శ్రీశైలంలో తొక్కిసలాట..శివస్వాములపై పోలీసుల లాఠీచార్జ్

శ్రీశైలంలో  తొక్కిసలాట..శివస్వాములపై పోలీసుల లాఠీచార్జ్
  •   క్యూలైన్లలో గంటల తరబడివేచి ఉన్నా దర్శనం 
  • కాకపోవడంతో భక్తుల ఆగ్రహం
  •     కంపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో ఉక్కపోత తాళలేక సొమ్మసిల్లిన పలువురు  
  •     ఆందోళనకు దిగిన శివస్వాములపై పోలీసుల లాఠీచార్జ్ 
  •     రద్దీ పెరగడంతో గందరగోళం: ఆలయ ఈవో


హైదరాబాద్, వెలుగు: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ఏపీలోని శ్రీశైల ఆలయంలో  ఉద్రిక్తత నెలకొంది. శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది భక్తులు, శివస్వాములు దేవస్థానం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నా దర్శనం లభించకపోవడం, తగిన సౌలతులు కల్పించకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. దర్శనం కోసం కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. గంటల తరబడి కంపార్ట్‌‌మెంట్లలో బందీలుగా ఉన్న భక్తులు ఉక్కపోతకు తాళలేక సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి చేయి దాటడంతో కృష్ణదేవరాయ క్యూలైన్ల గేట్లను భక్తులు విరగ్గొట్టి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. కొందరు భక్తులు ప్రాణభయంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌‌ల ద్వారా, గోడలు దూకి బయటకు వచ్చేశారు. అనంతరం ‘ఈఓ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించడంలో విఫలమైన పోలీసులు.. ఆందోళన చేస్తున్న శివస్వాములపై కఠినంగా వ్యవహరించడం మరింత దుమారం రేపింది. అడిషనల్ ఎస్పీ యుగేంద్ర బాబు.. శివస్వాములపై లాఠీ ఎత్తడం, భౌతికంగా చేయి చేసుకున్నారు. ఇది విమర్శలకు దారితీసింది. శాంతియుతంగా ఉండాల్సిన క్షేత్రంలో లాఠీచార్జ్ చేయడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

కుట్రతో గొడవ చేశారన్న ఈవో

ఘటనలపై ఆలయ ఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తనపై కక్షతో కొందరు కావాలనే శివస్వాముల వేషంలో వచ్చి గొడవ సృష్టించారని  ఆరోపించారు. రద్దీని కట్టడి చేయడానికే పోలీసులు జోక్యం చేసుకున్నారని చెప్పారు. మొదటి రోజు విజయవంతమైందని, రెండో రోజు రద్దీ పెరగడం వల్లే గందరగోళం ఏర్పడిందని ఆలయ చైర్మన్ పేర్కొన్నారు. భక్తులు సంయమనం పాటించాలని, ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.