కరోనా భయంతో ఊర్ల నుంచి సిటీకి

కరోనా భయంతో ఊర్ల నుంచి సిటీకి
  • పట్నానికే పోదాం
  • ఊళ్లల్లో కరోనా కేసుల భయంతోప్రైవేటు ఉద్యోగుల తిరుగు పయనం
  • ఊర్లలో ఏమైనా అయితే వైద్యం సౌలతుల భయం
  • సిటీకి చేరుకుంటున్న ప్రైవేట్ ఉద్యోగులు, వర్క్​ఫ్రమ్​ హోం చేస్తున్న సాఫ్ట్​వేర్​ ఎంప్లాయీస్ 
  • 70 శాతం గ్రామాల్లో డబుల్ డిజిట్‌‌లో పాజిటివ్ కేసులు 
  • ఇటీవల సర్కార్ చేసిన ర్యాండమ్ సర్వేలో వెల్లడి

రాజు హైదరాబాద్​లోని ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి. ఫస్ట్ వేవ్​లో ఏప్రిల్ మొదటి వారంలో వరంగల్​ల్లోని తన సొంత గ్రామం సూరానికి వెళ్లారు. అక్కడే వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటూ నాలుగైదు నెలలు గడిపి, తరువాత హైదరాబాద్ వచ్చారు. ఇటీవల సెకండ్ వేవ్‌‌‌‌లో మే 2వ తేదీన మళ్లీ తిరిగి ఊరికి వెళ్లారు. అయితే అక్కడ కూడా కేసులు పెరుగుతుండడంతో 15 రోజుల్లోనే మళ్లీ సిటీకి వచ్చారు. గ్రామాల్లో పరిస్థితి బాగాలేకపోవడం, ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే దగ్గరలో హాస్పిటల్‌‌‌‌ సౌలతులు లేకపోవడంతో భయంతో కుటుంబంతో సహా మళ్లీ హైదరాబాద్ వచ్చాడు. 

మంచిర్యాల్ జిల్లాలోని జైపూర్ గ్రామానికి చెందిన మహేందర్ ప్రైవేట్ కంపెనీలో సూపర్​వైజర్​గా చేస్తున్నడు. లాక్​డౌన్​ పెట్టడంతో కంపెనీ కూడా నడవడం లేదు. దీంతో ఫ్యామిలీని తీసుకుని గ్రామానికి వెళ్లాడు. అయితే ఊర్లో 20కి పైగా పాజిటివ్ కేసులు రావడం, ఇద్దరు చనిపోవడంతో పని నడవకున్నా సరే సిటీలోనే జాగ్రత్తగా ఉందామనుకుని ఉదయాన్నే బస్సు ఎక్కి పట్నానికి చేరాడు.

హైదరాబాద్, వెలుగు: పట్నంలో కేసులు పెరుగుతున్నాయని, ఊరిలో ఉంటే బెటర్ అని గ్రామాలకు వెళ్లిన కొందరు ప్రైవేటు ఉద్యోగులు, వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న సాఫ్ట్​వేర్​ ఎంప్లాయీస్ మళ్లీ సిటీకి వచ్చేస్తున్నరు. పల్లెల్లో కూడా కరోనా కేసులు పెరుగుతుండడంతో మళ్లీ పట్నం బాటపడుతున్నరు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆందోళన ఎక్కువవుతుండడం, వెంటనే హాస్పిటల్​కు వెళ్లి డాక్టర్​ను సంప్రదించే సౌకర్యం పల్లెల్లో లేకపోవడం కూడా ప్రధాన కారణంగా పేర్కొంటున్నరు. పోయినేడాది మార్చిలో లాక్​డౌన్​ ప్రకటించిన తరువాత హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేసే చాలామంది ప్రైవేటు ఉద్యోగులు, కూలీలు, ఇతర సిబ్బంది సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. కొందరు వర్క్ ఫ్రమ్ హోం చేయగా, మరికొందరు ఉద్యోగాలు కోల్పోయారు. ఆ సమయంలో ఊర్లలో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదయ్యేవి. దీంతో అక్కడే సేఫ్​గా ఉండొచ్చని చాలామంది అనుకున్నారు. ఫస్ట్‌‌ వేవ్‌‌లో కేసులు తగ్గిన తరువాత తిరిగి హైదరాబాద్‌‌కు వచ్చారు.

రెండంకెల్లో పాజిటివ్ కేసులు
రాష్ట్రంలోని 70 శాతం గ్రామాల్లో డబుల్ డిజిట్ లో యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఇటీవల సర్కార్ జరిపిన ర్యాండమ్ సర్వేలో వెల్లడైందని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 10 వేలకు పైగా గ్రామాలు ఉన్నాయి. మొన్నటి వరకు పట్టణాల్లో పెరిగిన పాజిటివ్ కేసులు ఇప్పుడు గ్రామాలకూ పాకాయి. ఈ విషయాన్ని కరోనా కంట్రోల్ వర్కింగ్‌‌లో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు 'వెలుగు'కు తెలిపారు. ఈనెల 1వ తేదీ నుంచి 10 రోజుల్లోనే వైరస్ వేగంగా గ్రామాలకు పాకిందని చెప్పారు. ర్యాండమ్ సర్వేలో జనగాం జిల్లా బచ్చన్న పేట మండలంలోని 22 గ్రామాలు ఉండగా.. 20 గ్రామాల్లో రెండు అంకెల్లోనే యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదే జిల్లాలోని పాలకుర్తి మండలంలోని 20 గ్రామాలకు.. 16 గ్రామాల్లో 14 నుంచి 18 చొప్పున పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఒక్క జనగాంలోనే కాదు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలంలో 7 గ్రామాల్లో 10 చొప్పున, సంగారెడ్డి జిల్లా ఆందోల్​లో 19 గ్రామాల్లో కూడా రెండంకెల చొప్పున కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిజామాబాద్ రూరల్ మండలంలో 19 గ్రామాలుంటే.. ప్రతి గ్రామంలోనూ 12 నుంచి 20, వనపర్తి కొత్తకోట మండలంలో 21 గ్రామాలు ఉండగా..18 గ్రామాల్లో డబుల్ డిజిట్​లోనే కరోనా కేసులు ఉన్నాయి. ఇవే కాకుండా పెద్దపల్లి, నల్గొండ, మంచిర్యాల జిల్లాల్లోని గ్రామాల నుంచి తీసుకున్న డేటాలోనూ యాక్టివ్ కేసులు సింగిల్ డిజిట్​లో లేవని ఆ అధికారి వివరించారు.

సెకండ్‌‌ వేవ్‌‌లో పరిస్థితి రివర్స్..
కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో నెలాఖరు నుంచే చాలా మంది ఇక్కడి నుంచి సొంత ఊర్లకు వెళ్లారు. మళ్లీ లాక్​డౌన్​ విధిస్తారనే ప్రచారం జరగడంతో మరింత మంది గ్రామాలకు ప్రయాణమయ్యారు. అయితే ఈసారి పరిస్థితులు రివర్స్‌‌ అయ్యాయి. గ్రామాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువగానే రికార్డవుతున్నాయి. ఊర్లలోనూ పాజిటివిటీ రేటు పెరిగింది. దీంతో వర్క్ ఫ్రం హోం ఎంప్లాయీస్, లాక్​డౌన్​ సమయాన్ని ఊర్లో గడుపుదాం అని వెళ్లిన ప్రైవేట్ ఎంప్లాయీస్ తిరిగి సిటీలకు చేరుకుంటున్నారు. ఒక్కో ఊర్లో ప్రస్తుతం పది యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.