమాజ సమూహాలు,  అంకితభావం ఉన్న సామాజిక కార్యకర్తలను  భాగస్వామ్యం చేస్తూ  అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.  భార్య అనే తమ సేవకురాలు కాదన్న  విషయం  యువతరం  తెలుసుకోవాలని  సుప్రీంకోర్టు  డిసెంబర్​ నెలలో ఇచ్చి ప్రధానతీర్పు.  రోజురోజుకీ ఆడంబరాలు పెరుగుతున్న సమాజంలో ఈ ఉత్తర్వులు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో చూడాలి.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-డా. మంగారి రాజేందర్​,జిల్లా జడ్జి (రిటైర్డ్)