V6 News

పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగనున్నాయా..?: ప్రచారంపై కంపెనీలు ఏమంటున్నాయి..!

పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగనున్నాయా..?: ప్రచారంపై కంపెనీలు ఏమంటున్నాయి..!

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా..? 2026, ఏప్రిల్ 14 నుంచి ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలు పెంచాలని ఆలోచిస్తున్నాయా..? హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తామన్న ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరల భారాన్ని ప్రజలపై మోపేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధమయ్యాయా..? అంటే అంతర్జాతీయ మీడియా వర్గాల నుంచి  అవుననే సమాధానం వినిపిస్తోంది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మరోసారి సెంచరీ దాటడంతో ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడ్చుకునేందుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు నేషనల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2026, ఏప్రిల్ 14 నుంచి ఇంధన ధరలను పెంచేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి. 

పశ్చిమాసియాలో ఆరు వారాలుగా సాగుతోన్న యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో హార్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. ఇరాన్ చర్యతో ఇక లాభం లేదనుకున్న ట్రంప్ హార్మూజ్ జలసంధిని ఇరాన్ కాదు మేమే దిగ్భంధనం చేస్తామని ప్రకటించారు. ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లి వచ్చే నౌకలు, అలాగే ఇరాన్‎కు పన్ను చెల్లించి హార్మూజ్‎లో రాకపోకలు సాగించే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ట్రంప్ ప్రకటనతో హార్మూజ్ జలసంధి మీదుగా ముడి చమురు రవాణాకు సాగదని స్పష్టమైంది. 

ఈ ప్రకటన వెలువడిన నిమిషాల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు సెంచరీ మార్క్ క్రాస్ చేశాయి. ఇరాన్, అమెరికా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో దిగొచ్చిన క్రూడాయిల్ ధరలకు ఈ ప్రకటనతో అమాంతం రెక్కలొచ్చాయి. ఏప్రిల్ 13న క్రూడాయిల్ ధరలు దాదాపు 8 శాతం పెరిగింది. ముడి చమురు ధరల పెరుగుదల ఇండియాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎందుకంటే ఇండియా దాదాపు 80 శాతం ముడి చమురును గల్ఫ్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో దాదాపు 40 శాతం మేర హార్మూజ్ జల సంధి గుండానే రవాణా అవుతోంది. 

ధరలు పెంచేందుకు సిద్ధమైన ఆయిల్ కంపెనీలు..?

ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు అమాంతం పెరగడంతో దేశంలోని ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలు పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నియంత్రణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం మంగళవారం (ఏప్రిల్ 14) ధరల పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సోమవారం (ఏప్రిల్ 13) అత్యవసర సమావేశం నిర్వహించి ఇంధన ధరల పెంపుపై చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.

ఇప్పటికే ఆయిల్ కంపెనీలకు ఎక్సైజ్ సుంకాలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అంతకంతకు పెరుగుతుండటంతో చేసేదేమిక లేక ఇంధన ధరలను స్వల్పంగా పెంచవచ్చని ప్రచారం ఊపందుకుంది. అయితే, ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో చమురు ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజులు వాయిదా వేసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతోన్న ఐదు రాష్ట్రాలపై బీజేపీకి పెద్దగా ఆశలు లేకపోవడంతో చమురు ధరలను స్వల్పంగా పెంచేందుకు కేంద్రం మొగ్గు చూపొచ్చని.. లీటర్ పెట్రోల్ ధర సగటున రూ. 5 నుంచి రూ. 8 మేర పెంచే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీంతో చమురు ధరల పెంపుకు సంబంధించి తమ జేబుకు చిల్లుపడే పిడుగు లాంటి వార్త ఎప్పుడూ వినాల్సి వస్తుందోనని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

నిపుణుల అంచనా ప్రకారం కింద విధంగా చమురు ధరలు పెరగొచ్చు:

న్యూఢిల్లీ: పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77 నుంచి రూ.102-105 కు పెరిగే అవకాశం ఉంది.
ముంబై: పెట్రోల్ ధర లీటరుకు రూ. 103.54 నుంచి రూ. 112-115.00 కు పెరిగే అవకాశం ఉంది. 
బెంగళూరు: ధర రూ. 102.92 నుంచి రూ. 110 – 113 కు పెరిగే అవకాశం ఉంది.

హైదరాబాద్: పెట్రోల్ ధర లీటరుకు రూ. 102.92 నుంచి రూ. 110 – 113 కు పెరిగే అవకాశం ఉంది.