సింగరేణి ఆక్సిజన్​ ప్లాంట్.. రోజుకు 80 సిలిండర్ల ఉత్పత్తి

సింగరేణి ఆక్సిజన్​ ప్లాంట్.. రోజుకు 80 సిలిండర్ల ఉత్పత్తి

 ఏరియా ఆసుపత్రుల్లో రోగులకు భరోసా
సింగరేణి ఏరియా హాస్పిటళ్లలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్​ప్లాంట్లలో ఉత్పత్తి స్టార్ట్​అయ్యింది. కరోనా టైంలో తీవ్ర ఆక్సిజన్​కొరత ఏర్పడడంతో సొంతంగా ఆక్సిజన్​ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఐదు ఏరియా ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ప్లాంట్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సింగరేణి ఆసుపత్రులకు అవసరమైన ఆక్సిజన్​సిలిండర్లను  మహారాష్ట్రలోని నాగ​పూర్, హైదరాబాద్, పాల్వంచ ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేవారు. కరోనా టైంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆక్సిజన్​సిలిండర్లపై అక్కడి ఆఫీసర్లు ఆంక్షలు విధించడంతో  సింగరేణి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆక్సిజన్​ఉత్పత్తి కేంద్రాలపై ఆధారపడింది. ఆక్సిజన్​కొరత కారణంగా రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో యాజమాన్యం ముందస్తు చర్యలకు దిగింది. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి వ్యాప్తంగా ఐదు ప్రధాన ఆసుపత్రులతో పాటు మరో ఐదు 10 పడకల ఆసుపత్రులున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్​మెంట్​కోసం నెలకు 110 ఆక్సిజన్​ సిలిండర్లు అవసరమయ్యేవి. ఈ నేపథ్యంలో  రూ.3.63 కోట్లు ఖర్చు చేస్తూ రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం ఆసుపత్రుల్లో 12 క్యూబిక్​ మీటర్ల కెపాసిటీ ఆక్సిజన్​ప్లాంట్లు, గోదావరిఖనిలో 45 క్యూబిక్​ మీటర్ల కెపాసిటీ ప్లాంటు పనులు చేపట్టింది.
 
మంచిర్యాల జిల్లాలో ఉత్పత్తి షురూ

మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్​, బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్​ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి షురూ చేసింది. ఒక్కో ప్లాంట్​నిర్మాణానికి రూ. 35 లక్షల వరకు వెచ్చించారు.  ఆక్సిజన్​ ప్లాంట్​మిషనరీ టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నారు. రెండు చోట్లా 12 క్యూబిక్​ మీటర్ల కెపాసిటీ (నిమిషానికి 200 లీటర్ల ఉత్పత్తి)తో రోజుకు 40 సిలిండర్ల ఆక్సిజన్​ ఉత్పత్తి జరుగనుంది.  గత నెల 30న సింగరేణి డైరెక్టర్(ఫైనాన్స్​, పీపీ) బలరాం, సత్యనారాయణ(ఈఎం) వీటిని ప్రారంభించారు. ప్లాంట్లలో ఉత్పత్తయిన ఆక్సిజన్​ను సెంట్రలైజ్డ్ పైప్​లైన్​ద్వారా ఆసుపత్రుల్లోని వార్డుల్లో ట్రీట్​మెంట్​పొందుతున్న రోగులకు నిరంతరాయంగా సప్లై చేస్తున్నారు. 

ఆక్సిజన్ ​కొరత రాకూడదని..

కరోనా విపత్కర పరిస్థితు ల్లో కూడా రోగులకు ఆక్సి జన్ కొరత రాకుండా చూశాం. భవిష్యత్తులో ఆక్సిజన్​ కొరత ఉండ కూడదనే సొంతంగా ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి  సింగ రేణి సీఎండీ శ్రీధర్​ చొరవ చూపారు. ప్రస్తుతం రోజుకు 40 సిలిండర్ల ఆక్సిజన్​ఉత్పత్తి అవు తోంది. ప్లాంట్ల ఏర్పాటుతో ట్రీట్​మెంట్ కోసం వచ్చే  రోగులకు మరింత భరోసా కలుగుతుంది. 
                                                                                                                     ..     డాక్టర్​ ఉషారాణి, డీవైసీఎంవో, రామకృష్ణాపూర్​ ఏరియా ఆసుపత్రి