V6 News

రాఖీ పండుగ: బ్రదర్స్ & సిస్టర్స్ ఫెస్టివల్.. ఎక్కడ ఎలా పిలుస్తారు.. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు

రాఖీ పండుగ: బ్రదర్స్ & సిస్టర్స్ ఫెస్టివల్.. ఎక్కడ ఎలా పిలుస్తారు.. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు

రాఖీ పండుగ.. శ్రావణ పౌర్ణమి.. రక్షాబంధన్​.. ఇలా అనేక పేర్లతో పిలిచే రాఖీ సెలబ్రేషన్స్​ కు అన్నదమ్ములు ..అక్క చెల్లెళ్లు రడీ అవుతున్నారు.  భారతదేశంలో ఈ పండుగను ఒక్కోప్రాంతంతో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఏ ప్రాంతంలో ఎలా పిలుస్తారు.. ఎలా సెలబ్రేట్​ చేసుకుంటారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

రాఖీ పౌర్ణమి.. శ్రావణ పౌర్ణమిని భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన పేర్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో  రాఖీ పౌర్ణమి.. 'రక్షాబంధన్ 'అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలోనూ రక్షాబంధన్ గా పిలిచే ఈ పండుగను  సావనీ  సలోనా అని కూడా అంటారు. దక్షిణాదిలో నారికేళ పౌర్ణమి..అవనీ అవిత్తమ అనే పేర్లతో గుజరాత్​ లో పవిత్రోపనా' అనే పేరుతో పిలుస్తారు. మహారాష్ట్రలో దీన్ని 'సదాల్లి పూర్ణిమ'గా జరుపుకుంటారు. 

మహారాష్ట్ర, కోస్తా తీరంలో కొలిస్ అనే మత్స్యకారులు వరుణదేవుని ఆరాధ్యదైవంగా కొలుస్తారు. రాఖీ పండుగ సందర్భంగా వీళ్లు కొబ్బరికాయల్ని సముద్రంలోకి విసిరి వరుణదేవుని పూజిస్తారు.సంపదలకు ప్రతీక అయిన సింధూరాన్ని ఒకరి నుదుటిపై మరొకరు దిద్దుతారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో ఘూలాన్ పూర్ణిమ పేరుతో రాధాకృష్ణులను పూజించిన తర్వాత మహిళలు తమ సోదరులకు రాఖీలు కడతారు.

బంధం నిలిపే రక్షాబంధన్

రాఖీ అంటే రక్షణ అని అర్ధం. రక్ష అంటే.... రక్షించడం... బంధన్ అంటే కట్టడం. ఒక ఇంటి అడపడుచు తన అన్న లేదా తమ్ముడు వేసే ప్రతి అడుగూ విజయం వైపే సాగాలని, తన సోదరుడు అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ.. నుదుట కుంకుమ పెట్టి, సన్నటి దారం, ఒక తోరణంతో తయారు చేసిన రాఖీని వాళ్ల చేతికి కడుతూ మూడు ముళ్లు వేస్తుంది. తర్వాత నోటిని తీపి చేసి.. హారతి పడుతుంది. అప్పుడు సోదరుడు తన సోదరికి...ఏకష్టమొచ్చినా కాపాడతానని వాగ్దానం చేస్తాడు. ఆపైన తనకు తోచిన కానుకలను అందిస్తాడు. ఈ పండుగకు కులమతాల పట్టింపు లేదు. పేదాగొప్పా తేడా అసలే ఉండదు.

భర్తకూ కట్టేవాళ్లు...

పురాణాల్లో దేవుళ్లు, రాక్షసుల మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉండేది. ఓసారి దేవతల రాజు ఇంద్రుడు యుద్ధంలో ఓడిపోతాడు. దాంతో ఇంక రాక్షసులతో యుద్ధంలో గెలవలేనని అనుకుని... ఇంద్రుడు దేవతలందరినీ తీసుకొని అమరా తలచుకుంటాడు. ఇంద్రుడి నిస్సహాయతను గమనించిన ఆయన భార్య శచీ దేవి.. తన భర్తకు తిరిగి ఎలాగైనా శక్తినివ్వాలని ఆలోచిస్తుంటుంది. ఇంతలో రాక్షసరాజు అమరావతిని కూడా అక్రమించుకోబోతున్నాడని. అమరావతి మీదకి యుద్ధానికి రాబోతున్నాడని సమాచారం వస్తుంది. 

సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిమ అవడంతో పార్వతీపరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజిస్తుంది శచీ దేవి . తర్వాత పూజించిన రక్షను ఇంద్రుడి చేతికి కడుతుంది. అప్పుడు తన శక్తిని తిరిగి తెచ్చుకున్న ఇంద్రుడు రాక్షసరాజును ఓడించి తిరిగి మూడులోకాలను గెలుచుకుంటాడు. అప్పుడు శచీదేవి ప్రారంభించిన అ రక్షాబంధనోత్సవ తోరణం తర్వాతి కాలంలో రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆచారంగా వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ పండుగను అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లీ కాదు ఖార్యాభర్తలు కూడా జరుపుకోవచ్చని పండితులు అంటున్నారు.

రాఖీ పౌర్ణమి అంటే... ఏముంది.. ఇంట్లో ఉన్న అన్న లేదా తమ్ముడికి రాఖీ కట్టడమే కదా అనుకుంటారు పెళ్లికాని అమ్మాయిలు. కానీ ఆ పండుగ విలువ అమ్మాయిలకైనా... అబ్బాయిలకైనా పెళ్లయ్యాక తెలుస్తుంది.. చిన్నప్పట్నించి ఒక్కటిగా పెరిగిన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు... పెళ్లిళ్లు కాగానే రెండు వేరువేరు కుటుంబాలుగా మారతారు. అలాంటప్పుడు తమ ప్రేమను వ్యక్తపరచడానికి, బంధాన్ని పెంచుకోవడానికి... ఏడాదంతా ఈ రాఖీ పౌర్ణమి' కోసం ఎదురు చూస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా ఆ రోజు మాత్రం ఒకచోట కలిసి మనసులోని సంతోషం, బాధను పంచుకుంటారు. ఈ పండుగకు అంత ప్రత్యేకత ఉంది.