వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి, ఐదుగురికి గాయాలు

వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి, ఐదుగురికి గాయాలు

బషీర్​బాగ్/జీడిమెట్ల/ఇబ్రహీంపట్నం, వెలుగు: గ్రేటర్ పరిధి, శివార్లలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు. ఓవర్ స్పీడ్, డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ఈ ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.  

బైక్ స్కిడ్ అయ్యి బస్సు కిందపడి..

బైక్ అదుపుతప్పి బస్సు కింద పడి బీటెక్ స్టూడెంట్ చనిపోయిన ఘటన బేగంబజార్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన ఆకుదారి సాత్విక్(20) బడంగ్​పేట పరిధి నాదర్​గుల్​లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. నాదర్​గుల్​లోనే ఓ హాస్టల్​లో ఉంటున్నాడు. బుధవారం ఖైరతాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్​లో జరిగిన ఓ సెమినార్ కు తన ఫ్రెండ్స్​ దీపక్, శివతేజతో కలిసి బైక్ పై వచ్చాడు. సెమినార్ పూర్తయిన తర్వాత ముగ్గురు కలిసి నాదర్​గుల్​కు బయలుదేరారు. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ బిల్డింగ్ వద్ద  బైక్ అదుపుతప్పి ముగ్గురు కిందపడ్డారు.  అదే టైమ్​లో బర్కత్​పురా డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు వెనక టైర్లు సాత్విక్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి ఫ్రెండ్స్ దీపక్, శివతేజకు గాయాలు కాగా.. పోలీసులు వారిని హాస్పిటల్ కు తరలించారు.  సాత్విక్ ఓవర్ స్పీడ్ తో బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని.. హెల్మెట్ కూడా పెట్టుకోలేదని  పోలీసులు తెలిపారు. డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించామన్నారు.

మద్యం మత్తులో కారు నడిపి..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన సాయికుమార్ సిటీకి వచ్చి మైసమ్మగూడలోని ఓ హాస్టల్​లో ఉంటూ మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి సాయికుమార్(21) ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నాడు. బుధవారం ఉదయం కారులో దూలపల్లి వైపు బయలుదేరాడు. అదే టైమ్​లో సూరారంలోని సాయిబాబానగర్​కు చెందిన షేక్ సాజిద్(23) తోటి కార్మికులు ఇద్దరితో కలిసి బైక్ పై మైసమ్మగూడలోని హిమాలయ కంపెనీ వైపు వస్తున్నారు. మైసమ్మగూడ వద్ద సాయికుమార్ ఓవర్ స్పీడ్​తో వచ్చి సాజిద్ బైక్ ను ఢీకొట్టాడు. ప్రమాదంలో సాజిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. కార్మికులు శోభ, మణెమ్మకు తీవ్ర గాయాలు కాగా వారిని హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాయికుమార్ మద్యం మత్తులో కారు నడిపినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బైక్ ను ఢీకొట్టిన లారీ..    

బైక్ ను లారీ ఢీకొట్టగా ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఆదిబట్ల పీఎస్ పరిధిలో జరిగింది. బుధవారం రాత్రి తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడ చౌరస్తాలో ఓవర్ స్పీడ్ తో వచ్చిన ఓ లారీ ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పై ఉన్న ఆసిన మల్లేశ్(14) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడిపిన అతడి బాబాయికి తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలోని  హాస్పిటల్ కు తరలించారు. చనిపోయిన బాలుడి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలంటూ బంధువులు, స్థానికులు సాగర్ రోడ్ పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో గంట సేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఆదిబట్ల పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పి పంపించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు