ఏసీబీ కేసులున్నోళ్లకు ప్రమోషన్లు!

ఏసీబీ కేసులున్నోళ్లకు ప్రమోషన్లు!
  • ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో గోల్‌మాల్
  • ఓ మంత్రి బంధువు చక్రం తిప్పారనే ఆరోపణలు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీనియర్ ఆఫీసర్లు

జగిత్యాల, వెలుగు: ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్​లో ఐదారేళ్లుగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ, జాయింట్ కమిషనర్లు సుమారు 60 మందికి ఎలిజిబిలిటి ఉన్నట్లు హయ్యర్ ఆఫీసర్లు లిస్ట్ అవుట్ చేశారు. స్టేట్ చీఫ్​సెక్రటరీ సోమేశ్​కుమార్ 2021 మే 6న స్టేట్ ఎక్సైజ్ లో ప్రమోషన్స్  ఇస్తూ జీవో జారీ చేశారు. 12 మందికి ప్రమోషన్లు ఇవ్వగా వీరిలో సగానికి పైగా ఆఫీసర్లపై ఏసీబీ కేసులు ఉన్నాయి. అయినప్పటికీ రూల్​పొజిషన్​ప్రకారం సీఎంవో ఎగ్జంప్షన్​తో ప్రమోషన్స్ ఇచ్చి తమకు అన్యాయం చేశారని సీనియర్లు వాపోతున్నారు. రూల్ పొజిషన్ లో ఉన్న లొసుగులతో అర్హత లేనివారికి ప్రమోషన్లు ఇచ్చారని, ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ప్రమోషన్ల కోసం చాలామంది ఆఫీసర్లు రెండేళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం బైఫరికేషన్ లో తెలంగాణకు వచ్చిన నలుగురు ఆఫీసర్లలో ఒకరికి ప్రమోషన్ తో పోస్టింగ్ ఇవ్వగా, మరో ముగ్గురికి ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయింటింగ్ లో పెట్టారు.

చేతులు మారిన రూ. కోట్లు 
ఏసీబీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసుల్లో ఆఫీసర్లకు సీఎంవో నుంచి అందే ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వచ్చనే రూల్స్ ఉన్నాయి. ఆ కేసుల్లో ఆరోపణలు రుజువైతే ఆ ఆఫీసర్లకు ఇంక్రిమెంట్ కట్ లాంటి శాఖాపరమైన పనిష్మెంట్ లు ఉంటాయి.  ఇలాంటి కేసుల్లో ఉన్న ఆఫీసర్లకు సీనియర్లను, ఎలిజిబిలిటి ఆఫీసర్లను కాదని ప్రమోషన్ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. పదుల సంఖ్యలో సీనియర్లు, ఎలిజిబిలిటి ఉన్న ఆఫీసర్లను కాదని ఓ మంత్రి బంధువు పైరవీతో తక్కువ సీనియార్టీ, వివాదాస్పదులుగా ఉన్నవారికి ప్రమోషన్ ఇచ్చారని మిగిలినవాళ్లు మొత్తుకుంటున్నారు. ఈ ప్రమోషన్ల బాగోతంలో సుమారు రెండున్నర కోట్లు చేతులు మారాయని బాధిత ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు. ఏళ్లుగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న తమకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిపార్ట్​మెంట్​లో సూపరింటెండెంట్​గా పనిచేస్తున్న ఓ ఆఫీసర్ కొన్నేళ్లుగా అసిస్టెంట్ కమిషనర్ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ జారీ చేసిన ప్రమోషన్స్ లిస్ట్ లో ఆయన పేరు లేకపోగా ఆ ఆఫీసర్ ప్లేస్​లో ఏసీబీ కేసులో ఉన్న ఓ యూనియన్ లీడర్​కు ప్రమోషన్ పై పోస్టింగ్ ఇచ్చారు. ఆయనను వెయిటింగ్ లో పెట్టారు. 

అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్​గా డ్యూటీ చేస్తున్న ఓ మహిళా ఆఫీసర్​కు ఎక్సైజ్ సూపరింటెండెంట్​గా ప్రమోషన్ రావాల్సి ఉంది. ఆమెకు ప్రమోషన్ ఇవ్వకపోగా పోస్టింగ్ లేకుండా వెయిటింగ్​లో ఉంచారు. ఆమె ప్లేస్​లో గతంలో ఏసీబీ కేసులో ఉన్న ఓ ఆఫీసర్​కు సూపరింటెండెంట్​గా ప్రమోషన్ ఇచ్చారు. ఆమెను ఏడాదిన్నరగా వెయింటింగ్​లో ఉంచడానికి టీఆర్ఎస్​కు చెందిన ఓ కీలక నేతతో ఉన్న విభేదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. 

డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్న ఓ ఆఫీసర్ కు మరో నాలుగు పోస్టులను ఇచ్చారు. అత్యధికంగా రెవెన్యూ ఉండే రెండు ఉమ్మడి జిల్లాలకు అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ చొప్పున నాలుగు పోస్టులకు ఇన్​చార్జిగా ఇవ్వడంపై సీనియర్లు సీరియస్​గా ఉన్నారు. అర్హులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వెయింటింగ్ లో ఉంచి, నచ్చినవారికి నాలుగైదు పోస్టింగులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.