- ఎస్‌ఐబీ అదుపులో అగ్రనేతల భద్రతా సిబ్బంది, గెరిల్లా ఆర్మీ
- రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మావోయిస్టుల అధ్యాయం భారీ లొంగుబాట్లతో ముగియనుంది. ఒకరో, ఇద్దరో కాదు.. ఒకేరోజు ఏకంగా 150 మంది మావోయిస్టుల లొంగుబాటుకు రంగం సిద్ధమైంది. అగ్రనేతల గెరిల్లా ఆర్మీ క్యాడర్ సహా తెలంగాణ, చత్తీస్‌గఢ్‌కు రాష్ట్ర కమిటీలకు చెందిన మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నారు. ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నర్సింహా రెడ్డి అలియాస్ గంగన్న తదితరులు రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. వీరితోపాటు అప్పుడే మరికొంత మందిని ఎస్‌ఐబీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో అగ్రనేతల భద్రతా సిబ్బందిగా వ్యవహరించిన కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ క్యాడర్‌తో పాటు ఇటీవల ఆసిఫాబాద్ అడవుల్లో అదుపులోకి తీసుకున్న 30 మందికి పైగా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం.
ఈ లొంగుబాట్లతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా రికార్డుల్లోకి ఎక్కుతుందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ 150 మందిలో మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఉంటారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది. దండకారణ్యంలో ఆపరేషన్కగార్ తర్వాత 2024 ఆగస్టు తర్వాత ఆయన ఆచూకీ లభించడం లేదు. వృద్ధాప్య సమస్యలు, ముఖ్యంగా అల్జీమర్స్‌తో బాధపడ్తున్న ఆయనను చికిత్స కోసం నేపాల్ తరలించారనే అనుమానాలున్నాయి.
ఆయనను బిహార్ బోర్డర్వరకు తరలించినట్లు చత్తీస్‌గఢ్ లో లొంగిపోయిన ఆశన్న చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో పూర్తిగా మంచానికే పరిమితమైన స్థితిలో ఉన్న గణపతిని నేపాల్‌లో రాష్ట్రపోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారనే వార్తలు వచ్చాయి. ఇటీవల సీఎం, డీజీపీ ఢిల్లీ టూర్లో అమిత్‌షా ముందు గణపతిని ప్రవేశపెడ్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ వీటిని పోలీసులు నిర్ధారించడం లేదు. దీంతో గణపతి లొంగుబాటు అంశం మాత్రం ప్రస్తుతానికి మిస్టరీగా మారింది.
