V6 News

నెహ్రూ, పటేల్​ కృషితోనే దేశంలో హైదరాబాద్​ విలీనం

నెహ్రూ, పటేల్​ కృషితోనే దేశంలో హైదరాబాద్​ విలీనం

బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందన్న ఉత్తమ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ విలీన చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ​ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. నెహ్రూ, వల్లభాయ్​పటేల్​ కృషితోనే హైదరాబాద్​ సంస్థానం దేశంలో విలీనమైందన్నారు. హైదరాబాద్​ విలీన కార్యక్రమాన్ని గాంధీభవన్​లో మంగళవారం నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాట యోధులను ఉత్తమ్​సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రకు చెందిన రాంమాధవ్​కు తెలంగాణ చరిత్ర తెలియదన్నారు. నిజాంకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే ఉద్యమం చేశాయని చెప్పారు. హైదరాబాద్​ సంస్థానాన్ని పాకిస్థాన్​లో కలపాలని నిజాం రాజు చూశారని, కానీ ఆపరేషన్​ పోలోతో వల్లభాయ్​పటేల్​ దేశంలో విలీనం చేశారని గుర్తుచేశారు.

విలీన దినంపై కేసీఆర్​వి కుంటిసాకులు

తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఏర్పాటుకు ముందు మాట్లాడిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై కుంటిసాకులు చెబుతున్నారని ఉత్తమ్​విమర్శించారు. హైదరాబాద్​ విలీన దినోత్సవాన్ని తెలంగాణ పరిరక్షణ దినంగా పాటిస్తూ పీసీసీ ఆధ్వర్యంలో కోఠిలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్​మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయంలో విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్.. ఒక్క రోజు కూడా వారి ఆఫీసులో జరిగిన కార్యక్రమానికి హాజరుకాలేదని, ఇది సిగ్గుచేటని అన్నారు. హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో జరిగిన నిజాం వ్యతిరేక పోరాటం చరిత్రాత్మకమైనదని కొనియాడారు. నిజాం వ్యతిరేక పోరాటంలో ఎలాంటి పాత్ర లేని వారు ప్రస్తుతం ఆ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

సభ్యత్వ నమోదు పక్కాగా ఉండాలి: కుంతియా

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని, ఇంట్లో కూర్చొని సభ్యత్వాలు చేయించొద్దని ఏఐసీసీ ఇన్​చార్జి ఆర్సీ కుంతియా పీసీసీ నేతలకు సూచించారు. క్రియాశీల సభ్యత్వాలు అవసరం లేదని, అన్నీ సాధారణ సభ్యత్వాలనే చేయించాలన్నారు. పీసీసీ చీఫ్​ ఉత్తమ్​అధ్యక్షతన గాంధీభవన్​లో మంగళవారం జరిగిన పీసీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పార్టీ నేతలకు కుంతియా దిశానిర్ధేశం చేశారు. నియోజకవర్గానికి 30 వేల చొప్పున సభ్యత్వాలు చేయించాలన్నారు. మున్సిపల్​ ఎన్నికల వ్యవహారం కోర్టులో ఉందని,  స్పష్టత వచ్చాక ముందుకెళ్దామని పార్టీ నేతలకు సూచించారు. హుజూర్​నగర్​ ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. యురేనియం తవ్వకాల విషయంలో వేసిన కమిటీ సిఫారసుల మేరకు ఉద్యమాన్ని కొనసాగిద్దామని కుంతియా చెప్పారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్ ​సూచించారు.

PCC chief Utham says BJP distorts history of Hyderabad merged in country