V6 News

ఆర్ కే పురం బీజేపీ కార్పొరేటర్ భర్త ధీరజ్ అరెస్ట్

 ఆర్ కే పురం  బీజేపీ కార్పొరేటర్ భర్త ధీరజ్ అరెస్ట్
  • సబ్​ కాంట్రాక్టర్​పై దాడి కేసులో రిమాండ్​కు తరలింపు  

ఎల్బీనగర్, వెలుగు : సబ్​  కాంట్రాక్టర్​పై దాడి కేసులో బీజేపీ నేత ధీరజ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్కేపురం బీజేపీ కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డి.. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 1 పనులను పెద్దపల్లికి చెందిన దాసరి హనుమయ్యకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఆదివారం ఆ డబ్బులు అడగడానికి హనుమయ్య అతడి స్నేహితులతో కలిసి రాగా...గొడవ జరిగింది. 

తనపై దాడి చేయడంతో పాటు తన ఫ్రెండ్​ భాస్కర్​ ను కులం పేరుతో దూషించాడని హనుమయ్య చైతన్యపురి పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. ధీరజ్​రెడ్డి కూడా తన స్నేహితుడిని కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. సోమవారం నిందితుడిపై చర్యలు తీసుకోవడం లేదని, ధీరజ్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పీఎస్ ముందు బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. 

గత  ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పెద్దపల్లి అభ్యర్థిగా  పోటీ చేసిన హనుమయ్య కూతురు ఉష మాట్లాడుతూ డబ్బులు ఇస్తానని ఆఫీస్​కు పిలిపించి తన తండ్రిపై హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు. దీంతో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై భద్రయ్య తన సిబ్బందితో కలిసి ధీరజ్ రెడ్డి ఆఫీస్​కు వెళ్లి ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్ కు తరలించి విచారించారు. తర్వాత  అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

ఆ ఆరోపణలు అవాస్తవం: ధీరజ్ రెడ్డి

ఒప్పందం ప్రకారం హనుమయ్య పనులు పూర్తి చేయకుండా రూ.31 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని ధీరజ్ రెడ్డి ఆరోపించారు. తమ వివాదంలో బీఆర్ఎస్ లీడర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ కు హనుమయ్య బినామీగా ఉన్నాడని ఆరోపించారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్తానని చెప్పారు.