సీజేఐకి క్లీన్ చిట్ పై మహిళల ఆందోళన

సీజేఐకి క్లీన్ చిట్ పై మహిళల ఆందోళన

లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కమిటీ సీజేఐ రంజన్​గొగోయ్​కి క్లీన్​చిట్​ఇవ్వడాన్ని మహిళా సంఘాలు తప్పుబట్టాయి. విచారణ కమిటీ తీరును నిరసిస్తూ సుప్రీం కోర్టు ఎదుట ఆందోళన నిర్వహించాయి. లాయర్లు, మహిళా సంఘాల కార్యకర్తల నిరసన ప్రదర్శనలతో సుప్రీం కోర్టు ఎదుట ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్​విధించి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. సుప్రీం కోర్టు బయట సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. న్యూస్​కవరేజ్​కోసం వచ్చిన జర్నలిస్టులను కూడా అరెస్టు చేసిన పోలీసులు తర్వాత విడిచిపెట్టారు. దాదాపు 30 మందికి పైగా మహిళా కార్యకర్తలను మందిర్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించారు. జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు జడ్జిలతో కూడిన కమిటీ విచారణకు అనుసరించిన పద్ధతిని వ్యతిరేకిస్తూ పలువురు లాయర్లు, మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు. మహిళా ఉద్యోగి ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరపాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్​చేశారు. జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని కమిటీ విచారణకు బాధితురాలు హాజరయ్యారు. అయితే, కమిటీ సభ్యుల విచారణ సరిగ్గాలేదంటూ మధ్యలోనే బయటికొచ్చేసారు. జస్టిస్​బాబ్డే కమిటీతో తనకు న్యాయం జరగదంటూ ఆరోపించారు. బాధితురాలు మధ్యలోనే వెళ్లిపోయినా విచారణ కొనసాగించిన కమిటీ.. సీజేఐపై ఆరోపణలకు సరైన ఆధారాలు లేవంటూ తేల్చేసింది. ఈమేరకు నివేదిక కూడా సమర్పించింది.

ఆ రిపోర్టు కాపీ నాకివ్వండి

ఇన్ హౌస్ కమిటీ చైర్మన్ కు  మాజీ ఉద్యోగి లెటర్

సీజేఐ రంజన్ గొగోయ్ పై ఇన్ హౌస్ కమిటీ ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్టు కాపీని తనకి ఇప్పించాలని బాధిత మహిళ కమిటీ చైర్మన్ జస్టిస్ బాబ్డేకి మంగళవారం లెటర్ రాశారు. కమిటీ విచారణ పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. ‘‘బాధితురాలినైన నాకు ఎంక్వైరీ కాపీని ఇవ్వకపోవడం ఎంత వరకూ సమంజసం. సహజ న్యాయానికి ఇది వ్యతిరేకం. ఇన్ హౌస్ విచారణ రూల్స్ పేరుతో రిపోర్టు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మరే వ్యక్తికైనా ఎంక్వైరీ రిపోర్టును ఇచ్చివుంటే, నాకూ ఆ రిపోర్టును తీసుకునే హక్కు ఉంటుంది” అని పేర్కొన్నారు. లైంగిక ఆరోపణలపై సీజేఐకు ముగ్గురు సభ్యుల ఇన్ హౌస్ కమిటీ సోమవారం క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎంక్వైరీ రిపోర్టును పబ్లిక్ కు రిలీజ్ చేయడాన్ని కమిటీ నిషేధించింది.