- ఇంటెలిజెన్స్ రిపోర్టులు చూసి బీజేపీపై ఫ్రస్ట్రేషన్: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాకముందే సీఎం రేవంత్ రెడ్డి తన ఓటమిని ఒప్పేసుకున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులు చూసి ఫ్రస్ట్రేషన్‌లో బీజేపీపై అవాకులు చవాకులు పేలుతున్నారని వ్యాఖ్యానించారు. రెండేండ్ల పాలనలో మున్సిపాలిటీలకు నయాపైసా ఇవ్వని కాంగ్రెస్‌కు జనం బుద్ధి చెప్పేందుకు డిసైడ్ అయ్యారని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం తన చేతగానితనాన్ని ఇతరులపై నెట్టడం మానుకోవాలని సూచించారు.
‘‘నాకు చేతకాదు.. నాకు ఆవేశం, పౌరుషం లేదు.. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదని కేంద్రానికి లేఖ రాయండి.. అప్పుడు మేం ఏం చేస్తమో మీరే చూస్తారు’’ అని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ అనే నాగుపామును ఖతం చేశారని, రేపు జెర్రిపోతులాంటి కాంగ్రెస్‌కు కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.
రెండేండ్లలో కేంద్రం నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఏం ఇచ్చిందో చెప్పాలన్నారు. 6 గ్యారెంటీలను అమలు చేయకుండా, ఉద్యోగులకు డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై సరైన వాదనలు వినిపించే దమ్ము ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రేవంత్ సీఎంగా ఉండగానే ప్రభాకర్‌రావు విదేశాలకు పారిపోయారని, అప్పుడు ఆపకుండా ఇప్పుడు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, ఎంఐఎం డీల్..
సీఎం రేవంత్, అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే వారిద్దరి స్క్రిప్ట్ దారుస్సలాంలోనో, గాంధీభవన్‌లోనో రెడీ అయినట్టుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మొన్న తన భార్య కంటే బండి సంజయే ఎక్కువని ఒవైసీ అన్నారని, ఇవ్వాల బండి సంజయ్‌కి ఒవైసీ దేవుడని సీఎం అంటున్నారని.. ఇదంతా ఆ డీల్ లో భాగమేనని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్ కుదిరిందా? కాంగ్రెస్ అభ్యర్థులకు పైసలివ్వకుండా ఎంఐఎం వాళ్లకు ఎందుకు పంపిస్తున్నరు?’’ అని ప్రశ్నించారు.
