ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు

ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్  మంగళవారం ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించికుంటున్నారు. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. మూడో దశతో 280 నియోజకవర్గాలకు పైనే ఓటింగ్  పూర్తికానుంది. అంటే మొత్తం లోక్ సభ సీట్లలో సగానికి పైనే నియోజకవర్గాలకు మూడో దశతో ఎన్నికలు జరగనున్నాయి. 

గుజరాత్, గోవా, కేంద పాలిత ప్రాంతాలు దాద్రానగర్  హవేలి, డామన్  డయ్యూకు మూడో దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే అస్సాంలో 4, బీహార్ లో 5, చత్తీస్ గఢ్ లో 7, మధ్యప్రదేశ్ లో 8, మహారాష్ట్రలో 11, ఉత్తర ప్రదేశ్ లో 10, పశ్చిమ బెంగాల్ లో 4 స్థానాలకు కూడా మూడో దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక మిగతా 263 స్థానాలకు చివరి నాలుగో దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 

కీలక స్థానాలు ఇవే

గుజరాత్ లోని గాంధీనగర్, మహారాష్ట్రలోని బారామతి, మధ్యప్రదేశ్ లోని విదిశ, గుణ, కర్నాటకలోని ధార్వాడ్, హవేరి, అస్సాంలోని ధుబ్రి వంటి కీలక నియోజకవర్గాలకు మూడో దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. గాంధీ నగర్ లో బీజేపీ తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్  అభ్యర్థి సోనాల్  రమణ్ భాయ్  పటేల్ పై పోటీచేస్తున్నారు. అలాగే బారామతిలో ఎన్సీపీ చీఫ్​ శరద్  పవార్  కూతురు సుప్రియా సూలే.. అజిత్  పవార్  (శరద్  పవార్  తమ్ముని కొడుకు) భార్య సునేత్రా పవార్ పై బరిలో నిలిచారు. విదిశలో బీజేపీ తరపున మధ్యప్రదేశ్  మాజీ సీఎం శివ్ రాజ్ సింగ్  చౌహాన్.. కాంగ్రెస్  అభ్యర్థి భానుప్రతాప్  శర్మపై పోటీచేస్తున్నారు. గుణలో కాంగ్రెస్  అభ్యర్థి రావ్  యాదవేంద్ర సింగ్ పై బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా పోటీచేస్తున్నారు. అలాగే ధార్వాలో బీజేపీ తరపున ప్రహ్లాద్  జోషి, కాంగ్రెస్  తరపున వినోద్  అసూతి బరిలో నిలిచారు. కర్నాటకలోని హవేరిలో బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం బొమ్మై.. కాంగ్రెస్  అభ్యర్థి ఆనంద్ స్వామిపై పోటీచేస్తున్నారు. ఇక అస్సాంలోని ధుబ్రిలో ఎన్డీయే అభ్యర్థి బద్రుద్దీన్  అజ్మల్, ఇండియా కూటమి అభ్యర్థి రకిబుల్  హసన్  బరిలో నిలిచారు.

ఓటింగ్  శాతం పెరిగేనా?

లోక్ సభ ఎన్నికల ఒకటో, రెండో దశ పోలింగ్ లో ఓటింగ్  శాతం కాస్త తగ్గింది. ఒకటో దశలో 102 సీట్లకు ఎన్నికలు నిర్వహించగా 66.14 శాతం పోలింగ్  నమోదైంది. 2019లో ఇది 70 శాతంగా ఉంది. అలాగే రెండో దశలో 88 సీట్లకు ఎన్నికలు జరగ్గా.. 66.71 శాతం పోలింగ్  రికార్డయింది. 2019లో ఇది 69.64 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో మూడో దశలో జరిగే ఎన్నికల్లో ఓటింగ్  శాతం పెంచడానికి ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంది. ఇక  ఉత్తర ప్రదేశ్, వెస్ట్  బెంగాల్ లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్ లో ఐదు దశల్లో.. జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశాలో నాలుగు ఫేజ్ లలో.. అస్సాం, ఛత్తీస్ గఢ్ లో మూడు దశల్లో.. కర్నాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపురలో రెండు దశల్లో పోలింగ్  నిర్వహించనున్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.