
ఢిల్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆ పార్టీ నాయకురాలిపై దాడి జరిగిందని వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు స్వాతి మలివాల్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో కేజ్రీవాల్ పీఏ బిందవ్ దాడి చేశారని ఆరోపించారు. ఈమేరకు స్వాతి మలివాల్ తన ఫోన్ నుంచి రెండుసార్లు ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది సీఎం ఇంటికి చేరుకునే సరికే స్వాతి మలివాల్ అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, తమకు ఫోన్ రావడంతో వెంటనే బయలుదేరి సీఎం ఇంటికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు.
ఎంపీ స్వాతి మలివాల్ ఫోన్ లో చెప్పిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. సీఎం కేజ్రీవాల్ పీఏ వైభవ్ కుమార్ తనపై దాడి చేశాడని, సీఎం నివాసంలోనే ఈ ఘటన జరిగిందని స్వాతి మలివాల్ చెప్పారన్నారు. సీఎం కేజ్రీవాల్ తన పీఏతో దాడి చేయించారని స్వాతి మలివాల్ ఫోన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. రెండుసార్లు ఫోన్ చేశారని వివరించారు. వెంటనే స్పందించిన పోలీసులు.. ఓ బృందాన్ని సీఎం నివాసానికి పంపించారు. అయితే, అక్కడ స్వాతి మలివాల్ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఆమె ఆరోపణల్లో నిజానిజాలను గుర్తించేందుకు దర్యాఫ్తు చేస్తున్నామని వివరించారు.