తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్‌ రోజు ఆగమాగమే..

తెలుగు రాష్ట్రాలకు  వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్‌ రోజు ఆగమాగమే..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో.. రెండు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. మొన్నటివరకు భానుడు భగభగా మండిపోతు నిప్పులు కురిపించగా.. మధ్యలో వరుణుడి ఎంట్రీతో వాతావరణం కొంత చల్లబడింది. . కాగా.. ప్రస్తుతం అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ వేళ.. మరోసారి వరుణుడు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.అంటే.. మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ రోజు వరుణుడు కూడా ఓటేసేందుకు విచ్చేయనున్నాడన్న మాట.

దేశంలోని పలు రాష్ట్రాల్లో మే 12 నుంచి 15 వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే..  మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా ఉండడం గమనార్హం. . తీవ్రమైన ఎండలుంటే పోలింగ్ ప్రక్రియపై ప్రభావం పడనుంది.. మండుటెండలో ఓటేసేందుకు ఓటర్లు అంతగా ఆసక్తి చూపరని అందరూ భావిస్తుంటే.. ఇప్పుడు వర్షం పడనుందని చెప్తున్నారు. ఒకవేళ వర్షం కురిసినా.. వానల్లో తడుస్తూ ఓటేసేందుకు అంతగా ఆసక్తిచూపించరని.. వర్షం కూడా ఓటింగ్ మీద ప్రభావం చూపించనుందని అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ రోజు వర్షం కురిస్తే.. అది ఓటింగ్ శాతంపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. జమ్మూ కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, గోవా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మే 12 నుంచి 15 వరకు కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖాండ్‌లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, మరాఠ్వాడా ప్రాంతాలలో వడగళ్ల వానలు వీచే అవకాశం ఉంది. ఇక 40- నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని తెలిపింది. ఉత్తరాఖండ్, మధ్య మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.