- రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణి ఆగమైంది
- బొగ్గు కుంభకోణం బయట పెట్టినందుకే
- ఫోన్ ట్యాపింగ్ విచారణ కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదని వ్యాఖ్య
జయశంకర్ భూపాలపల్లి/ పరకాల/ మహబూబాబాద్ అర్బన్, వెలుగు: జిల్లాలను తొలగించనని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు కానీ.. బరాబర్ తొలగిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు.. చేసేది చెప్పడు’’అని ఆయన విమర్శించారు. జిల్లాల తొలగింపు ఉండదు అనడానికి రేవంత్ ఏమైనా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. సోమవారం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో, హనుమకొండ జిల్లా పరకాల, మహబూబాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రెండేండ్ల కింద ఇంటింటికీ వెళ్లి గ్యారంటీ కార్డులు ఇచ్చారని, అందులో చెప్పిన 4వేల పింఛన్, ఆడపడచులకు 2,500 సాయం అందుతున్నాయా? అని అడిగారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణిని ఆగం జేసింన్రని కేటీఆర్ ఆరోపించారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కాదని.. లాగుల తొండల రెడ్డి అని ఎద్దేవా చేశారు. హామీల గురించి అడిగితే బూతులు మాట్లాడుతున్నాడని.. ఇలాంటి సీఎంను ఎక్కడైనా చూశారా? అని ప్రశ్నించారు.
నల్లబంగారాన్ని సృజన్ రెడ్డికి రాసిచ్చిండు
నల్లబంగారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆయన అత్తగారి కొంగు బంగారంగా మార్చాడని, తన బావమరిది సృజన్ రెడ్డికి రాసిచ్చిండని కేటీఆర్ఆరోపించారు. గతేడాది మే నుంచి ఇప్పటివరకు సింగరేణిలో 6వేల కోట్ల దోపిడీ జరిగిందని, బొగ్గు కుంభకోణం గురించి మాట్లాడినందుకే ఫోన్ ట్యాపింగ్ కేసుల పేరుతో తమను విచారణకు పిలుస్తున్నారని అన్నారు. సింగరేణిలో నచ్చినోళ్లకు కాంట్రాక్ట్ లు ఇచ్చేందుకు సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన తెచ్చారని, గనుల విజిట్ కు కంపెనోళ్లు రాంగనే బావమరిది వాళ్ల ఫోన్ నంబర్లు తీసుకుని వాళ్లకు ఫోన్ చేసి బెదిస్తున్నాడని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అన్నారు. ఆ కేసు ఆధారాలు లేకుండా ఫోరెనిక్స్ ల్యాబ్‌ను అగ్గిపెట్టి బుగ్గి చేశాడని ఆరోపించారు.
రెండేండ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే
కాంగ్రెస్ కు ఇంకా రెండేండ్ల టైం మాత్రమే ఉందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి బూతులు తిట్టడం తప్ప రాష్ట్రాన్ని పాలించడం చేతనైతలేదని ఆరోపించారు. కేసీఆర్ ను తిడితే ఇక చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రేవంత్ .. చంద్రబాబు నాయుడు డబ్బు సంచులు పట్టుకుని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే బ్రోకర్ పనులు చేశారని పేర్కొన్నారు. లక్కీడ్రాలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడన్నారు. కాంగ్రెస్ 420 హామీలను బరాబర్ అడుగుతామన్నారు. అధికారం ఎవరి సోత్తు కాదని పోలీసు అధికారులు గుర్తుంచుకోవాలని.. మళ్లా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని.. ఇప్పుడు ఎవరైతే నకరాలు చేస్తున్నారో వారి తోకలు కట్ చేస్తామని అన్నారు. 12 ఏండ్ల క్రితం ఢిల్లీ పీఠం ఎక్కిన బీజేపీ చేసింది శూన్యం అన్నారు. పూజకు పనికి రాని పువ్వుకు ఓటేస్తే పనికి రాకుండా పోతుందన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే.. కొత్త పథకాలేమో గానీ ఉన్న పథకాలు ఊడిపోయాయని కేటీఆర్పేర్కొన్నారు. రెండేండ్ల కిందట బీఆర్ఎస్ ను ఓడగొట్టి తెలంగాణ ప్రజలు నష్టపోయారని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఒకసారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఐదేండ్లు బాధ పడాల్సి వస్తుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిని గెలిపిస్తే పరకాలకు ఐటీ కంపెనీలు తీసుకొస్తాడని, కొత్త కంపెనీలు రావాలన్నా, కొత్త ఉద్యోగాలు కావాలన్నా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. మహబూబాబాద్‌లో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన శంకర్ నాయక్‌ను ఓడించారని, ఈ ఎన్నికల్లో మళ్లీ అలాంటి తప్పు చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, సాంబారి సమ్మారావు, వాసుదేవరెడ్డి, బుర్ర రమేశ్‌గౌడ్, కటకం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
