విద్యార్థులను రక్తం వచ్చేలా కొట్టినందుకు ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరూ రాజీనామా చేయాలి: ఖర్గే

విద్యార్థులను రక్తం వచ్చేలా కొట్టినందుకు ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరూ రాజీనామా చేయాలి: ఖర్గే

న్యూఢిల్లీ: శాంతియుతంగా ఆందోళన తెలుపుతోన్న సీజేపీ నిరసనకారులపై పోలీసుల బలప్రయోగానికి నిరసనగా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా సీజేపీ కార్యకర్తలపై పోలీసుల చర్యకు నిరసనగా మంగళవారం (జులై 21) ప్రధాని మోడీ నివాసం దగ్గర కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది.

లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు వ్యతిరేకంగా గళం విప్పిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. 

మోడీ సర్కార్‎ను నిరంకుశ ప్రభుత్వమని అభివర్ణించిన ఖర్గే.. శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేస్తోన్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, బలప్రయోగంపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. యువతపై జరుగుతున్న ఈ దమనకాండ, అణచివేతకు ప్రధాని మోడీ, అమిత్ షా బాధ్యులని.. దీనికి బాధ్యత వహిస్తూ ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.

మోడీ ఇంటి ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నా:

కాక్రోచ్ పార్టీ నిరసనకారులపై లాఠీఛార్జ్ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి యత్నించింది. ప్రధాని మోదీ ఇంటి దగ్గరలో మెరుపు ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే భాగమై ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వ తీరును, పోలీసుల తీరును కాంగ్రెస్ నేతలు ఎండగట్టారు. ప్రధాని మోదీ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నిరసనలో భాగమైన కాంగ్రెస్ ప్రముఖ నేతలంతా చేతులకు తాళ్లు కట్టుకుని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, గొంతెత్తితే బేడీలు వేసి బంధిస్తుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

విద్యాశాఖ మంత్రిగా ఫెయిలైన ధర్మేంద్ర ప్రధాన్తో కనీసం రాజీనామా చేయించలేని అసమర్థ ప్రధాని మోదీ అని రాహుల్​ఎద్దేవా చేశారు. దేశంలో 152 సార్లు పేపర్లు లీకై, 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారినా ఒక్క దోషికి శిక్ష పడలేదని మండిపడ్డారు.

చదువు, భవిష్యత్తుపై న్యాయమైన ప్రశ్నలు అడిగితే లాఠీదెబ్బలు, అరెస్టులు బహుమతిగా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. పేపర్లు లీక్ నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, న్యాయం కోసం గొంతెత్తిన విద్యార్థులను చితక్కొడుతున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.