రూ.2 వేల కోట్ల స్కీం ముచ్చట్నే లేదు!

రూ.2 వేల కోట్ల స్కీం ముచ్చట్నే లేదు!


హైదరాబాద్, వెలుగు:సర్కారు స్కూళ్ల డెవలప్​మెంట్ కోసం వచ్చే ఏడాది అమలు చేయనున్న రూ.2 వేల కోట్ల స్కీమ్​పై నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా విపత్తు నేపథ్యంలో నిధుల లేమితో సర్కారు సతమతమవుతోంది. దీంతో ఈ పథకం అమలుపై సర్కారు పెద్దగా దృష్టి సారించడం లేదు. స్కీమ్ అమలు, నిధుల ఖర్చుపై వేసిన మంత్రుల కమిటీ రెండు సార్లు సమావేశం కాగా, ఉగాది టైమ్ లో మరోసారి భేటీ కావాల్సి ఉంది. కానీ నెల దాటినా మీటింగ్ జరగలేదు. అయితే కరోనా తీవ్రత పెరగడంతో మీటింగ్ నిర్వహించడం లేదని అధికారులు చెప్తున్నారు.

26 వేలకు పైగా స్కూళ్లలో సమస్యలు..

రాష్ట్రంలో 2021–22 బడ్జెట్ ఇయర్​లో రూ.2 వేల కోట్లతో సర్కారు బడులను అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ స్కీమ్ అమలు కోసం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీ రామారావు, హరీశ్​రావు, ఎర్రబెల్లి దయాకర్​రావుతో కేబినెట్ సబ్​కమిటీనీ వేశారు. ఈ కమిటీ ప్రైమరీ లెవెల్​లో రెండు సమావేశాలు జరిగాయి. ఏయే స్కూళ్లో ఏం అవసరాలున్నాయనే వివరాలు సేకరించి, రిపోర్టు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కమిటీ ఆదేశించింది. దీంతో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 26 వేలకు పైగా స్కూళ్లలోని సమస్యలపై జిల్లాల నుంచి సమాచారం సేకరించారు. దీనికి అనుగుణంగా రిపోర్టు తయారు చేసి, సర్కారుకు ఇచ్చినట్టు సమాచారం. మరోపక్క ఏపీలోని సర్కారు స్కూళ్లలో జరుగుతున్న నాడు–నేడు పథకం అమలునూ తెలంగాణ విద్యాశాఖ అధికారులు పరిశీలించి వచ్చారు. దీనిపైనా సమగ్ర రిపోర్టు అంతకుముందే సబ్ కమిటీకి అందించారు. అయితే గత నెల రెండో వారంలో వీటన్నింటిపై రివ్యూ నిర్వహించి, గైడ్ లైన్స్ జారీ చేయాలని భావించారు. కానీ ఇప్పటికీ మీటింగ్ నిర్వహించలేదు. స్టేట్​లోని ప్రతి మండలాన్ని ఒక యూనిట్ తీసుకుని, వాటిలో కొన్ని స్కూళ్లను ఫస్ట్ విడతలో బాగు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది. తర్వాతి విడతల్లో మిగిలిన స్కూళ్లలోని సమస్యలను పరిష్కరించాలని యోచిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో సర్కారు వద్ద నిధుల కొరత ఏర్పడింది. దీంతో సర్కారు ఈ పథకం అమలు చేస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి.

స్కీమ్​ అమలు చేయ్యాలె: స్టూడెంట్​ యూనియన్లు 

ఇక ఈ స్కీమ్​పేరును కూడా సర్కార్ ఇప్పటికీ ప్రకటించలేదు. వచ్చే ఏడాది కూడా నాలుగైదు నెలల పాటు ఆన్​లైన్ పాఠాలే కొనసాగే అవకాశముండటంతో, ఈ స్కీమ్​ను అమలు చేయడంపై సందిగ్ధం నెలకొంది. అయితే టీచర్ యూనియన్లు, స్టూడెంట్ యూనియన్లు మాత్రం అసెంబ్లీలో ప్రకటించినట్టు 2021–22 అకడమిక్ ఇయర్​లోనే ఈ స్కీమ్​ అమలు చేసి, సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాయి.