ఆర్టీసీ జేఏసీ, ఎమ్మార్పీఎస్​ దీక్షలపై పోలీసుల ఉక్కుపాదం

ఆర్టీసీ జేఏసీ, ఎమ్మార్పీఎస్​ దీక్షలపై పోలీసుల ఉక్కుపాదం
  • హైడ్రామా మధ్య అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి చొచ్చుకెళ్లిన పోలీసులు
  • నేతలను లోపలికి వెళ్లేందుకు అనుమతించి..
  • వారు బయటికొస్తుండగా ఫ్లాట్​లోకి దూసుకెళ్లి అరెస్ట్​
  • ఉస్మానియాకు తరలింపు.. అక్కడే దీక్ష
  • జేఏసీ కో–కన్వీనర్​ రాజిరెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్టు
  • ఎమ్మార్పీఎస్​ సభ జరగకుండా ధర్నాచౌక్​ ఏరియా దిగ్బంధం

ఆర్టీసీ జేఏసీ నేతలు చేస్తున్న నిరాహార దీక్షలు, వారికి మద్దతుగా ఎమ్మార్పీఎస్​ ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన ‘సబ్బండ వర్ణాల మహా దీక్ష’లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అటు ఆర్టీసీ జేఏసీ నేతలను, ఇటు ఎమ్మార్పీఎస్​ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఇందిరాపార్క్​ప్రాంతాన్ని పోలీసులు, ముళ్ల కంచెలు, బారికేడ్లతో దిగ్బంధం చేశారు. రోడ్లను మూసేసి స్థానికులను కూడా వెళ్లనివ్వలేదు. జేఏసీ కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్​ రాజిరెడ్డిని, మహిళా కార్మికులను అరెస్టు చేశారు. అటు మంద కృష్ణను, ఎమ్మార్పీఎస్​ నేతలనూ అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎంపీలు జితేందర్​రెడ్డి, వివేక్​ తదితరులను అరెస్టు చేసి, కొంతసేపటికి విడుదల చేశారు.

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, జేఏసీ నేతలను సర్కారు చర్చలకు పిలవాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్షకు దిగిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రం హైడ్రామా సృష్టించారు. మీడియాను ఇంటి నుంచి దూరంగా పంపేశారు. అశ్వత్థామరెడ్డిని కలిసేందుకు వచ్చిన నేతలను ఇంట్లోకి వెళ్లనిచ్చి.. వారు బయటికి వస్తున్న సమయంలో ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లారు. అశ్వత్థామరెడ్డిని, ఆయనతోపాటు దీక్ష చేస్తున్న మహిళా కార్మికులను అరెస్టు చేసి, బయటికి తీసుకొచ్చారు. అశ్వత్థామరెడ్డిని ఉస్మానియా హాస్పిటల్​కు తరలించగా.. ఆయన అక్కడే దీక్ష కొనసాగిస్తున్నారు. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్​రావు, మాజీ ఎంపీలు జితేందర్​రెడ్డి, వివేక్​వెంకటస్వామి తదితరులు వెళ్లి అశ్వత్థామరెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు జేఏసీ కో–కన్వీనర్​ రాజిరెడ్డిని ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేశారు.

పొద్దంతా టెన్షన్..

అశ్వత్థామరెడ్డి హైదరాబాద్​ శివార్లలోని హస్తినాపురంలో ఉన్న తన ఇంట్లో శనివారం ఉదయం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఇందిరాపార్కు వద్ద, యూనియన్​ ఆఫీసులో దీక్షకు పోలీసులు పర్మిషన్​ఇవ్వకపోవడం, తనను అరెస్టు చేసేందుకు సిద్ధంకావడంతో ఆయన ఇంట్లోనే దీక్ష మొదలుపెట్టారు. దాంతో ఆ ప్రాంతం మొత్తాన్నీ దిగ్బంధించిన పోలీసులు.. ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మద్దతుగా వచ్చిన కార్మికులెవరినీ ఇంటి సమీపంలోకి చేరుకోకుండా సమీప కాలనీల్లో, రోడ్లపై బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత కనిపించింది. పోలీసులు డాక్టర్​ను పిలిపించి అశ్వత్థామరెడ్డికి వైద్య పరీక్షలు చేయించారు. డాక్టర్ను మీడియాతో మాట్లాడనివ్వలేదు. డీసీపీ సన్ ప్రీత్ సింగ్ డాక్టర్ తో మాట్లాడి, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. తర్వాత కొందరు పెద్ద స్థాయి నేతలు అశ్వత్థామరెడ్డిని కలిసేందుకు అనుమతించారు.

హైడ్రామా సృష్టించి..

ఆదివారం బీజేపీ నేతలు, మాజీ ఎంపీలు జితేందర్​రెడ్డి, వివేక్​ వెంకటస్వామి, ఎమ్మెల్సీ రాంచందర్​రావు తదితరులు అశ్వత్థామరెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగానే పోలీసులు పకడ్బందీగా ప్లాన్​ వేశారు. తొలుత వచ్చిన నేతలు జితేందర్​రెడ్డి, వివేక్​లను కొంతసేపు అడ్డుకుని, తర్వాత పర్మిషన్​ ఇచ్చారు. వారు వెళ్లిపోయాక సాయంత్రం 5 గంటల సమయంలో ఎమ్మెల్సీ రాంచందర్​రావు వచ్చినప్పుడు ప్లాన్​ అమలు చేశారు. మీడియాను అక్కడి నుంచి పంపేశారు. చుట్టూ ఉన్న ఇతర ఫ్లాట్లకు బయటి నుంచి గొళ్లెంపెట్టేశారు. రాంచందర్​రావు ఇంట్లోకి వెళ్లి అశ్వత్థామరెడ్డితో మాట్లాడుతుండగా.. ‘మీకు ఇచ్చిన సమయం అయిపోయింది, బయటికి రావాలి’ అని పిలిచారు. ఆయన బయటికి వస్తుండగా.. ఒక్కసారిగా లోపలికి చొచ్చుకువెళ్లారు. అశ్వత్థామరెడ్డిని, మహిళా కార్మికులను అరెస్టు చేశారు. అశ్వత్థామరెడ్డిని ఉస్మానియా హాస్పిటల్​కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆయన అక్కడ కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. టీజేఎస్​ చీఫ్​ కోదండరాం హాస్పిటల్​కు వచ్చి అశ్వత్థామరెడ్డిని పరామర్శించారు. అశ్వత్థామరెడ్డి ట్రీట్ మెంట్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని, ఆయనకు బీపీ, షుగర్​ ఉండటంతో ఆరోగ్యం క్షీణిస్తోందని ఉస్మానియా హాస్పిటల్  డాక్టర్ రాజ్ కుమార్  తెలిపారు. బీపీ 159, షుగర్ 171  ఉందని.. ఆయన అంగీకరిస్తే ట్రీట్​మెంట్​ మొదలుపెడ్తామని చెప్పారు.

అపార్ట్​మెంట్ ​వాళ్లనూ అరెస్టు చేసి..

అశ్వత్థామరెడ్డిని అరెస్టు చేసే సమయంలో పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. అశ్వత్థామరెడ్డి నివాసం ఉంటున్న నాలుగో ఫ్లోర్ లోని ఇతర ఫ్లాట్లకు బయటి నుంచి గడియ పెట్టారు. అపార్ట్ మెంట్​ నివసిస్తున్న ఇతర పోర్షన్ల వారిని కూడా అరెస్టు చేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారని వారు నిలదీస్తే.. మహిళా కానిస్టేబుళ్లపై దురుసుగా ప్రవర్తించారంటూ లాక్కెళ్లారు. ఇది చూసిన వారి పిల్లలు ఏడుస్తుండటం అక్కడున్న వారిని కలిచి వేసింది.

రెండో రోజు నేతల దీక్షలు

ఆర్టీసీ జేఏసీ మరో కో-కన్వీనర్, ఎస్ డబ్ల్యూఎఫ్  సెక్రెటరీ జనరల్ లింగమూర్తి నిరాహార దీక్ష ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని యూనియన్ ఆఫీసులో కొనసాగుతోంది. అఖిలపక్ష నేతలు కోదండరాం, తమ్మినేని వీరభద్రం, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ తదితరులు ఆయనను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొద్దని కార్మికులు కోరుతుంటే.. నాయకులు స్వార్థంకోసం సమ్మె చేస్తున్నారని సర్కారు అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయి ఉండీ హైకోర్టుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని విమర్శించారు.

వివేక్, జితేందర్రెడ్డి అరెస్టు

అశ్వత్థామరెడ్డిని కలిసేందుకు వచ్చిన మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిని పోలీసులు అర కిలోమీటరు దూరంలోనే ఆపేశారు. దాంతో వారు రాచకొండ పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి.. తమను అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి అనుమతించాలని కోరారు. దీనిపై డీసీపీని ఆదేశిస్తానని సీపీ బదులిచ్చారు. అయితే పోలీసులు అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని, వెళ్లిపోవాలని జితేందర్రెడ్డి, వివేక్లపై ఒత్తిడి తెచ్చారు. దీనిని నిరసిస్తూ ఇద్దరు నేతలు రోడ్డుపైనే బైఠాయించి, నినాదాలు చేయడంతో అరెస్టు చేశారు. వారిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్తుండగానే.. సీపీ నుంచి ఆదేశాలు వచ్చాయి. వాహనాన్ని వెనక్కి పిలిపించి, అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు జితేందర్రెడ్డి, వివేక్లను అనుమతించారు. వారు అశ్వత్థామరెడ్డితో 15 నిమిషాలు భేటీ అయ్యారు. ఈ సమయంలో అశ్వత్థామరెడ్డికి వివేక్ వైద్య పరీక్షలు చేశారు. బీపీ పెరిగిందని, షుగర్ లెవల్స్ క్షీణించాయని, ట్రీట్మెంట్ అవసరమని సూచించారు.బయటికొచ్చాక మీడియాతో మాట్లాడారు.

ఇంటి తలుపులు పగలగొట్టి రాజిరెడ్డి అరెస్టు

శనివారం దీక్ష ప్రారంభించిన జేఏసీ కో–కన్వీనర్​ రాజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, అదే రోజు సాయంత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయన తిరిగి సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని తన ఇంట్లో దీక్ష కొనసాగించారు. దీంతో పోలీసులు ఆదివారం ఉదయం మళ్లీ ఆయనను అరెస్టు చేశారు. ఇంట్లోనే తలుపు గొళ్లెం పెట్టుకుని దీక్ష చేస్తుండటంతో.. గడ్డపారలు, ఇనుపరాడ్లతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. రాజిరెడ్డితోపాటు ఆయన భార్యను, కొందరు మహిళా కార్మికులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో కొంత సేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రాజిరెడ్డి, కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్​ డౌన్​డౌన్​ అంటూ నినాదాలు చేశారు.  బలవంతంగా డీసీఎంలోకి ఎక్కించటంతో రాజిరెడ్డి స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు అరెస్టు చేసిన వారందరినీ పోలీస్​స్టేషన్​కు తరలించారు.

కేసీఆర్​ది అధికార మదం, అహంకారం: వివేక్​ వెంకటస్వామి

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 27 రోజులు సమ్మె చేసి, జీతాలు వదులుకున్న ఆర్టీసీ కార్మికులను ఇప్పుడు టీఆర్ఎస్​ సర్కారు వేధిస్తోందని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులతోపాటు ఎంతో మంది త్యాగాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. అధికార దాహంతో కేసీఆర్ దిమాక్ ఖరాబైందని, ఆయన అహంకారాన్ని ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. నిజాం, బ్రిటిష్ పాలన ఏమోగానీ.. ఇప్పుడు కేసీఆర్ తుగ్లక్, నియంతృత్వ పాలనను చూస్తున్నామని వివేక్​ చెప్పారు. జనం నిజాంపై తిరగబడినట్టు కేసీఆర్ పైనా తిరగబడే సమయం దగ్గర పడిందన్నారు. కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు పైసల్లేవంటున్నారని, ఆంధ్రా కాంట్రాక్టర్లకు మాత్రం వేల కోట్లు దోచిపెడుతున్నారని ఆరోపించారు.

హైకోర్టు ఆదేశించినా సీఎం పట్టించుకోవడం లేదని, ఆయన రెచ్చగొట్టే మాటల వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్​పైనే కేసులు పెట్టాలన్నారు. అశ్వత్థామను అరెస్టు చేసి, సమ్మెను అణగదొక్క వచ్చనే భావనలో కేసీఆర్​ ఉన్నారని.. కానీ తాము కార్మికులకు అండగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఉసురు తగుల్తది: జితేందర్​రెడ్డి

ఆర్టీసీ కార్మికుల్లో చాలా మంది పేదలేనని, రెండు నెలలుగా జీతాలు రాక వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి అన్నారు. చర్చలు జరిపి, కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. అశ్వత్థామరెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆయనకు ఏమన్నా అయితే ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

కార్మికులు విలీనం డిమాండ్ ను పక్కన పెట్టారని, ఇప్పటికైనా ఇతర  సమస్యలను పరిష్కరించాలని, వారి జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చామని, కానీ 144 సెక్షన్ ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులు తమను అరెస్టు చేశారని జితేందర్​రెడ్డి చెప్పారు. తాము బీజేపీ తరఫున ఇద్దరమే వస్తే 144 సెక్షన్​ను ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందని నిలదీశామని, తర్వాత పోలీసులు తమను లోపలికి అనుమతించి కేసును విత్​డ్రా చేసుకున్నారని తెలిపారు.