గత ప్రభుత్వాలు రిస్క్ తీసుకునే సాహసం చేయలే

గత ప్రభుత్వాలు రిస్క్ తీసుకునే సాహసం చేయలే

న్యూఢిల్లీ: కాన్ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వర్చువల్ మీటింగ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ గత కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు. దేశ ప్రయోజనాలు, సంస్కరణల విషయంలో సైతం ఏనాడూ గత ప్రభుత్వాలు పొలిటికల్ రిస్క్ తీసుకునే సాహసం చేయలేదని అన్నారు. అయితే తమ ప్రభుత్వం ఈ విషయంలో ఎప్పుడూ వెనుకడుగేయాలేదన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి కూడా భయపడలేదని మోడీ చెప్పారు. బుధవారం సాయంత్రం సీఐఐ వర్చువల్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా జీఎస్టీ రిఫామ్స్‌ గురించి ప్రస్తావిస్తూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలో పన్ను విధానంలో సంస్కరణలు తీసుకురావడంలో ఏండ్ల తరబడి ఆలస్యం జరిగింది. జీఎస్టీ అమలులోకి తేవడంపై ఎన్నో సంవత్సరాలుగా చర్చ నడిచింది. కానీ పొలిటికల్ రిస్క్ చేసేందుకు గత ప్రభుత్వాలు ధైర్యం చేయలేదు. మేం వచ్చాక జీఎస్టీని అమలులోకి తెచ్చాం. అంతేకాదు ఏటా రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు వస్తున్నాయి” అని ప్రధాని మోడీ చెప్పారు. ప్రస్తుతం భారత్‌కు రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు (ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్) వస్తున్నాయని, గడిచిన కొన్నేండ్లుగా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని అన్నారు. ఈ కరోనా క్రైసిస్‌ టైమ్‌లోనూ ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామని, రిఫామ్స్ కంటిన్యూ చేశామని చెప్పారు. తమ ప్రభుత్వం ఈ నిర్ణయాలేవీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయలేదని, దృఢ నిశ్చయంతో చేసిందని స్పష్టం చేశారు.

ఎకానమీ పుంజుకుంటోంది

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా క్రైసిస్‌లో కొట్టుమిట్టాడుతున్నా.. భారత ఎకానమీ వేగంగా పుంజుకుంటోందని ప్రధాని మోడీ అన్నారు. ఇందులో పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. కొత్త టార్గెట్లు పెట్టుకుని వాటిని సాధించేందుకు కృషి చేస్తామని సంకల్పంతో పని చేయాల్సిన సమయమిదని పారిశ్రామికవేత్తలకు సూచించారు. ఆత్మ నిర్భర భారత్ లక్ష్యంగా పని చేయడంలో ప్రధాన భూమిక వారిదేనని చెప్పారు. ప్రపంచంతో పోటీపడుతూనే, భుజం కలిపి నడిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని, గడిచిన కొన్నేండ్లలో పరిస్థితులు చాలా మారాయని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ బలంగా ముందుకొస్తున్నాయని మోడీ అన్నారు. ప్రస్తుతం దేశ ప్రజల్లోనూ సెంటిమెంట్ బలంగా ఉందని, భారత్‌లోనే తయారైన వస్తువులపై ఎక్కువగా కొనడానికి ఇష్టం చూపిస్తున్నారని అన్నారు. అయితే తయారు చేసే కంపెనీ ఇండియాదా కాదా అన్న విషయం కంటే అది ఎక్కడ తయారైందన్నది పరిగణనలోకి తీసుకుంటున్నారని, అందుకే అన్ని రకాల ఇండస్ట్రీలనూ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు.