35 పైసల షేర్‌‌ రూ.143 కు.. రూ.లక్ష షేర్‌‌ 4 కోట్లకు!

35 పైసల షేర్‌‌ రూ.143 కు.. రూ.లక్ష షేర్‌‌ 4 కోట్లకు!
  • ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే లాభాలు తెచ్చిన ఫ్లోమిక్ గ్లోబల్‌‌‌‌
  • టిప్స్‌‌‌‌కు దూరంగా ఉండాలంటున్న జెరోధా

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: గత ఏడాది కాలంలో కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను తెచ్చిపెట్టాయి. మిడ్‌‌‌‌క్యాప్‌‌‌‌, స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌‌‌‌లోని క్వాలిటీ షేర్లు భారీగా పెరగడాన్ని చూశాం. అలానే కొన్ని పెన్నీ షేర్లు కూడా ఇన్వెస్టర్లను నిరాశ పరచలేదు. ఆ కోవకు చెందిందే ఫ్లోమిక్ గ్లోబల్‌‌‌‌ లాజిస్టిక్స్‌‌‌‌. 2019 మార్చిలో కేవలం  35 పైసలు దగ్గర ట్రేడయిన ఈ షేరు, శుక్రవారం నాటికి రూ. 143 వద్ద క్లోజయ్యింది. ఒకానొక టైమ్‌‌‌‌లో రూ. 216 వరకు పెరిగి ఆల్‌‌‌‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది కూడా. ఈ రెండున్నరేళ్లలో ఏకంగా 40 వేల శాతం పెరిగింది. ఫ్లోమిక్ గ్లోబల్‌‌‌‌లో 2019 లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ వాల్యు శుక్రవారం నాటికి రూ. నాలుగు కోట్లకు చేరేదన్న మాట. ఈ కంపెనీ షేరులో గత ఆరు నెలల కింద ఇన్వెస్ట్ చేసినా భారీ లాభాలు వచ్చేవి.  ఆరు నెలల కిందట ఫ్లోమిక్ గ్లోబల్ షేరు విలువ రూ. 7.62 దగ్గరే ట్రేడయ్యింది. ఈ ఆరు నెలల్లో కంపెనీ షేరు 1,780 శాతం పెరిగింది. అదే ఏడాది కిందట అయితే కంపెనీ షేరు రూ 1.95 దగ్గర ట్రేడయ్యింది. ఈ లెవెల్‌‌‌‌ దగ్గర రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ప్రస్తుతం ఆ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ విలువ రూ. 1.17 కోట్లకు పెరిగేది. కాగా, పెన్నీ షేర్లలో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. అందుకే పెద్ద ఇన్వెస్టర్లు ఈ షేర్ల రేట్లను తమకు నచ్చినట్టు పెంచగలుగుతారు. తగ్గించగలుగుతారు.   పెన్నీ షేర్లన్నీ    ఇలానే పెరుగుతాయని గ్యారెంటీ లేదు.  ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా రీసెర్చ్ చేసి నిర్ణయం తీసుకోవాలి.

యూట్యూబ్ వీడియోలు చూసి కొనొద్దు..

గత రెండున్నరేళ్ల నుంచి ఇండియా స్టాక్ మార్కెట్లు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కొత్త ఇన్వెస్టర్లు ఈజీగా డబ్బులు సంపాదించగలుగుతున్నారు. చాలా మంది చిన్న ఇన్వెస్టర్లు సోషల్ మీడియాలోని టిప్స్‌‌‌‌ను చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూట్యూబ్‌‌‌‌లోని వీడియోలు, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌, టెలిగ్రామ్, ట్విటర్, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లలోని టిప్స్‌‌‌‌ చూసి తమ డబ్బులను మార్కెట్‌‌‌‌లో పెడుతున్నారు. దేశంలో అతిపెద్ద బ్రోకరేజి  జెరోధా ఇలాంటి ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ‘ఇది ఎవరికి అవసరమో తెలియదు.. స్క్రూ ఇట్‌.. అందరూ వినాల్సిందే. ఊరుపేరు లేని స్టాక్ టిప్స్‌‌‌‌, రీల్స్‌‌‌‌, యూట్యూబ్‌‌‌‌ ఛానెల్స్‌‌‌‌ వంటి వాటిపై ఆధారపడి ట్రేడ్  లేదా ఇన్వెస్ట్ చేయొద్దు. దయచేసి వద్దు’ అని ఈ బ్రోకరేజి ట్విటర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఈ ట్వీట్‌‌‌‌కు చాలా మంది యూజర్లు  థ్యాంక్స్ చెబుతున్నారు కూడా.