పాపికొండల ప్రయాణం ఆహ్లాదకరమే.. కానీ ప్రమాదకరం

పాపికొండల ప్రయాణం ఆహ్లాదకరమే.. కానీ ప్రమాదకరం

రాజమహేంద్రవరం నుంచి భద్రచలానికి పడవ ప్రయాణం ఈనాటిది కాదు. ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉండడంతో అందరూ రాజమహేంద్రవరం నుంచి పాపికొండల టూర్ కు ఇష్టపడుతుంటారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పోశమ్మ గండి నుంచి పాపికొండల వరకు 62 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో ప్రమాద ప్రాంతాలు ఎక్కడ ఉంటాయో తెలిపే హెచ్చరిక సూచికలు లేవు. పైగా అనుభవం ఉన్న వారు బోట్లు నడిపితేనే సురక్షితం.

కచ్చులూరు దగ్గర ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాల ముందే.. డేంజర్ స్పాట్ కు వచ్చామని అనౌన్స్ చేశారు. ఆ కొద్ది సేపట్లోనే పడవ మునిగిపోయింది. రాజమహేంద్రవరం నుంచి పాపికొండల వరకు ప్రయాణమంటేనే గోదావరికి ఎదురీదడం. పాపికొండలకు చేరువవుతున్న కొద్దీ కొండలు సన్నగా అవుతుంటాయి. కచ్చులూరు దగ్గర నదీ ప్రవాహానికి కొండ అడ్డుగా ఉండడంతో సుడిగుండాలు ఎక్కువగా ఉంటాయి. సుడిగుండాల్లో చిక్కుకునే పెద్దపెద్ద బోట్లు.. బండరాళ్లను ఢీకొని, బోల్తా పడడం లేదా రంధ్రం పడి నీళ్లు లోపలికి వెళ్తుంటాయి. ఈ సుడిగుండాల్లో బోటు చిక్కుకుంటే ప్రవాహ వేగానికి బయటపడడం దాదాపు అసాధ్యమని ఇరిగేషన్ నిపుణులు అంటున్నారు.