రాహుల్​, ప్రియాంకను అడ్డుకున్న యూపీ పోలీసులు

రాహుల్​, ప్రియాంకను అడ్డుకున్న యూపీ పోలీసులు

మీరట్​(యూపీ): సిటిజన్​షిప్​ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఆందోళనలో చనిపోయిన నిరసనకారుల కుటుంబ సభ్యులను  పరామర్శించడానికి  బయల్దేరిన కాంగ్రెస్​ నాయకులు రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీలను మీరట్​ వెళ్లకుండా ఉత్తరప్రదేశ్​ పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు.  మరో కాంగ్రెస్​ నేతతో కలిసి… ముగ్గురం మాత్రమే బాధిత కుటుంబ సభ్యుల్ని కలుసుకుంటామని చెప్పినా పోలీసులు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్​ వర్గాలు చెప్పాయి.  మీరట్​కు ముందుగానే పార్తాపూర్​ పోలీస్​ స్టేషన్​ దగ్గర ఇద్దరు నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు.   ఎందుకు ఆపుతున్నారో కారణం చెప్పమన్నా పోలీసులు చెప్పలేదని రాహుల్​గాంధీ  ఆ తర్వాత మీడియాకు చెప్పారు.

రాహుల్​, ప్రియాంక వెళ్లిన తర్వాత  బాధిత కుటుంబ సభ్యుల్ని యూపీ కాంగ్రెస్​ నాయకులు ఇమ్రాన్​ మసూద్, పంకజ్​ మాలిక్​లు కలిశారు.  బాధిత ఫ్యామిలీ మెంబర్లను  రాహుల్​, ప్రియాంకలు బుధవారం కలుసుకుంటారని కాంగ్రెస్​ ప్రతినిధి ఒకరు చెప్పారు.  పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఇద్దరు నాయకులు నేరుగా  అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి  వెళ్లిపోయారు.  పోయిన ఆదివారం  సీఏఏ ఆందోళనలో చనిపోయినవారి కుటుంబసభ్యుల్ని యూపీలోని బిజ్నోర్ కి వెళ్లి ప్రియాంక గాంధీ పరామర్శించారు.  సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో మీరట్​లోనే ఐదుగురు నిరసనకారులు చనిపోయారు.