- ఎంపీ మల్లు రవి కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయని కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి తెలిపారు. ఈ అవిశ్వాస తీర్మానానికి తనతో పాటు పలువురు ఎంపీల ఇప్పటికే సంతకాలు చేశారని చెప్పారు. మంగళవారం లోక్‌సభ స్పీకర్‌కు ఈ తీర్మానాన్ని అధికారికంగా సమర్పించనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు.
పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి, బీజేపీ అజెండాను ముందుకు నడిపిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. సభను తరచూ వాయిదా వేస్తూ, పార్లమెంటరీ నియమ నిబంధనలను పాటించడం లేదని ఫైర్ అయ్యారు. చైనా భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన అంశాన్ని లేవనెత్తుతారనే భయంతోనే రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు.
