దేశ రాజధాని ఢిల్లీని తాకిన మరో పంచాయతీ.. ఓ పక్క విద్యార్థులు ఆందోళనలు చేస్తుండగా.. మరో వైపు కేంద్రప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు తెలిపేందుకు ఢిల్లీ వైపు కదం తొక్కుతున్నారు. నీట్ పేపర్ లీకులకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థుల నిరసనలు ఢిల్లీని కుదిపేస్తుండగా.. అమెరికాతో ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా కిసాన్ మహాపంచాయత్ కోసం వేలాది మంది హర్యానా, పంజాబ్ రైతులు దేశ రాజధాని వైపు దూసుకొస్తున్నారు. రైతులను అడ్డుకునేందుకు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దు శంభు దగ్గర భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. సరిహద్దు పాయింట్ దగ్గర బారీకేడ్లు, సిమెంట్ దిమ్మెలను ఉంచి రోడ్డును బ్లాక్ చేశారు పోలీసులు.
మంగళవారం (జూలై21) ఉదయం జాతీయ జెండా, రైతు సంఘాల జెండాలతో దేశరాజధాని వైపు కదిలారు హర్యానా పంజాబ్ రైతులు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ లో ఒకరోజు కిసాన్ మహాపంచాయత్ నిర్వహించేందుకు సిద్దమయ్యారు. దీంతో రైతులను ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకునేందుకు శంభు బార్డర్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. రైతులను నిలువరించేందుకు ఘగ్గర్ నదిపై వంతెనను పూర్తిగా మూసివేశారు.
#WATCH | A large number of farmers reach Shambhu Border (Punjab-Haryana border) ahead of their scheduled march to Delhi today. Visuals from Patiala (Punjab) side. pic.twitter.com/dJtdEt0qti
— ANI (@ANI) July 21, 2026
ఢిల్లీలో రైతులు ధర్నా కొత్తగా ప్రకటిందేం కాదు.. ఇంతకు ముందే మహాపంచాయత్ నిర్వహిస్తామని పంజాబ్ , హర్యానా రైతులు చెప్పారు. ప్రణాళికలో భాంగానే పంజాబ్ నలుమూలనుంచి వందలాది మంది రైతులు బస్సుల్లో ఢిల్లీ వెళ్లేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు .అయితే శాంతి యుతంగా ఢిల్లీ వెళ్లాలనుకున్న రైతులను హర్యానా ప్రభుత్వం అడ్డుకుంటోందని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. భారత్, అమెరికా ట్రేడ్ డీల్ ఇంకా కుదరకపోయినా.. ప్రతిపాదించినఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దేశ వ్యవసాయ రంగంపై తీవ్రంగా ప్రభావితం చేస్తుందని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపాదిత ట్రేడ్ డీల్ తో భారతదేశంలోకి చౌకగా అమెరికా వ్యవసాయ దిగుమతులకు అనుమతి లభిస్తుందని, ఇది దేశీయ రైతుల ఆదాయాలను, దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని రైతులు వాదిస్తున్నారు. దీంతో రైతులు, వ్యవసాయ కార్మికులు, పశుపోషకులు, చిన్న వ్యాపారులు, సూక్ష్మ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతిపాదిత ఒప్పందం కొన్ని వస్తువులకే పరిమితం కాకుండా, వ్యవసాయం, పాడి, పరిశ్రమ, డిజిటల్ వాణిజ్యం, ఇ-కామర్స్, ప్రభుత్వ కొనుగోళ్లు, మేధో సంపత్తి హక్కులు, సేవల రంగంతో సహా అనేక రంగాలకు వర్తిస్తుందని రైతులు తెలిపారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ, ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని విరమించుకుని, రైతులు ,సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడాలని రైతులు కోరారు. గతంలో రైతుల తమ పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరేందుకు ఢిల్లీకి వెళ్లాలని పిలుపునిచ్చినప్పుడు, 2024 ఫిబ్రవరిలో కూడా ఇలాగే రైతులను అడ్డుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అప్పట్లో రైతుల నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
