జెడ్సీలు, డీసీలకు ఆ పవర్స్ ఇవ్వొచ్చు: 11 టేబుల్ ఐటమ్స్కు GHMC స్టాండింగ్కమిటీ ఓకే 

జెడ్సీలు, డీసీలకు ఆ పవర్స్ ఇవ్వొచ్చు: 11 టేబుల్ ఐటమ్స్కు GHMC స్టాండింగ్కమిటీ ఓకే 

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌‌‌‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం సోమవారం జీహెచ్‌‌‌‌ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించారు. ఇందులో 9 అంశాలతో పాటు 11 టేబుల్ ఐటమ్స్​కు ఆమోదం తెలిపారు. మంగళవారంతో కౌన్సిల్ పదవీకాలం ముగుస్తుండడంతో స్టాండింగ్ కమిటీకి ఇదే చివరి సమావేశం. ఈ మీటింగ్​లో ఆస్తి పన్ను, ఖాళీ భూమి పన్ను విషయంలో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు  అధికారాలను అప్పగించాలని, అడిషనల్​కమిషనర్ (అడ్మిన్)కు అధికారాలను అప్పగించిస్తూ కమిషనర్ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు.

ఆస్తి పన్ను, ఖాళీ భూమి పన్ను విషయంలో ఇదివరకే కమిషనర్​తన అధికారాలను జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు బదిలీ చేశారు. 10 వేల చదరపు అడుగుల్లోపు ఉన్న ఆస్తులకి సంబంధించి పన్ను పెంపు లేదా తగ్గింపు అధికారాలను డిప్యూటీ కమిషనర్లకు, 10 వేల చ.అ కంటే ఎక్కువ ఉన్న ఆస్తుల బాధ్యత జోనల్ కమిషనర్లకు అప్పగించారు. దీనికి స్టాండింగ్​కమిటీ ఓకే చెప్పింది. 

నడిమి చెరువు అభివృద్ధి పనులకు పర్మిషన్

వీటితో పాటు బాక్స్ డ్రెయిన్ నిర్మాణంతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్​లకు సంబంధించి 9 అంశాలు ఆమోదించారు. టేబుల్ ఐటమ్స్​కింద నడిమి చెరువు అభివృద్ధి పనులకు పర్మిషన్​తో పాటు చెరువులో జంగిల్ క్లియరెన్స్, ఫెన్సింగ్, స్లూయిస్ షట్టర్లు, డ్రైనేజీ మళ్లింపు పనులకు పరిపాలనా అనుమతిచ్చారు. ఆనంద్‌‌‌‌నగర్–మన్సురాబాద్ రోడ్ అభివృద్ధికి 195 ఆస్తుల స్వాధీనం కోసం,  ప్రియదర్శిని పార్క్, సరోజినీనగర్– కోణార్క్ డయాగ్నోస్టిక్స్ రోడ్ అభివృద్ధికి 256 ఆస్తుల స్వాధీనం, కామినేని జంక్షన్, మన్సూరాబాద్ –ఎన్‌‌‌‌హెచ్ 65 రోడ్డు అభివృద్ధికి ఆమోదం తెలిపారు. 

కాప్రా సర్కిల్‌‌‌‌లో పార్కుల అభివృద్ధి వాకింగ్ ట్రాక్‌‌‌‌లు, ఓపెన్ జిమ్, పిల్లల ఆట పరికరాలు, కమ్యూనిటీ హాళ్ల పనులకు అనుమతి ప్రతిపాదనకు ఆమోదించడంతో పాటు హెచ్‌‌‌‌ఎమ్‌‌‌‌టీ నగర్‌‌‌‌లో రైతు బజార్ పక్కన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆమోదించారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఉన్న ఎలివేటెడ్ కారిడార్‌‌‌‌ను శ్రీ బండారి రాజీ రెడ్డి కారిడార్ గా నామకరణం చేయాలన్న ప్రతిపాదనను సరైన నిర్ణయం  కోసం రాష్ట్ర ప్రభుత్వానికీ పంపాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. 

తర్వాత ఇటీవల వివిధ నగరాల్లో పర్యటించిన కార్పొరేటర్లు ఆ స్టడీ రిపోర్ట్  ని కమిషనర్, మేయర్ అందజేశారు. మేయర్  మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థ జీహెచ్ఎంసీకి మేయర్‌‌‌‌గా పనిచేయడం గర్వంగా ఉందన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ క్లిష్టమైన కాలంలోనూ అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించామన్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత,  మహాలక్ష్మి, జగదీశ్వర్ గౌడ్  పాల్గొన్నారు.