నంబర్​ తగ్గిందని బాధపడొద్దు : ప్రతిపక్షాలకు మోడీ సూచన

నంబర్​ తగ్గిందని బాధపడొద్దు : ప్రతిపక్షాలకు మోడీ సూచన

న్యూఢిల్లీ: ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం గొప్పగా వర్ధిల్లుతుందన్న ప్రధాని నరేంద్ర మోడీ, నంబర్​ తగ్గినందుకు బాధపడొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. సీట్ల సంఖ్య కంటే సూచనలకే ప్రాధాన్యం ఇస్తామని, ప్రతిపక్ష నేతల ప్రతిమాటను, ప్రతి సూచనను అమూల్యమైందిగా భావిస్తామన్నారు. స్వపక్షం, ప్రతిపక్షం అనే తేడాలు పక్కనపెట్టి నిష్పక్షపాతంగా పనిచేద్దామని పిలుపిచ్చారు. లోక్​సభ ప్రారంభం కావడానికి ముందు పార్లమెంట్​ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లారు. ‘‘ఎక్కువ మంది కొత్త ఎంపీల రాకతో లోక్​సభకు సరికొత్త ఉత్సాహమొచ్చింది. వాళ్లు తమతో మోసుకొచ్చిన కొత్త కలలు సాకారం  కావాలంటే సభ సజావుగా సాగాలి. స్వాతంత్ర్యం తరువాత ఎక్కువ శాతం ఓటింగ్​, ఎక్కువ మంది మహిళలు ఎంపీలుగా ఎన్నిక కావడం 2019 ఎన్నికల్లోనే జరిగింది.

దశాబ్దాల గ్యాప్​ తర్వాత సుస్థిర ప్రభుత్వాన్ని ప్రజలు రెండోసారీ గెలిపించారు. సభ సజావుగా సాగితేనే ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోగలం. చక్కటి చర్చకు అన్ని పార్టీల సభ్యులూ సహకరిస్తారని ఆశిస్తున్నా. ‘సబ్​కా సాత్​, సబ్​ కా వికాస్’ నినాదంతో బయలుదేరిన మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారు. సామాన్యూడి కలల్ని నిజం చేయాలన్న సంకల్పంతోనే ఎంపీలందరం పనిచేయాలి. వచ్చే ఐదేండ్లలో చట్టసభల ఉన్నతిని ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తాం. ఫస్ట్​ సెషన్​ నుంచే రెట్టించిన వేగంతో పనిచేస్తాం”అని మోడీ చెప్పారు.

మీడియాపై సెటైర్లు

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే పనిని మీడియా సమర్థవంతంగా నిర్వహించడంలేదని ప్రధాని మోడీ ఆక్షేపించారు. ప్రజాసమస్యలపై అనర్గళంగా, అద్బుతంగా మాట్లాడగలిగే ఎంపీలు ఎంతో మంది ఉన్నా, టీఆర్​పీ రేటింగ్స్​ రావన్న ఒకే ఒక్క కారణంతో వాళ్లను టీవీల్లో చూపించడంలేదని సెటైర్లు వేశారు. ‘‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఎంపీ లాజికల్​గా మాట్లాడుతున్నా, అలాంటి చర్చలు టీవీల్లో చూపించినా ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. కానీ టీఆర్​పీ రేటింగ్​ రాదు కాబట్టి మీరు(టీవీ చానెళ్లు) అలా చేయరు. రేటింగ్స్​ను దాటి మీడియా కాస్త ముందుకెళ్లాలని ఆకాక్షిస్తున్నాను.  వచ్చే ఐదేండ్లలో మంచి చర్చలకు మీడియా పెద్దపీట వేయాలని కోరుకుంటున్నాను”అని మోడీ ముగించారు.