టీటీడీ సిబ్బందికి క్రీడా పోటీలు..ఆటలతో మానసిక ఉల్లాసం.. పని ఒత్తిడి ఉండదు.. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

టీటీడీ సిబ్బందికి క్రీడా పోటీలు..ఆటలతో మానసిక ఉల్లాసం..  పని ఒత్తిడి  ఉండదు.. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు   అన్ని విధాలుగా  సేవ చేస్తున్న టీటీడీ సిబ్బంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ... టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు సోమవారం ( ఫిబ్రవరి 9)  తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని పరేడ్ మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడల ద్వారా ఉద్యోగులు మానసిక ఉల్లాసంతో పాటు ..పని ఒత్తిడిని సమర్థంగా ఎదర్కొనగలరని టిటిడి అదనపు ఈవో  సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. అనంతరం క్రీడాకారులతో ప్రతిఙ్ఞ చేయించారు.  పలువురు ఉన్నతాధికారులతో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, బెలూన్లు మరియు శాంతి కపోతాలను ఎగురవేశారు.

టీటీడీ ఉద్యోగులు రోజువారీ జీవితంలో ఏదో ఒక క్రీడను అలవాటు చేసుకుంటే ఒత్తిళ్లను అధిగమించడంతో పాటు మరింత ఉత్సాహంతో, బాధ్యతతో విధులు నిర్వర్తించగలరని తెలిపారు. క్రీడలు  శారీరక ఆరోగ్యంతో పాటు ఉల్లాసం, సమయపాలన, ప్రణాళికా దృక్పథం, సానుకూల ఆలోచన, మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, కార్యనిర్వహణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, సంక్షోభ నిర్వహణ సామర్థ్యంతో పాటే అందరిని కలుపుకుని ముందుకు పోయేందుకు దోహదపడతాయని చెప్పారు.

ALSO READ :  విజయ ఏకాదశి వ్రతం.. శత్రువులపై విజయం సాధించే వ్రతం.. 

టీటీడీ  ఉద్యోగుల సంక్షేమం, మానసిక వికాసం దృష్ట్యా 1977 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఉద్యోగుల క్రీడాపోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఉద్యోగి రోజూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.అదనపు ఈవో వాలీబాల్ మ్యాచ్‌తో క్రీడాపోటీలను ప్రారంభించారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక ప్రతిభావంతులు, సీనియర్ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడల్లో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్  ఎ. ఆనంద రాజు, డిప్యూటీ ఈవోలు  వి.ఆర్. శాంతి,  సెల్వం,  రాజేంద్ర కుమార్, సీపీఆర్వో డా. టి. రవి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్  శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు , పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.