ఫ్యామిలీతో ఇదే చివరి కాల్ కావచ్చు..!

ఫ్యామిలీతో ఇదే చివరి కాల్ కావచ్చు..!
  • ట్రంప్ టీంతో చర్చలను గుర్తుచేసుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి

టెహ్రాన్: ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అమెరికాతో జరిగిన శాంతి చర్చల సమయంలో ఇరాన్ రాయబారులు ఎదుర్కొన్న తీవ్రమైన ప్రమాదకర పరిస్థితుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్‌‌‌‌కాఫ్‌‌‌‌తో జరిగిన సంభాషణను ఆయన గుర్తుచేసుకున్నారు.

‘ఏ క్షణంలోనైనా తాము ఉన్న సమావేశంపై బాంబు దాడి జరగొచ్చనే భయంతో మీరు ఎప్పుడైనా చర్చల్లో కూర్చున్నారా? ఫోన్‌‌‌‌లో మాట్లాడుతుండగానే దాడికి గురై చనిపోతామేమోనని భావించారా? కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు 'ఇదే చివరిసారి కావచ్చు' అని ఎప్పుడైనా అనుకున్నారా?" అని విట్‌‌‌‌కాఫ్‌‌‌‌ను ప్రశ్నించినట్టు తెలిపారు. అయితే, అమెరికా, ఇజ్రాయెల్ నుంచి తీవ్ర బెదిరింపులు ఉన్నప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. 

ఇరాన్ తన వద్ద యురేనియం శుద్ధిని సున్నాకి తగ్గించాలన్న అమెరికా అక్రమ డిమాండ్‌‌‌‌ను తిరస్కరించిందని, చర్చల ద్వారా అనుకున్నది సాధించలేకనే వారు యుద్ధానికి దిగారని తెలిపారు. పన్నెండు రోజుల పాటు జరిగిన యుద్ధంలో శత్రువులు ఓడిపోయారని అరాఘ్చి పేర్కొన్నారు. ‘మాతో మాట్లాడాలి అంతేగానీ, బెదిరించడాలు లేదా లంచాలు ఇవ్వడం కుదరదు’ అని తేల్చి చెప్పారు. అలాగే, సైనిక ఒత్తిడి ద్వారా ఇరాన్‌‌‌‌ను లొంగదీసుకోవచ్చన్న వాషింగ్టన్ అంచనాలను అరాఘ్చి తీవ్రంగా ఖండించారు.