చెట్లు నరికితే జైలే

చెట్లు నరికితే జైలే

18 చెట్లను నరికిన వ్యక్తికి బాచుపల్లి తహసీల్దార్‍ రూ.25 వేలు జరిమానా విధించారు. అలాగే నరికిన18తోపాటు మరో 50 మొక్కలు నాటాలని ఆదేశించారు. మేడ్చల్‍ జిల్లా, బాచుపల్లి గ్రామంలోని కేఆర్‍ సీఆర్‍ హరితవనం కాలనీలో 3 సంవత్సరాల క్రితం హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి పెద్దవయ్యాయి. అయితే కొన్నిరోజుల క్రితం కాలనీలో దామోదర్‍రావు అనే వ్యక్తి స్థానిక గీతాంజలి స్కూల్ పక్కనున్న ప్లాటును కొనుగోలు చేశాడు. శుక్రవారం మధ్యాహ్నం తన ప్లాటుకు అడ్డంగా ఉన్నాయన్న కారణంతో18 చెట్లను జేసీబీతో వేర్లతో సహా తీసివేయించాడు. దీనిపై కాలనీవాసులు మేడ్చల్ కలెక్టర్ ఎంవీరెడ్డికి ఫిర్యాదు చేశారు. విచారించి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాచుపల్లి తహసీల్దార్‍ ఆదేశించారు. విచారణ చేపట్టిన తహసీల్దారు గిరి 18 చెట్లను వేర్లతో సహా పికేయించినట్లు గుర్తించారు. వాల్టా చట్టం ప్రకారం రూ.25 వేల జరిమానతో పాటు పీకేసిన 18తోపాటు మరో 50 మొక్కలను వెంటనే నాటాలని దామోదర్‍రావును ఆదేంచారు. లేదంటే క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. మొక్కలు నాటుతానని చెప్పి, జరిమానా చెల్లించాడు.

వాల్టా ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి చెట్లు నరికితే కఠిన చర్యలు తీసుకుంటాం . ఎంతో శ్రమించి హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను బతికిస్తున్నాం. చెట్ల జోలికి వస్తే ఎంతటి వారైనా ఉపేక్షించం. స్థానికంగా ఎవరైనా చెట్లు నరికినట్లు తెలిస్తే
సమాచారం ఇవ్వండి.
– గిరి, తహసీల్దార్

ఎంతో శ్రమించి పెంచాం
కేఆర్ సీఆర్‍ కాలనీలో 3 ఏళ్ల క్రితం ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా కాలనీలో రోడ్లకు ఇరువైపులా దాదాపు 1000 మొక్కలు నాటాం. చిన్నపిల్లల్లా చూసుకుంటున్నాం . ట్యాంకర్లతో నీరు పోస్తున్నాం . దామోదర్ అనే వ్యక్తి వారం క్రితం జేసీబీతో వస్తే ప్లాటు సాఫ్ చేసుకోండి కానీ చెట్లను ఏమి చేయవద్దని చెప్పాం . శుక్రవారం మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో 18 చెట్లను పీకేపించాడు.
– రాజిరెడ్డి, కాలనీ అధ్యక్షుడు