ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతా ఏర్పాట్లు.. రైతులు రాకుండా పహారా

ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతా ఏర్పాట్లు..  రైతులు రాకుండా పహారా

ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో…అగ్రిచట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఢిల్లీ పోలీసులు,ఆర్మీ, పారామిలటరీ బలగాలతో మూడంచెల  భద్రత ఏర్పాటు చేశారు. ఘాజీపూర్ దగ్గర భారీ ఫెన్సింగ్ తో పాటు ఢిల్లీ,యూపీ పోలీసులు పహరా కాస్తున్నారు. సింఘు,టిక్రి సరిహద్దుల దగ్గర హర్యానా, ఢిల్లీ పోలీసులు మోహరించారు.

జనవరి 26 తరహాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు పోలీసులు. మరోవైపు రైతులు మాత్రం కొత్త అగ్రిచట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు విరమించేది లేదని చెప్తున్నారు. స్థానికుల రాకపోకలకు ఆటంకం కలిగించేలా బారికేడ్లు అడ్డు పెట్టడాన్ని తప్పు పడుతున్నారు. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

జనవరి 26 ఘటనపై ఇప్పటికే 200 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో 32 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశారు. 40 మంది రైతు సంఘాల నాయకులకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసులను పరిశీలిస్తున్నారు.