మన్మోహన్ సింగ్ ను పాక్ కు ఆహ్వానిస్తాం

మన్మోహన్ సింగ్ ను పాక్ కు ఆహ్వానిస్తాం
  • కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవ వేడుకకు పిలుస్తాం
  • పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి వీడియో సందేశం

ఇస్లామాబాద్: కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేందుకు పాకిస్థాన్ రావాల్సిందిగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి చెప్పారు. గురు నానక్ 550వ జయంతి సందర్భంగా దీని ప్రారంభోత్సం చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ వేడుక మరింత సంబరంగా జరిగేలా ప్రత్యేకంగా మన్మోహన్ కు లేఖ రాసి ఆహ్వానించాలని పాక్ నిర్ణయించిందని ఖురేఫీ తెలిపారు. సోమవారం ఓ వీడియో సందేశం ద్వారా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని పిలుస్తారా లేదా అన్నదానిపై ఈ వీడియో సందేశంలో క్లారిటీ ఇవ్వలేదు.

నవంబర్ లో ప్రారంభం

పాకిస్థాన్ లోని కార్తార్ పూర్ లో సిక్కుల పవిత్ర స్థలం దర్బార్ షాహిద్ మందిరం ఉంది. దీన్ని 1522లో సిక్కు మత స్థాపకుడు గురు నానక్ నిర్మించారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ విభజనతో ఈ ప్రాంతం పాక్ లో భాగమైంది. తమకు పూజనీయమైన ఈ ప్రాంతానికి వెళ్లేందుకు భారత్ లోని సిక్కులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే భారత్ లోని పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉన్న డేరా బాబా నానక్ మందిరం నుంచి కర్తార్ పూర్ మధ్య కారిడార్ నిర్మించేందుకు గత ఏడాది నవంబరులో భారత్ – పాక్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఇరు దేశాల్లో కారిడార్ నిర్మాణ, అనుసంధాన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబరు 9న దీన్ని ప్రారంభించాలని పాక్ నిర్ణయించింది.

పాక్ విదేశాంగ మంత్రి ఖురేషిితో మన్మోహన్ సింగ్ (పాత ఫొటో)

సందర్శనకు వీసాతో పన్లేదు.. పర్మిట్ చాలు

ఇరు దేశాల మధ్య కర్తార్ పూర్ కారిడార్ పూర్తయి.. అందుబాటులోకి వస్తే భారత సిక్కు యాత్రికులు అక్కడికి వెళ్లేందుకు పాక్ వీసాతో పనిలేదు. కేవలం పర్మిట్ తీసుకుంటే సరిపోతుంది.

సంతోషంగా ఆహ్వానిస్తామంటున్న పాక్

అనుకున్న సమయానికి ఇది ప్రారంభమైతే నవంబర్ 12న గురు నానక్ 550వ జయంతి వేడుకలకు అక్కడికి భారీగా సిక్కులు వెళ్లే అవకాశం ఉంది. కశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలు నడుస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్నది చెప్పలేం. అయితే పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో నానక్ జయంతి వేడుకలకు భారీగా కర్తార్ పూర్ వచ్చే భక్తులను సంతోషంగా ఆహ్వానిస్తామని చెప్పారు. నిమిషానికో మాట మార్చే పాక్ ఆ రోజుకు ఎలాంటి స్టాండ్ తో ఉంటుందో చూడాలి.