SRH vs LSG: కట్టడిచేసిన సన్‌రైజర్స్‌ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం

SRH vs LSG: కట్టడిచేసిన సన్‌రైజర్స్‌ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం

ఉప్పల్‌ వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. భారీ స్కోర్లకు వేదికైన ఉప్పల్ గడ్డపై లక్నో బ్యాటర్లను సాధారణ స్కోరుకే పరిమితం చేశారు. రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ తన 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నోను భువనేశ్వర్ దెబ్బతీశాడు. వరుస ఓవర్లలో క్వింటన్ డికాక్ (2), స్టోయినిస్ (3)లను ఔట్ చేసి కష్టాల్లోకి నెట్టాడు. భువీ ధాటికి లక్నో పవర్ ప్లేలో 27 పరుగులకే పరిమితమైంది. ఆపై తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న విజయకాంత్ వియస్కాంత్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో లక్నో వేగంగా పరుగులు చేయలేకపోయింది. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో కేఎల్ రాహుల్ (29).. కమిన్స్ ఓవర్‌లో వెనుదిరిగాడు. దీంతో సూపర్ జెయింట్స్ 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

ఆ సమయంలో కృనాల్ పాండ్య(24) కాసేపు మెరుపులు మెరిపించాడు. జయ్‌దేవ్ ఉనద్కత్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది.. ఈ సీజన్‌లో 1000 సిక్స్‌లు పూర్తి చేశాడు. ఎదురుదాడికి దిగిన పాండ్యాను.. కమిన్స్‌ రనౌట్ రూపంలో పెవిలియన్ చేర్చాడు. అనంతరం నికోలస్ పూరన్ (26 బంతుల్లో 48 నాటౌట్), ఆయుష్ బదోని(30 బంతుల్లో 55 నాటౌట్) జోడి మరో వికెట్ చేజారకుండా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ముగించారు. వీరిద్దరూ చివరి 52 బంతుల్లో 99 పరుగులు జోడించారు.  

హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 50, కమిన్స్ 47 పరుగులు సమర్పించుకున్నారు.