రాఫెల్​కు మిసైళ్లు తోడైతే..

రాఫెల్​కు మిసైళ్లు తోడైతే..

మరికొద్ది రోజుల్లో రాఫెల్​ యుద్ధ విమానాలు ఆర్మీలోకి చేరబోతున్నాయి. మన సైనిక బలగం బలాన్ని మరింత పెంచబోతున్నాయి. మరి, అలాంటి రాఫెల్​కు ఎంత దూరంలో ఉన్నా వెంటాడి వేటాడే మిసైళ్లు తోడైతే ఆ బలం ఇంకెంత ఉంటుంది? అవును, అలాంటి డెడ్లీ మిసైళ్లే రాఫెల్​లో సీట్లు బుక్​ చేసుకున్నాయి. ఆ మిసైళ్లు మీటియోర్​, స్కాల్ప్​. యూరప్​కు చెందిన ఎంబీడీఏ (మాత్రా బీఏఈ డైనమిక్స్​ ఎలీనియా) అనే కంపెనీ వాటిని తయారు చేసింది. 59 వేల కోట్ల రూపాయల రాఫెల్​ డీల్​లో అవి కూడా భాగం. వాటి వల్ల ఇప్పటికే రగిలిపోతున్న బార్డర్​లో ఇండియాకు మరింత శక్తి వచ్చినట్టవుతుంది. మంగళవారం పారిస్​లోని ఎయిర్​బేస్​లో రాఫెల్​ జెట్లను అధికారికంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తీసుకోనున్నారు. ‘‘ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా ఈ వెపన్లతో కూడిన రాఫెల్​ యుద్ధవిమానాలతో ఇండియా ఆర్మీ శక్తిమంతమవుతుంది. ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ (ఐఏఎఫ్​)కు ఈ స్కాల్ప్​, మీటియోర్​ మిసైళ్లు అదనపు బలాన్నిస్తాయి” అని ఎంబీడీఏ ఇండియా చీఫ్​ లోయిక్​ పీడివాచె అన్నారు. అత్యంత అధునాతనమైన ఈ వెపన్లున్న రాఫెల్​ చాలా డెడ్లీ యుద్ధవిమానమన్నారు. ఇండియాకు 36 రాఫెల్​ విమానాలు అమ్మే ప్రాజెక్టులో భాగస్వాములమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోని కంటికి కనిపించని దూరాలను ఛేదించే మిసైళ్లలో మీటియోర్​ బెస్ట్​ అని చెప్పారు.

మీటియోర్.. తప్పించుకోవడం కష్టం

ఇది బియాండ్​ విజువల్​ రేంజ్​ ఎయిర్​ టు ఎయిర్​ మిసైల్​. అంటే కంటికి కనిపించని దూరాల్లోని లక్ష్యాలను ఈజీగా కొట్టేసే మిసైల్​ అన్నమాట. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలనూ ఛేదించగలదు. ఒకవేళ లక్ష్యం 60 కిలోమీటర్ల దూరంలో గనక ఉంటే మీటియోర్​ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. దాంట్లోని ఘన ఇంధన ర్యామ్​జెట్​ ఇంజన్లతో అది మాక్​ 4 స్పీడ్​తో దూసుకెళుతుంది. అంటే సౌండు స్పీడు కన్నా నాలుగు రెట్ల వేగమన్నమాట. ఇంకా చెప్పాలంటే.. గంటకు దాదాపు 5 వేల కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. అంతేకాదు, ఒక్కసారి విమానం నుంచి దాన్ని వదిలాక అది టార్గెట్​ తప్పితే, మళ్లీ దానిని రీ టార్గెట్​ చేయొచ్చు. దాన్లోని టూ వే డేటా లింక్​ దానికి ఆ అదనపు బలాన్నిచ్చింది. ఇప్పటికే రాయల్​ ఎయిర్​ఫోర్స్​లోని యూరోఫైటర్​ టైఫూన్​, రాయల్​ సౌదీ ఎయిర్​ఫోర్స్​, లుఫ్త్​వాఫీ, స్పానిష్​ ఎయిర్​ఫోర్స్​, ఇటాలియన్​ ఎయిర్​ఫోర్స్​, ఖతార్​ ఎయిర్​ఫోర్స్​, బ్రిటిష్​ అండ్​ ఇటాలియన్​ ఎఫ్​ 35 లైట్నింగ్​ , దసో రాఫెల్​, ఈజిప్షియన్​ ఎయిర్​ఫోర్స్​, స్వీడన్​, బ్రెజిల్​ ఎయిర్​ఫోర్స్​లోని జేఏఎస్​ 39 గ్రిపెన్​లలోకి అది చేరిపోయింది.

స్కాల్ప్.. తక్కువ ఎత్తులో

దీనికే స్టార్మ్​ షాడో అని పేరు. బ్రిటన్​ ఎయిర్​ఫోర్స్​ దానికి ఆ పేరు పెట్టుకుంది. ఫ్రెంచ్​లో మాత్రం స్కాల్ప్​ ఈజీ అని పిలుస్తారు. స్కాల్ప్​ఈజీ అంటే సిస్టమ్​ డి క్రాయిసరి అటానమీ ఏ లాంగ్​ పోర్టీ ఎంప్లోయి జనరల్​(జనరల్​ పర్పస్​ లాంగ్​ రేంజ్​ క్రూయిజ్​ మిసైల్​). 560 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది. దీని స్పీడ్​ మాక్​ 0.8. అంటే దాదాపు సౌండ్​ స్పీడ్​తో దూసుకెళుతుంది. ఈ మిసైల్​ బరువు 1300 కిలోలు ఉంటుంది. ఒక్కసారి ప్రయోగించాక దాంట్లో ఎలాంటి మార్పులూ చేయలేం. టార్గెట్​ సమాచారాన్ని మార్చలేం. జీపీఎస్​ ఆధారంగా తక్కువ ఎత్తులో ఈ మిసైల్​ దూసుకెళుతుంది. టార్గెట్​ దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా పైకి లేచి దాడి చేసేస్తుంది.