దయచేసి సహకరించండి: బెంగాల్‌ ప్రజలకు దీదీ విజ్ఞప్తి

దయచేసి సహకరించండి: బెంగాల్‌ ప్రజలకు దీదీ విజ్ఞప్తి

కోల్‌కతా: అంపన్‌ సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రం కోలుకోవాలంటే కొంత టైం పడుతుందని, ప్రజలంతా సంయమనంతో సహకరించాలని, కొంత సమయం ఇవ్వాలని సీఎం మమతా బెనర్జీ ప్రజలను విజ్ఞప్తి చేశారు. సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం 24 గంటలు పనిచేస్తోందని ఆమె అన్నారు. ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని, కరెంటు రీస్టోర్‌‌ చయలేదని ఆరోపిస్తూ జనం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన నేపథ్యంలో దీదీ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై వస్తున్న దుష్ప్రచారాల్ని నమ్మొద్దని, అధికారులతో సహకరించాలని కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులంతా ఆ పనుల్లో ఉన్నారని అన్నారు. చివరికి తన ఇంట్లో కూడా కరెంట్‌ లేదని, ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా రావడం లేదని చెప్పారు. ప్రజలు ఆందోళన చేస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. ‘నా తల నరికేయండి.. అంత కంటే నేనేమీ చేయలేను” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీని హెల్ప్‌ అడిగానని ఆమె చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో అంపన్‌ తుపాను బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో దాదాపు రూ.లక్ష కోట్ల నష్టం జరిగిందని అంచనా వేశారు. ఇప్పటి వరకు 89 మంది చనిపోయారు. నార్త్‌ 24 పనగణాలు, కోల్‌కతా, సౌత్‌ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్‌‌ సహా మరో 14 జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పట్టించుకోవడం ఆరోపిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు.