మొక్కలను నాటుడే కాదు బతికించాలె

మొక్కలను నాటుడే కాదు బతికించాలె

ఇన్ని రోజులు ఆదరబాదరగా మొక్కలు నాటామంటే నాటినట్లుగా చేశారు. కానీ ఈ దఫాలో క్వాలిటీ మీద దృష్టి పెట్టడంతో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెట్ల పెంపకం, మొక్కలు నాటడంలో కొంత అనుభవం ఉన్న ఫారెస్టు డిపార్ట్ మెంట్ ను భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రతి జిల్లాల్లో ఉన్న ఫారెస్టు స్టాఫ్ కు కొన్ని గ్రామాల బాధ్యతలు అప్పగించారు. వీరు ఆ గ్రామాలవారికి టెక్నికల్​ సపోర్టు అందించనున్నారు. కొద్ది రోజుల నుంచి అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇలా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కలను ఎలా నాటాలి.. ఎలా రవాణా చేయాలి.. నాటిన తరవాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను ఈ శిక్షణ కార్యక్రమాల్లో చెప్పారు.

సగం కూడా బతకలే..

గత ఐదేళ్లుగా  జూన్, జులై మాసం  వచ్చిందంటే చాలు నర్సరీల్లో మొక్కలు తీసుకురావడం.. గ్రామాల్లో పంపిణీ చేయడం.. లెక్కలు రాసుకోవడం..  ఇదే తంతుగా జరిగింది. అడవుల్లో  నాటిన 30 కోట్ల మొక్కల గురించి పక్కన పెడితే మిగిలిన 150 కోట్ల మొక్కల్లో సగానికి సగం కూడా బతకలేదు. హరితహారం ప్రారంభించినప్పుడు కేవలం నర్సరీల్లో ఎన్ని మొక్కలు ఆయా గ్రామాలకు.. సదరు సైట్ కు లిఫ్ట్ చేశామన్నదే చూశారు. క్షేత్రస్థాయిలో ఎన్ని మొక్కలను నాటారు.. ఎన్నింటికి సరైన రీతిలో ఫెన్సింగ్ నాటారు. అందులో ఎన్ని మొక్కలు బతికున్నాయనే లెక్కలు తీయడంలో అధికారులు.. క్షేత్రస్థాయి సిబ్బంది ఫెయిలయ్యారు. గత ఐదేళ్లలో గమనిస్తే ఏటా 30 కోట్ల నుంచి 40 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. ఈ ఏడాది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరో విడత కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ఆరంభించనున్నారు. తక్కువ మొక్కలు నాటినా పర్వాలేదు.. కానీ అన్ని  బతకాలనే భావనతో ముందుకెళ్తున్నారు. అందుకే గ్రామస్థాయి నుంచి కూడా వారు ఎన్ని మొక్కలను బతికించగలరో.. అంతే సంఖ్యలో లక్ష్యంగా చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్ష్యం తగ్గుతోంది.

మీటరున్నర పొడవుండాలె..

హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. ఇందులో మీటరున్నర పొడవున్న మొక్కలు అందుబాటులో లేకుంటే గ్రామ పంచాయతీల్లో ఉండే గ్రీనరీ ఫండ్ నుంచి ఖర్చు చేసి ఇతరచోట్ల నుంచి మొక్కలు తీసుకొచ్చే వెసులుబాటు కల్పించారు. పట్టణాల్లో కూడా ఇదే పద్ధతి ఉండటంతో ఇప్పటికే కొన్నిచోట్ల కడియం వంటి నర్సరీల నుంచి తెప్పించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో గ్రామాల్లో రోడ్ల వెంబడి మొక్కల ఎత్తుతో సంబంధం లేకుండా ఏవి పడితే అవి నాటేవారు. దీంతో ఆ మొక్కలు బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే ఈసారి మీటరున్నర ఎత్తు ఉన్న మొక్కలను మాత్రమే రోడ్ల వెంట పెట్టాలని నిర్ణయించారు. దీంతోపాటు వాటికి వేసే కంచె మరీ ఇరుకుగా.. మరీ వదులుగా కాకుండా మధ్యస్థంగా వేయాలని సూచిస్తున్నారు. దీంతో పాటు నర్సరీల నుంచి మొక్కలను తరలించే సమయంలో చాలామంది త్వరగా తీసుకుపోవాలని మొక్క పైభాగాన్ని పట్టుకుని లాగుతారు. దీంతో పైభాగం తెగిపోవడంతో మొక్క పైకి సక్కగా పెరగక.. పక్కలకు పెరుగుతుంది. మొక్కలను చాలామంది తట్టలలో వేసుకుని వెళ్తారు. దీంతో మట్టి పోయి మొక్క ప్రాథమిక దశలో ఎదిగే ఆస్కారం ఉండదు. ఇలాంటి చాలారకాల టిప్స్ ను గ్రామాల్లో ఫారెస్టు సిబ్బంది శిక్షణలో తెలియజేశారు. ఈసారి మొక్కలు నాటే సమయంలోనూ వీరు టెక్నికల్ సపోర్టు అందించనున్నారు.

లెక్కల్లోనే 182 కోట్ల మొక్కలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2015 జులై లో చిలుకూరు బాలాజీ దేవాలయంలో సీఎం కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఏటా వర్షాలు కురిసే సీజన్లో ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టారు. ఊరు.. వాడ తేడా లేకుండా అన్నివర్గాలను ఇందులో భాగస్వాములను చేశారు. ఎక్కడ ఖాళీ ప్రదేశాలు కనిపించినా.. గుట్టలు.. ప్రభుత్వ భూములు.. శ్మశానవాటికలు.. గ్రామపంచాయతీలు, స్కూళ్లు, రోడ్ల వెంట.. ఇలా ప్రతిచోట మొక్కలను నాటే కార్యక్రమాన్ని తీసుకున్నారు. 2015–-16లో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆ మేరకు చేరుకోలేకపోయారు. 15.86 కోట్ల మొక్కలు మాత్రమే నాటగలిగారు. 2016–-17లో రెట్టింపుగా 31.67 కోట్ల మొక్కలు నాటారు. 2017-–18లో 34 కోట్లు, 2019–-20లో 38 కోట్ల మొక్కలు నాటారు. వీటితో పాటు అడవుల పునరుద్ధరణ  కింద ఫారెస్టు ఆధ్వర్యంలో 30 కోట్ల పైచిలుకు నాటారు. ఇవన్నీ కలిపి గత ఐదేళ్లలో 182 కోట్ల మొక్కలు నాటినట్లు రికార్డులు చెబుతున్నాయి.