రాత్రిపూట  విషవాయువులు.. జనం ఉక్కిరి బిక్కిరి

రాత్రిపూట  విషవాయువులు.. జనం ఉక్కిరి బిక్కిరి

పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని పాశమైలారం   అతిపెద్ద పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందింది. ఇక్కడి పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు మెండుగా దొరుకుతాయని ఆశపడ్డ పరిసర  గ్రామాల ప్రజలకు ఇక్కడి పరిశ్రమలు వదిలే వాయు కాలుష్యాం ప్రాణసంకటంగా మారుతున్నది.   ఉపాధి మాట దేవుడెరుగు  మా ఊపిరితిత్తులు పాడైపోతున్నాయని స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటాన్ చెరు  నియోజకవర్గం పరిధిలో పాశమైలారం, జిన్నారం, బొల్లారం,  గుమ్మడిదల  పారిశ్రామిక వాడల్లో  పెద్ద సంఖ్యలో  చిన్న, పెద్ద  పరిశ్రమలు ఉన్నాయి. కానీ వీటితో చుట్టుముట్టున్న  గ్రామాల ప్రజలకు ఇక్కడి  పరిశ్రమలు  వదులుతున్న వాయు కాలుష్యంతో ఇబ్బందులు తప్పడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంతో దవాఖానల  బారిన పడుతున్నారు. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని గుర్తించాల్సిన పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు యంత్రాంగం  ఇదంతా షరా మామూలే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంపై  ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉదయం లేచిన నుంచి మొదలు 24 గంటలు వరకు కూడ  వివిధ కంపెనీల నుంచి  రకరకాల విషవాయువులను పీలుస్తూ  ఇక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇటీవల కొన్ని పరిశ్రమల నుంచి  రాత్రిపూట విషవాయువులు వెలువడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇదంతా  తెలియకుండా ఇక్కడ ఇల్లు కట్టుకున్నామని,  ఇక్కడ ఉండాలంటే రోగాలు  కొని తెచ్చుకోవడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నరు. కొందరు ఏకంగా  సొంత ఇండ్లను వదులుకొని వేరే ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఖాళీ చేసిన ఇండ్లను అద్దెకు ఇద్దామని అనుకున్నా  ఎవ్వరూ కూడా  అయిదారు నెలల కంటే ఎక్కువ ఉండడం లేదని  పలువురు వాపోతున్నారు. పాశమైలారం  గ్రామంతోపాటు, ఇస్నాపూర్, కర్దనూర్, నందిగామ, చిట్కుల్, బానూరు, రుద్రారం గ్రామాల ప్రజలకు  రాత్రిపూట  ఏకదాటిగా గంటా రెండు గంటల వరకు దట్టమైన పొగలు వదులుతున్నారని, దాందా చిన్న పిల్లలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా గర్భిణీలకు వీటి వల్ల ప్రమాదం ఉందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లు వదిలి వాయు, జల కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామాల ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.