వేగం, నిర్లక్ష్యం చంపేస్తున్నాయ్​

వేగం, నిర్లక్ష్యం చంపేస్తున్నాయ్​
  • గంటకు 18.. రోజుకు 426.. సంవత్సరానికి 1,55,000..

ఇవి మన దేశంలో పోయిన ఏడాది రోడ్డు యాక్సిడెంట్లలో చనిపోయినోళ్ల సంఖ్య. ఆ యాక్సిడెంట్​ల్లో గాయపడి మంచానికి పరిమితమైనోళ్లు, కాళ్లు, చేతులు పోగొట్టుకున్నోళ్లయితే లక్షల్లోనే. ఈ లెక్కలన్నీ చెప్పింది నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​బ్యూరో (ఎన్​సీఆర్​బీ). స్టాండర్డ్స్​కు తగ్గట్లు లేని రోడ్లు, వేగం, నిర్లక్ష్యం ఏటా వేలమంది ప్రాణాలు తీస్తున్నట్లు ఎన్​సీఆర్​బీ చెప్తోంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో​ ఇండస్ట్రియలిస్ట్​, టాటా సన్స్​ మాజీ ఛైర్మన్​ సైరస్​ మిస్త్రీ చనిపోవడం వెనక ఇవే కారణాలున్నట్లు ఇన్వెస్టిగేషన్​ ఆఫీసర్లు చెప్పడం ఎన్​సీఆర్​బీ రిపోర్ట్​ను బలపరుస్తోంది. ఆ వివరాల గురించి కవర్​స్టోరీ ఇది.

ఇంటి నుంచి వంద అడుగుల దూరంలో ఉండే దుకాణానికి కూడా బైక్​ మీదో, కారులోనో వెళ్లేవాళ్లున్న రోజులివి. అవసరానికి వెహికల్స్​ కొనేవాళ్ల సంగతి పక్కన పెడితే, గొప్పల కోసమో, స్టైల్​ కోసమో బండి తీసుకునేవాళ్ల సంఖ్యా ఎక్కువే. అందుకే మనదేశంలో ఏటా వాహనాల​ అమ్మకాలు పెరుగుతున్నాయి. గవర్నమెంట్​ రికార్డ్స్​ ప్రకారం 2019లో మనదేశంలో అన్ని రకాల వెహికల్స్​ కలిపి సుమారు 30 కోట్ల వరకు ఉన్నాయి. ఈ  మూడేండ్లలో మరో రెండు కోట్ల వరకైనా వీటి సంఖ్య పెరిగి ఉంటుందని అంచనా. 

పది శాతం మరణాలు మనదేశంలోనే..

ప్రపంచంలోని మొత్తం వెహికల్స్​లో మనదగ్గర ఉన్నది కేవలం ఒక్క శాతం మాత్రమే. కానీ, రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయేవాళ్లు మాత్రం మనదేశంలోనే ఎక్కువ. వరల్డ్​ బ్యాంక్​ డేటా ప్రకారం.. ఏటా ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు. వాళ్లలో10శాతం భారతీయులే. ఎన్​సీఆర్​బీ రిపోర్ట్​ ‘యాక్సిడెంటల్​ డెత్స్​ అండ్​ సూసైడ్స్​ ఇన్​ ఇండియా–2021’  కూడా ఇదే విషయం చెప్తోంది. దీని ప్రకారం నిరుడు మనదేశంలో 4,03,000​ యాక్సిడెంట్స్​ జరిగాయి. వీటివల్ల 1,55,000 మంది చనిపోయారు. 3,71,000 మంది గాయపడ్డారు. ఇది అంతకుముందు సంవత్సరం(2020) కంటే17శాతం ఎక్కువ. రాష్ట్రాల ప్రకారం చూస్తే తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. పోయిన ఏడాది అక్కడ 55,682 యాక్సిడెంట్స్​ జరిగాయి. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్​(48,219), కర్ణాటక(34,647), ఉత్తరప్రదేశ్​(36,509), మహారాష్ట్ర(26,598), రాజస్తాన్​(20,954) ఉన్నాయి. మరణాల్లో మాత్రం ఉత్తరప్రదేశ్​ది​ మొదటి స్థానం. అక్కడ 21,792 మంది చనిపోయారు. ఆ తర్వాత తమిళనాడు(15,384), మహారాష్ట్ర(13,911), మధ్యప్రదేశ్​(12,480), కర్ణాటక(10,038), రాజస్తాన్​(10,043) ఉన్నాయి. మన తెలంగాణలో నిరుడు ప్రతి 24గంటలకు 20 మంది యాక్సిడెంట్ల వల్ల చనిపోయినట్లు ఎన్​సీఆర్​బీ లెక్కలు చెప్తున్నాయి.

వేగం, నిర్లక్ష్యం చంపేస్తున్నాయ్​

యాక్సిడెంట్స్​కు చాలా కారణాలున్నా వాటిలో ప్రధానమైనవి మాత్రం అతివేగం, నిర్లక్ష్యం. వీటివల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు ఎన్​సీఆర్​బీ చెప్తోంది. గత ఏడాది యాక్సిడెంట్స్​లో అతివేగం(ఓవర్​స్పీడ్​) వల్ల 87వేల మంది, నిర్లక్ష్యం(కేర్​లెస్​ డ్రైవింగ్​) వల్ల 42వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ​పోయిన ఏడాది ఫాస్ట్​ డ్రైవింగ్​ వల్ల 55.5శాతం, డ్రైవింగ్​లో నిర్లక్ష్యం​ వల్ల 27.5శాతం యాక్సిడెంట్స్​ జరిగినట్లు చెప్తోంది ఎన్​సీఆర్​బీ. 

నిర్లక్ష్యం అంటే ఇష్టం వచ్చినట్లు డ్రైవ్​ చేయడం, అజాగ్రత్తగా బండిని నడపడం, ట్రాఫిక్ ​రూల్స్​ పాటించకపోవడం, ఓవర్​టేకింగ్ వంటివి.  వేగం, నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదాల్లో గాయపడిన వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. నిజానికి మిగిలిన రోడ్లతో పోలిస్తే హైవేలు బాగుంటాయి. వెడల్పుగా ఉండడంతోపాటు గుంతలు తక్కువ కనిపిస్తాయి. కానీ, వీటి మీదే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. చనిపోయేవాళ్లు కూడా ఎక్కువని ఎన్​సీఆర్​బీ చెప్తోంది. దీన్ని బట్టి వేగం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలని తెలుస్తోంది. 

ఇవికాక డ్రైవర్లు అలసిపోవడం, వెలుతురు సరిగా లేకపోవడం, వాతావరణ ఇబ్బందులు, రోడ్లు సరిగా లేకపోవడం వంటివి కూడా యాక్సిడెంట్లకు కారణాలే.  వీటికి తోడు ఈ మధ్య కాలంలో డ్రంకెన్​ డ్రైవ్(తాగి బండి నడపడం)​ వల్ల జరుగుతున్న ప్రమాదాలు కూడా బాగా పెరిగాయి. గత ఏడాది జరిగిన యాక్సిడెంట్స్​లో డ్రంకెన్​ డ్రైవ్​ వాటా1.9శాతం. దీనివల్ల 2,935 మంది చనిపోయారు.7,235 మంది గాయపడ్డారు. అయితే, ఇండియాలో​ యాక్సిడెంట్స్​​, డెత్​ రేట్​ ఎక్కువగా ఉండడానికి ప్రధాన​ కారణం రోడ్లు సరిగా లేకపోవడమే అని మిగిలిన దేశాల్లో ప్రచారంలో ఉంది. 

టూ వీలర్స్​ నెం.1

ఏటా మనదేశంలో జరుగుతున్న యాక్సిడెంట్స్​లో ఎక్కువ వాటా టూ వీలర్స్​దే. పోయిన సంవత్సరం జరిగిన ప్రమాదాల్లో 69,240 మంది టూ వీలర్​ ప్రమాదాల్లో చనిపోయారు. ఇది మొత్తం మరణాల్లో 44.5శాతం. టూ వీలర్స్​ తర్వాత స్థానంలో కార్లు ఉన్నాయి. వీటి వల్ల జరిగిన యాక్సిడెంట్స్​లో 23,531మంది(15.1శాతం) చనిపోయారు. ఆ తర్వాత ట్రక్​లు/లారీల వల్ల 14,622 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మొత్తం యాక్సిడెంట్స్​ డెత్స్​లో 9.4శాతం. టూ వీలర్​ యాక్సిడెంట్స్​లో చనిపోయినోళ్ల లిస్ట్​లో తమిళనాడు టాప్​లో ఉంది. అక్కడ పోయిన ఏడాది మొత్తం 8,259 మంది టూవీలర్​ యాక్సిడెంట్స్​ వల్ల ప్రాణాలు వదిలారు. తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్​(7,429 మంది) ఉంది. టూ వీలర్స్​ వల్ల జరుగుతున్న యాక్సిడెంట్స్​లో ఎక్కువగా చనిపోతున్నది, గాయపడుతున్నది యువకులే.  డ్రగ్స్,ఆల్కహాల్​ తీసుకొని బండి నడపడం, అతివేగం, స్టంట్స్​ చేయడం, చిన్నపిల్లలు బండి నడపడం వంటివి టూ వీలర్స్​ ప్రమాదాలకు కారణమని రవాణాశాఖ అధికారులు చెప్తున్నారు. టూ వీలర్స్​ తర్వాత కారు, ఎస్​వీయూ, జీప్​ వంటి ఫోర్​వీలర్స్ వల్ల15.1శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ట్రక్​, లారీ, మినీ ట్రక్స్ వల్ల 9.4శాతం, పాదచారుల వల్ల 12.2శాతం, బస్​ల వల్ల 3శాతం, మిగిలిన ప్రమాదాలు ఇతర వెహికల్స్​ వల్ల జరుగుతున్నాయి. 

ఆ టైంలోనే ఎక్కువ.. 

ఎన్​సీఆర్​బీ లెక్కల ప్రకారం.. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య యాక్సిడెంట్స్​ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ టైమ్​లో గత ఏడాది 81,410 ప్రమాదాలు​ జరిగాయి. మొత్తం యాక్సిడెంట్స్​లో ఇది 20.2శాతం. వెలుతురు తగ్గడం, వాతావరణ మార్పులు, డ్రైవర్లు అలసిపోవడం ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 3గంటల మధ్య 62,587 యాక్సిడెంట్స్,  ఆ తర్వాత 3 నుంచి సాయంత్రం 6గంటల మధ్య 71,711 యాక్సిడెంట్స్​ జరిగాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటలలోపు జరిగే యాక్సిడెంట్స్​కు ప్రధాన కారణం.. ట్రాఫిక్​ తక్కువగా ఉండడం.​ దాంతో రోడ్డు ఖాళీగా కనిపిస్తుంది. డ్రైవర్లు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు లేదా అజాగ్రత్తగా బండి నడుపుతున్నారు. అందుకే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 9గంటల మధ్య జరుగుతున్న యాక్సిడెంట్స్​లో తమిళనాడు, మధ్యప్రదేశ్​, కేరళ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.  

నేషనల్​ హైవేలపైనే...

గ్రామీణ, జిల్లా, రాష్ట్ర రహదారుల​ కన్నా నేషనల్​ హైవేలపైనే ఎక్కువ యాక్సిడెంట్స్​ జరుగుతున్నాయి. ఎన్​సీఆర్​బీ రిపోర్ట్​ ప్రకారం.. పోయిన ఏడాది జాతీయ రహదారులపై1,22,204 యాక్సిడెంట్స్ జరిగాయి. వీటి వల్ల 53,615 మంది చనిపోయారు. అంతేకాదు, హైవే ప్రమాదాల్లో గాయపడినవాళ్ల సంఖ్య మిగిలిన ప్రమాదాల కంటే ఎక్కువ. నిజానికి మనదేశంలో నేషనల్​ హైవేలు ఉండేది 2.1శాతం మాత్రమే. అంటే దేశం మొత్తంమీద అన్ని రకాల రోడ్లు కలిసి 63.9 లక్షల కిలోమీటర్ల పొడవు ఉండగా, అందులో నేషనల్​ హైవేల​ వాటా ఒక లక్షా33వేల కిలోమీటర్లు మాత్రమే. కానీ, యాక్సిడెంట్స్​, డెత్స్​ పరంగా చూస్తే నేషనల్​ హైవేలే టాప్​. అలాగే టౌన్లు, సిటీల్లోని రోడ్ల మీద కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే సుమారు 2,300 యాక్సిడెంట్స్​ జరిగాయి. వీటిలో దాదాపు 500 మందికి పైగా చనిపోయారు. మరో విషయం ఏంటంటే.. టౌన్లు, సిటీల్లో​ యాక్సిడెంట్స్​ ఎక్కువగా పాదచారులు రోడ్డు దాటే చోటే జరుగుతున్నాయి. పోయిన ఏడాది జరిగిన మొత్తం యాక్సిడెంట్స్​లో​ వీటి వాటా7.5శాతం. అలాగే స్కూల్​, కాలేజీల వద్ద యాక్సిడెంట్స్ ఎనిమిది శాతం జరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. 

సీట్​బెల్ట్​, ఎయిర్​బ్యాగ్స్ 

పరుగులు తీసే ప్రపంచంతో పోటీ పడాలంటే వెహికల్స్​ లేకుండా కుదరని రోజులివి. అయితే, అవే వెహికల్స్​ మనుషుల పాలిట మృత్యువుగా మారుతున్నాయి. రోడ్లు బాగలేకపోవడం, వాతావరణం సరిగా లేకపోవడం వంటివి పక్కన పెడితే నిర్లక్ష్యంగా నడపడం, అతివేగం, డ్రగ్స్​, ఆల్కహాల్​ తీసుకొని డ్రైవ్​ చేయకపోవడం మనచేతుల్లో ఉండేవే. వీటితోపాటు మరో రెండిటిని కూడా మన మేలు కోరే జాబితాలో చేర్చాలి. అవే.. సీట్​బెల్ట్, ఎయిర్​బ్యాగ్స్​. ఫోర్​ వీలర్​ వెహికల్స్​లో సీట్​బెల్ట్​, ఎయిర్​బ్యాగ్స్​ ఉంటే ప్రమాదాల్లో చాలావరకు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని ఇప్పటికే వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్స్​(డబ్ల్యూహెచ్​వో) తోపాటు అనేక సంస్థలు చెప్పాయి. అయితే, చాలా వెహికల్స్​లో ఎయిర్​బ్యాగ్స్​ కేవలం డ్రైవర్​కు, ముందుసీట్లోని వాళ్లకు మాత్రమే ఉంటున్నాయి. 

వెహికల్​ దేన్నైనా ఢీకొట్టినప్పుడు స్టీరింగ్​, డ్యాష్​బోర్డ్​, రూఫ్​కు ఉండే ఎయిర్​బ్యాగ్స్​ ఆటోమేటిక్​గా ఓపెన్​ అవుతాయి. ముందు సీట్లలో ఉండేవాళ్లకు ఎక్కువ ప్రమాదం జరగకుండా కాపాడతాయి. వీటిని మొదటిసారి మెర్సిడెజ్​ బెంజ్​ కంపెనీ తాము తయారుచేసిన ‘ఎస్​–క్లాస్​’ కార్లలో పెట్టింది. అయితే, అప్పటికి కేవలం డ్రైవర్​ సీట్లోని వాళ్లకు మాత్రమే ఎయిర్​బ్యాగ్​ సౌకర్యం ఉండేది. ఆ తర్వాత డ్రైవర్​తోపాటు ముందుసీట్లోని వాళ్లకూ ఎయిర్​బ్యాగ్​ ఉండేలా చాలా కంపెనీలు తమ కార్లను డిజైన్​ చేయించాయి. మనదేశంలో కూడా పోయిన ఏడాది కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్​ మినిస్ట్రీ ఒక నోటిఫికేషన్​ విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్​ 31, 2021 నుంచి అన్ని కార్లలోనూ డ్రైవర్​తోపాటు ముందుసీట్లోని వాళ్లకూ ఎయిర్​బ్యాగ్​ కచ్చితంగా ఉండాలి. ఎయిర్​బ్యాగ్​లు ఉన్నాయి కదా అని  సీట్​బెల్ట్​ పెట్టుకోకుండా ఉండొద్దు. ఎయిర్​బ్యాగ్​ ఉన్నా సీట్​బెల్ట్​ కచ్చితంగా పెట్టుకోవాలి. అప్పుడే ఎయిర్​బ్యాగ్​ వల్ల ఉపయోగం.
 
వెనక సీట్లోవాళ్లూ బెల్ట్​ పెట్టుకోవాలి

టూ వీలర్స్ మీద వెళ్లేవాళ్లకు హెల్మెట్​ ఎంత ముఖ్యమో కార్లలో వెళ్లేవాళ్లకు సీట్​బెల్ట్​ అంతే ముఖ్యం. సీట్​బెల్ట్​ పెట్టుకొని ఉంటే సైరస్​ మిస్త్రీ స్వల్ప గాయాలతో బయటపడేవాడని ‘సేవ్​లైఫ్​ ఫౌండేషన్​’ సంస్థ చెప్పింది. కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ కూడా ఇదే విషయం చెప్పారు. అయితే, ఇక్కడే చాలామందికి ఒక డౌట్​ వస్తోంది. ‘మిస్త్రీ వెనక సీట్లో ఉన్నాడు కదా. సీట్​బెల్ట్​ అవసరమా?’ అని. నిజానికి కచ్చితంగా అవసరం. ఈ మేరకు మనదేశంలో చట్టం కూడా ఉంది. కాకపోతే దాని గురించి చాలామందికి తెలియదు. సెంట్రల్​ మోటార్​ వెహికల్​ రూల్స్​(సీవీఎంఆర్)లోని సెక్షన్​138(3)లో ప్రకారం సీట్​బెల్ట్​ తప్పనిసరి. వెనకసీట్లోని వాళ్లు కూడా కచ్చితంగా సీట్​బెల్ట్​ పెట్టుకోవాలనే రూల్‌ 2004లో చేర్చారు. ఇది 2005 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని పాటించకపోతే 500 రూపాయల ఫైన్ వేస్తారు. 2019లో తెచ్చిన ‘మోటార్​ వెహికల్స్​(అమెండ్​మెంట్) యాక్ట్’​ కూడా ఇదే విషయం చెప్తోంది. దీని ప్రకారం కారులో డ్రైవర్​తోపాటు మిగిలినవాళ్లు కూడా కచ్చితంగా సీట్​బెల్ట్​ పెట్టుకోవాలి. ఈ రూల్​ పాటించకపోతే 194బి(1) సెక్షన్​ ప్రకారం వెయ్యి రూపాయలు జరిమానా వేస్తారు.

... సీట్​బెల్ట్​ వాడేది 7శాతమే !


వెనక సీట్లోని వాళ్లూ సీట్​బెల్ట్​ పెట్టుకోవాలనే రూల్​ ఎప్పటినుంచో ఉన్నప్పటికీ దీన్ని పాటించేవాళ్లు మాత్రం చాలా తక్కువ. ‘సేవ్​లైఫ్​ ఫౌండేషన్​’ 2019లో చేసిన సర్వే ఇదే విషయాన్ని చెప్పింది. దీని ప్రకారం70శాతం కార్లలో వెనక సీట్లకు సీట్​బెల్ట్​ సౌకర్యం ఉంది. కానీ, దాన్ని వాడేవాళ్లు కేవలం7శాతం మాత్రమే. 26శాతం మంది అప్పుడప్పుడు వాడుతున్నారు. మిగిలినవాళ్లు అసలు ఒక్కసారి కూడా వాడలేదు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది‌‌‌‌– సీట్​బెల్ట్​ పెట్టుకోవడం తప్పనిసరి కాదు అని అనుకోవడం. ఇలాంటివాళ్లు 37.8శాతం మంది ఉన్నారు. రెండు–వెనక సీట్లలోని సీట్​బెల్ట్ గురించి తెలియకపోవడం. ఇలాంటివాళ్లు 23.9శాతం ఉన్నారు. నిజానికి వెనక సీట్లోని వాళ్లు కూడా సీట్​బెల్ట్​ పెట్టుకోవాలనే చట్టం ఉన్న సంగతి తెలిసింది కేవలం 27.7శాతం మందికి మాత్రమే. 

చట్టాన్ని గట్టిగా అమలు చేయకపోవడం అన్నిటికన్నా ప్రధాన కారణం. జర్నీల్లో వెనక సీట్లోవాళ్లు బెల్ట్​ పెట్టుకోకపోయినప్పటికీ ఏ అధికారి కూడా తమను ఆపలేదని 91శాతం మంది చెప్పడం దీనికి ఉదాహరణ. పల్లెలు, చిన్న టౌన్ల సంగతి పక్కన పెడితే ముంబై, ఢిల్లీ, జైపూర్, కోల్​కతా, లక్నో, బెంగళూరు లాంటి సిటీల్లోనూ దాదాపు 98.2శాతం మందికి వెనక సీట్లకు ఉండే సీట్​బెల్ట్​ వాడడం లేదని సర్వే చెప్తోంది. లక్నో, జైపూర్​, కోల్​కతాలో అయితే వెనక సీట్లలో కూర్చునేవాళ్లలో ఒక్కరు కూడా సీట్​బెల్ట్​ పెట్టుకోవడం లేదంటోంది సేవ్​లైఫ్​ ఫౌండేషన్​ సర్వే. 

సేఫ్​ జర్నీకి.. 

ఏటా రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇష్టమైన మనుషుల్ని శాశ్వతంగా దూరం చేయడమే కాదు... ఆర్థికంగా కూడా ఇబ్బందులు తెస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల ప్రభావం జీడీపీ పైన కూడా పడుతోంది. అనుకోకుండా జరిగే ప్రమాదాలను ఎవరూ ఆపలేరు. కానీ, ట్రాఫిక్​ రూల్స్​ పాటించకపోవడం, సరిగాలేని రోడ్లు, ఇష్టారాజ్యంగా బండ్లు నడపడం, చట్టాలపై అవగాహన లేకపోవడం వంటివి మనిషి చేజేతులా చేస్తున్న తప్పులే. ఇలాంటి వాటిని కట్టడి చేయాలంటే 10 సూత్రాలు కచ్చితంగా పాటించాలని చెప్తున్నారు అధికారులు. అవేంటంటే..

  • చిన్నప్పటి నుంచే అందరికీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి. ప్రైమరీ స్కూల్​ లెవెల్​లోనే పాఠాలు చెప్పాలి.  గుడ్​, బ్యాడ్​ డ్రైవింగ్​ గురించి పిల్లలకు అర్థమయ్యేలా రకరకాల మోడల్​ వెహికల్స్​(కార్లు, ట్రక్​లు, బైక్​లు) వంటివాటిని ప్రత్యక్షంగా చూపిస్తూ వివరించాలి. డ్రైవింగ్​ బోర్డ్​ గేమ్​లు ఏర్పాటుచేసి పిల్లలకు ట్రాఫిక్​ రూల్స్​, గుడ్ బిహేవియర్​ నేర్పిస్తే మరీ మంచిది. 
  • పొల్యూషన్​ గురించి, దాన్ని అడ్డుకోవడానికి చేయాల్సిన పనుల గురించి స్కూల్, కాలేజీ​ సిలబస్​లో  చెప్తున్నట్లే ​‘రోడ్డు సేఫ్టీ’ గురించి కూడా పాఠాలు, పరీక్షలు పెట్టాలి. 
  • డ్రైవింగ్​ లైసెన్స్​ కోసం పెట్టే ఎగ్జామ్స్​, ప్రాక్టికల్​ టెస్ట్​లు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం కఠినంగానే ఉన్నా మరింత స్ట్రిక్ట్​ చేయాలి. అంటే.. ట్రాఫిక్​ రూల్స్​ ఫాలో అవుతున్నారా? బండిని సక్రమంగా అదుపు చేస్తున్నారా? ఎమర్జెన్సీ బ్రేక్​ను సక్రమంగా వాడుతున్నారా? రివర్స్​, పార్కింగ్​ బాగా చేస్తున్నారా? అనేవాటిని పూర్తిగా పరిశీలించాలి. వీటిలో వందశాతం ఫర్ఫెక్ట్​గా ఉంటేనే లైసెన్స్​ ఇచ్చేలా రూల్స్‌ మార్చాలి. 
  • మన దేశంలోని చాలా రోడ్లు సరైన ఇంజినీరింగ్​ డిజైన్స్​ లేనివే. హఠాత్తుగా మెలితిరిగిన మలుపులు, అనువుకాని చోట ఉన్న జంక్షన్లు, సడన్​ స్పీడ్​ బ్రేకర్స్​ వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. రోడ్ల మెయింటెనెన్స్​ మరో ప్రధాన సమస్య. చాలా రోడ్ల మీద గుంతలు ఉంటాయి. లైటింగ్, ప్రమాదాల గురించి హెచ్చరించే రిఫ్లెక్టర్స్​, సూచనలు సరిగా లేకపోవడం కూడా కారణమే.  ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రోడ్ల డిజైన్స్​లో లోపాలు లేకుండా చూడాలి. మెయింటెనెన్స్​ బాగుండాలి. మలుపులు, ఎగుడుదిగుడులు.. వంటి వాటి గురించి చెప్పే సైన్​ బోర్డులు అవసరమున్న ప్రతిచోట కచ్చితంగా పెట్టాలి.
  • డ్రగ్స్​ తీసుకొని, మద్యం తాగి నడిపేవాళ్లను శిక్షించడానికి ఇప్పటికే చట్టాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా అమలు కావడం లేదు. ముఖ్యంగా హైవేలపై డ్రంకన్​ డ్రైవ్​ టెస్ట్​లు తక్కువ. దీన్ని అవకాశంగా తీసుకొని ట్రక్​, లారీ డ్రైవర్లు డ్రగ్స్​ తీసుకొని, మందు తాగి డ్రైవింగ్​ చేస్తున్నారని, ఎక్కువ యాక్సిడెంట్స్​కు కారణమవుతున్నారని రిపోర్టులు చెప్తున్నాయి. 
  • ట్రాఫిక్​ రూల్స్​ పాటించనివాళ్లకు, ర్యాష్​ డ్రైవింగ్​ చేసేవాళ్లకు ఎక్కువ పెనాల్టీలు, శిక్షలు వేయాలని మోటారు వాహనాల సవరణ చట్టం చెప్తోంది. కానీ, దీన్ని స్ట్రిక్ట్​గా అమలు చేయడంలో తడబాటు కనిపిస్తోంది. ఆ పొరపాట్లు సరిదిద్దుకోవాలి.
  •  రోడ్డు సేఫ్టీ, గుడ్​ రోడ్​ బిహేవియర్​ను​ ప్రోత్సహించేలా హ్యుండాయ్​ కంపెనీ ‘బి ది బెటర్​ గై’ పేరుతో  క్యాంపెయిన్​ చేస్తోంది. దీనికోసం బాలీవుడ్​ యాక్టర్​ షారుక్​ ఖాన్​తో కొన్ని అడ్వర్టైజ్​మెంట్లు కూడా చేసింది. ఇలాంటి ప్రయత్నాలను, క్యాంపెయిన్లను ప్రభుత్వం కూడా చేయాలి. వాటిని ప్రోత్సహించాలి. 
  • ట్రాఫిక్​ రూల్స్​ పాటించడం ఎంత ముఖ్యమో సీట్​బెల్ట్​​, హెల్మెట్​ కచ్చితంగా పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించేలా చేయాలి. 
  • మన వెహికల్​ ఎలాంటి రూట్లకు అనుకూలమో చెక్​ చేసుకోవాలి. ఎందుకంటే వెహికల్స్​లో ఎక్కువ భాగం వేరే దేశాల్లో తయారైనవే. ఇవి మన మట్టిరోడ్లు, ఘాట్​ల మీద వెళ్లగలవా ? లేదా? అని చూసుకోవాలి. అలాగే ప్రతిరోజు ప్రయాణానికి ముందు వెహికల్​ కెపాసిటీ, టైర్​లు, బ్రేక్​లు, ఇండికేటర్స్​, హెడ్​లైట్స్​, టెయిల్​లైట్స్​ సరిగా ఉన్నాయో లేదో చెక్​ చేసుకోవాలి. 
  • ప్రమాదాల్లో ఎక్కువ మరణాలకు మరో ముఖ్య కారణం సరైన టైంలో ట్రీట్మెంట్​ అందకపోవడం. హైవేల పక్కన ట్రామా కేర్​లు ఉన్నప్పటికీ అవి ఒక్కోసారి యాక్సిడెంట్స్​ జరిగిన ఏరియాకు చాలా దూరంలో ఉంటున్నాయి. అందువల్ల యాక్సిడెంట్స్​ గురించిన సమాచారం అందిన వెంటనే దగ్గరలోని పోలీసులు తగిన ఫస్ట్​ ఎయిడ్​ కిట్​తో వెళ్లాలి. అంతేకాదు, ప్రతి వెహికల్​లోనూ ఫస్ట్​ ఎయిడ్​ కిట్​ ఉండాలి. నిజానికి అన్ని ఫోర్​వీలర్స్​లోనూ ఫస్ట్​ఎయిడ్​ కిట్​ బాక్స్​లు ఉంటున్నప్పటికీ వాటిలో ట్రీట్మెంట్​కు అవసరమైనవి ఉంచడం లేదు. అందువల్ల ఫస్ట్‌ ఎయిడ్‌కు అవసరమైన మందులు, క్లాత్​ వంటివి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

సీట్​బెల్ట్​ చరిత్ర  

సీట్​బెల్ట్​ను కనుక్కున్నది జార్జ్​ కేలీ అనే బ్రిటిష్​ నేవీ ఆఫీసర్​.19వ శతాబ్దంలో పారాచూట్ల లాంటి ఎగిరే గ్లైడర్స్​ ఉండేవి. వాటిలో వెళ్లేవాళ్ల కోసం ఈ సీట్​బెల్ట్​​ తయారుచేశాడు. ఇది కార్లకు సరిపోదు. అయితే, సీట్​బెల్ట్​పై మొదటి పేటెంట్​ మాత్రం ఎడ్వర్డ్​ జె. క్లాగ్​హార్న్​కు దక్కింది. న్యూయార్క్​ టౌన్​లో తిరిగే ప్రయాణికులకు తన ట్యాక్సీనే ఆప్షన్​గా ఉండాలనే ఉద్దేశంతో ఆయన సీట్​బెల్ట్​ తయారుచేసినట్లు చెప్తారు.​ సీట్​కు అటుఇటు ఉన్న రెండు పాయింట్స్​లో బెల్ట్ ఫిక్స్​ చేసి, నడుము చుట్టుకొని ఉండేది. ఆ తర్వాత నెమ్మదిగా సీట్​బెల్ట్​ డిజైన్​లో మార్పులొచ్చాయి. 20వ శతాబ్దం మొదటి భాగంలో సీట్​బెల్ట్​ వాడకం తక్కువ. ఆ తర్వాత 1950 నాటికి అన్ని రకాల రేసింగ్​ కార్లలోనూ​ సీట్​బెల్ట్​ పెట్టడం మొదలైంది. మరి కొన్నేండ్లకు అమెరికాకు చెందిన నాష్​, ఫోర్డ్​ కంపెనీలు సాధారణ కార్లకు సెట్​ అయ్యే సీట్​బెల్ట్​ను విడిగా అమ్మడం మొదలుపెట్టాయి. అయితే, అప్పట్లో వీటిని కొనడానికి కస్టమర్స్​ ఇష్టపడలేదు. ఆ తర్వాత స్వీడన్​కు చెందిన ‘సాబ్​’ కార్ల తయారీ కంపెనీ సీట్​బెల్ట్​ను స్టాండర్డ్​గా కార్లలో అమర్చడం మొదలుపెట్టింది.1955లో ఇద్దరు అమెరికన్లు రోజర్​ గ్రిస్వాల్డ్​, హ్యూ డెహవెన్​ మొదటిసారి త్రీ పాయింట్​ సీట్​బెల్ట్​ను కనుక్కున్నారు. ఈ డిజైన్​ను స్వీడన్​కు చెందిన నీల్స్​ బొలిన్​ కొద్దిగా మార్చాడు. ఇదే, ఇప్పుడు చాలా కార్లలో ఉంటున్న త్రీ పాయింట్​ సీట్​బెల్ట్​. దీన్ని కనుక్కున్న నీల్స్​ బొలిన్​ను వోల్వో కంపెనీ చీఫ్​ సేఫ్టీ మేనేజర్​గా చేర్చుకుంది. ఈ సీట్​బెల్ట్​కు వోల్వో కంపెనీ పేటెంట్ కూడా తీసుకుంది. కానీ, ఆ తర్వాత వద్దనుకుంది. ప్రాణాలు కాపాడే సీట్​బెల్ట్​ను అన్ని ఆటోమొబైల్​ కంపెనీలూ వాడేలా నిర్ణయం తీసుకుంది. 1970లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం సీట్​బెల్ట్​ను తప్పనిసరి చేసింది. మనదేశంలో సీట్​బెల్ట్​ను కంపల్సరీ చేసింది1994లో. అప్పుడు కూడా కేవలం ముందు సీట్లోని వాళ్లకు మాత్రమే ఈ చట్టం ఉండేది.  ఆ తర్వాత వెనకసీట్లో వాళ్లు కూడా సీట్​బెల్ట్​ పెట్టుకోవాలనే రూల్​ను చట్టానికి కలిపింది. 

అలారం బ్లాకర్స్​ వద్దు

‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అని సామెత. చట్టాన్ని పాటించడం సంగతి అటుంచితే చట్టం నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు ఏమున్నాయా? అని ఆలోచించేవాళ్లే ఎక్కువ ఇప్పుడు. సీట్​బెల్ట్​ విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. సీట్​బెల్ట్​ పెట్టుకోకపోతే హెచ్చరిస్తూ సౌండ్​ చేసే సిస్టమ్​ ప్రతి కారులో ఉంటుంది. కానీ, ఆ అలారం మోగకుండా చేసే టెక్నాలజీ ఉన్న ప్రొడక్ట్స్​​ కూడా మార్కెట్​లోకి వచ్చాయి. వీటిని ‘సీట్​బెల్ట్​ అలారం బ్లాకర్స్​’ అంటారు. ఇవి పబ్లిక్​ మార్కెట్​లో దొరకవు. కానీ, ‘అమెజాన్’​ లాంటి ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్స్​లో దొరుకుతున్నాయి. చాలామంది వీటిని తెచ్చుకుని కార్లలో సెట్​ చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల కారులో ఉన్నవాళ్లు సీట్ బెల్ట్​ పెట్టుకోకపోయినా అలారం మోగడం లేదు. అందుకే, ‘సీట్​బెల్ట్​ అలారం బ్లాకర్స్​’ను అమ్మొద్దంటూ ‘అమెజాన్​’కు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ లేఖ రాశారు. ఆ వెంటనే ‘అమెజాన్​’ వీటిని ఇండియన్​ మార్కెట్​లో అమ్మడం ఆపేసింది. 

సూపర్​ బైక్స్​ 

సూపర్​ బైక్స్​ లేదా స్పోర్ట్స్​ బైక్స్​ గంటకు 250 నుంచి 400 కిలోమీటర్ల స్పీడ్​తో వెళ్లగలవు. వీటిని నడపాలంటే ప్రత్యేకమైన డ్రైవింగ్​ స్కిల్స్​ నేర్చుకోవాలి. రోడ్లు అనువుగా ఉండాలి. అందుకే ఇవి ఎక్కువగా యూరప్​, అమెరికా, జపాన్, దక్షిణకొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. కానీ, ఈ మధ్యకాలంలో మనదేశంలోకి కూడా వచ్చాయి. వీటి మీద ఉన్న​ క్రేజ్ వల్ల యూత్​ ఎక్కువగా కొంటున్నారు. కానీ, మన దగ్గర రోడ్లు సరిగా లేకపోవడం, సూపర్​బైక్స్​ నడపాలంటే​ అవసరమైన డ్రైవింగ్​ స్కిల్స్​ నేర్చుకోకపోవడం ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. క్రికెటర్​ అజహరుద్దీన్​, సినీనటులు కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ కుమారులు ఇలాంటి స్పోర్ట్స్​ బైక్స్​ వల్ల జరిగిన ప్రమాదాల్లోనే మరణించారు. 

పిల్లల డ్రైవింగ్​ 

మనదేశంలో డ్రైవింగ్ లైసెన్స్​ తీసుకోవాలంటే కనీసం16 ఏండ్ల వయసు ఉండాలి. అయితే, ఈ లైసెన్స్​​ వల్ల కేవలం 50 సీసీ టూ వీలర్స్ మాత్రమే నడపాలి. 50 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న టూ వీలర్స్​ నడపాలంటే మాత్రం18 ఏండ్లు ఉండాల్సిందే. కానీ, డ్రైవింగ్​ లైసెన్స్​ లేకున్నా బైక్​లు నడిపే పిల్లలు ప్రతిచోట కనిపిస్తారు. డ్రైవింగ్ సరిగా రాకపోవడం, యాక్సిడెంట్స్ వల్ల వచ్చే సమస్యల్ని తెలుసుకోగలిగే మెచ్యూరిటీ లేకపోవడంతో వీళ్లు ఇష్టారాజ్యంగా బైక్​లు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. అలుగుతున్నారనో, అవసరమనో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు బైక్​లు ఇస్తున్నారు. కొందరైతే ఏకంగా కార్లు, జీప్​లు, ఎస్​వీయూలు వంటి ఫోర్​వీలర్స్​ను కూడా పిల్లలకు ఇచ్చి ప్రమాదాలకు పరోక్షంగా కారణమవుతున్నారు. -మహేశ్వర్​