లాయర్​ దంపతుల హత్య కేసు: సుందిళ్ల బ్యారేజీలో కత్తుల వేట

లాయర్​ దంపతుల హత్య కేసు: సుందిళ్ల బ్యారేజీలో కత్తుల వేట

లాయర్​ దంపతుల హత్య కేసు నిందితులను అక్కడికి తీసుకెళ్లిన పోలీసులు
వైజాగ్ నుంచి గజ ఈతగాళ్లను రప్పించిన్రు

పెద్దపల్లి, వెలుగు: లాయర్లు వామన్ రావు, నాగమణిల హత్యకు ఉపయోగించిన కత్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల శివారులో లాయర్లను చంపిన కుంట శ్రీను,  చిరంజీవి.. తర్వాత మహారాష్ట్రకు పారిపోయే క్రమంలో హత్యకు ఉపయోగించిన కత్తులు, రక్తపు మరకలున్న బట్టలను సుందిళ్ల బ్యారేజీలో పడేశారు. నిందితులను ఇప్పటికే కస్టడీలోని తీసుకున్న పోలీసులు ఆదివారం వారిద్దరినీ భారీ బందోబస్తు మధ్య మంథని మండలంలోని సిరిపురం వద్దనున్న సుందిళ్ల బ్యారేజీ దగ్గరికి తీసుకెళ్లారు. కత్తులు, బట్టలను ఎక్కడ పడేశారని పోలీసులు అడగ్గా.. బ్యారేజీలోని 56వ పిల్లర్ నుంచి 60వ పిల్లర్​మధ్యనున్న ఏరియాలో పడేసినట్లు నిందితులు చెప్పారు. ఆ కత్తులను బయటకు తీయడానికి పోలీసులు వైజాగ్ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. వాళ్లు మధ్యాహ్నం నుంచి వెతుకులాట ప్రారంభించగా, సాయంత్రం వరకు దొరకలేదు. దీంతో సోమవారం మళ్లీ కత్తుల కోసం వెతకనున్నారు.

బ్యారేజీలో 4 టీఎంసీలు

సుందిళ్ల బ్యారేజీలో ప్రస్తుతం 4 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. తాము కత్తులు ఎక్కడ పడేశామనేది నిందితులు కచ్చితంగా చెప్పలేకపోయారు. దీంతో వారు చెప్పిన దాన్ని బట్టి.. బ్యారేజీకి మొత్తం 72 పిల్లర్లు ఉండగా, 56 నుంచి 60వ పిల్లర్ మధ్య పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.

బిట్టు శ్రీను కస్టడీపై నేడు విచారణ

లాయర్ల హత్య కేసులో నిందితుడైన బిట్టు శ్రీనును తిరిగి తమ​ కస్టడీకి అప్పగించాలని మంథని కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. కోర్టు అనుమతిస్తే, కరీంనగర్​ జైల్లో ఉన్న బిట్టు శ్రీనును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.