ఎరువుల ఉత్పత్తి  పెరుగుతోంది

ఎరువుల ఉత్పత్తి  పెరుగుతోంది

న్యూఢిల్లీ:మనదేశం ఎరువుల కోసం ఇప్పటికీ దిగుమతులపైనే విపరీతంగా ఆధారపడుతోంది. బయటి దేశాల నుంచి కొనకుంటే సాగు, పారిశ్రామిక అవసరాలు తీరడం లేదు. ఈ పరిస్థితిని తొలగించడానికి కేంద్రం  మెల్లమెల్లగా వీటి తయారీని పెంచుతున్నది. ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటోంది.  కరోనా వల్ల విదేశాల నుంచి ఎరువులు రావడం కష్టంగా మారింది. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం వల్ల సప్లైలు తగ్గే అవకాశాలూ ఉన్నాయని కేంద్రం భయపడుతోంది. మనదేశంలో ఇప్పటికీ ఎరువుల ప్రొడక్షన్​ ఆశించినంతగా లేకపోవడంతో, పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. 2018-–19, 2020–-21 మధ్య భారతదేశ ఎరువుల దిగుమతులు  దాదాపు 8 శాతం పెరిగి 18.84 మెట్రిక్ టన్నుల నుండి 20.33 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. డీఐ అమ్మోనియం ఫాస్ఫేట్  అవసరాల్లో దాదాపు సగం విదేశాల నుండి రవాణా అవుతున్నది. 

 దేశీయంగా ఎరువుల ఉత్పత్తి పెరిగిందా?

ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం, 2021 ఫైనాన్షియల్​ ఇయర్‌‌లో కొన్ని మినహా చాలా రకాల ఎరువుల ప్రొడక్షన్​ పెరిగింది. యూరియా ఉత్పత్తి కొంత పెరిగింది.  డీఏపీ ఉత్పత్తి 17 శాతానికి పైగా పడిపోయింది.  నైట్రోజన్​ ఎరువుల ఉత్పత్తి 8 శాతం పెరిగింది. యూరియా తయారీ  24.6 మిలియన్​ మెట్రిక్​ టన్నులు (+0.6శాతం), డీఏపీ  3.77  మిలియన్​ మెట్రిక్​ టన్నులు (-–17.1శాతం), ఎస్​ఎస్​పీ  4.92  మిలియన్​ మెట్రిక్​ టన్నులు (+15.8శాతం), ఎన్​పీ/ఎన్​పీకేల తయారీ 7.6 శాతం పెరిగి 9.33  మిలియన్​ మెట్రిక్​ టన్నులకు చేరుకుంది.     2021 ఫైనాన్షియల్​ ఇయర్​లో దిగుమతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. యూరియా దిగుమతులు 9.83  మిలియన్​ మెట్రిక్​ టన్నులకు (+7.7 శాతం) పెరిగాయి, డీఏపీ దిగుమతులు 4.88  మిలియన్​ మెట్రిక్​ టన్నులకు (+0.2 శాతం)  పెరిగాయి. ఎన్​పీ/ఎన్​పీకే ఎగుమతులు 1.39  మిలియన్​మెట్రిక్  టన్నులు (+86.3 శాతం) వద్ద ఉండటాన్ని బట్టి చూస్తే నైట్రోజన్​ ఎరువుల దిగుమతులు భారీగా పెరిగాయని చెప్పవచ్చు. మ్యూరియేట్ ఆఫ్ పొటాషియం (ఎంఓపీ) దిగుమతులు 4.23  మిలియన్​ మెట్రిక్​ టన్నులకు (+15.2 శాతం)  పెరిగాయి.

 భారీగా ఎరువులు ఎందుకు కావాలి ?

ఇండియాలో ఏటా సాగు దిగుబడులు పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎరువుల వాడకమూ ఎక్కువ అవుతోంది.     2021 ఫైనాన్షియల్​ ఇయర్​లో  యూరియా వాడకం 4.5 శాతం పెరిగి 35.04  మిలియన్​ మెట్రిక్​ టన్నులకు చేరింది. డీఏపీ వినియోగం 18 శాతం పెరిగి 11.91 మిలియన్​ మెట్రిక్​​ టన్నులకు, ఎంఓపీ డిమాండ్​ 19.5 శాతం పెరిగి 3.42 మిలియన్​ మెట్రిక్​​ టన్నులకి చేరింది. నైట్రోజన్​ ఎరువుల వాడకం 22 శాతం పెరిగి 11.81 మిలియన్​ మెట్రిక్​​ టన్నులకు చేరింది. ఎరువుల వాడకంలో 13 రాష్ట్రాలకు 92 శాతం వాటా ఉంది. ఉత్తరప్రదేశ్‌‌‌‌ (17.3 శాతం), మహారాష్ట్ర (10.5 శాతం), మధ్యప్రదేశ్ (8.9 శాతం), కర్ణాటక (6.8 శాతం), ఆంధ్రప్రదేశ్ (6.2 శాతం), గుజరాత్ (6 శాతం), పంజాబ్,  బీహార్ (5.9 శాతం) ఉన్నాయి.  తెలంగాణ (5.6 శాతం), రాజస్థాన్ (5.5 శాతం), పశ్చిమ బెంగాల్ (5.3 శాతం), హర్యానా (4.5 శాతం), తమిళనాడు 3.4 శాతం ఎరువులను వాడుతున్నాయి. 

ప్రభుత్వం ఏం చేస్తోందంటే...

డీఏపీ, ఎన్​పీకే ఎరువుల తయారీకి రాక్​ ఫాస్ఫేట్​ చాలా ముఖ్యం. ఇది 90 శాతం దిగుమతుల ద్వారా సమకూరుతోంది. పదిశాతం మాత్రమే స్థానికంగా తయారవుతోంది. రాక్​ ఫాస్ఫేట్​తయారీని వీలైనంత పెంచడానికి కేంద్ర ఎరువులశాఖ ప్రయత్నిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్​, యూపీ, ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఫాస్పోరైట్​ నిల్వలను వెలికితీస్తోంది.  తయారీని పెంచడానికి ఇది వరకే మూతబడ్డ యూరియా ప్లాంట్లను తెరుస్తోంది. ఈ క్యాలెండర్​ సంవత్సరంలోనే చాలా యూరియా ప్లాంట్లు మొదలుకానున్నాయి. అంతేకాదు ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం ఎరువుల ఫ్యాక్టరీలకు సబ్సిడీ ఇస్తోంది. దీనివల్ల రైతులకూ తక్కువ ధరకు యూరియా దొరుకుతోంది. 

ఎరువులు:  మనదేశ దిగుమతులు
    2018–19     2019–20     2020–21     2021–22
యూరియా
అవసరం     300.04     335.26     350.64     356.53
ఉత్పత్తి      225.23    244.55     246.03     210.22*
దిగుమతి     74.81     91.23     98.28     72.08*
డీఏపీ
అవసరం     98.4     103.3    107.76    123.89
ఉత్పత్తి      32.38    45.5     37.74     34.35*
దిగుమతి     66.02     48.7     48.82     42.56
* 2022 జనవరి వరకు (లక్షల టన్నుల్లో)