- అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన
- 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని వెల్లడి
- అతి వాడకంతో అభ్యసనా సామర్థ్యం దెబ్బతింటున్నదని ఆందోళన
- 16 ఏండ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను
- బ్యాన్ చేసిన కర్నాటక సర్కారు
- ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
హైదరాబాద్, వెలుగు: పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఏపీ, కర్నాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 16 ఏండ్లలోపువారికి సిద్ధరామయ్య సర్కారు సోషల్ మీడియాను బ్యాన్ చేయగా.. రాష్ట్రంలో 13 ఏండ్లలోపు వారు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా నిషేధం విధించే ఆలోచన చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీ శాసనసభలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘13 ఏండ్ల లోపు వారికి సంబంధించి సోషల్ మీడియా ను బ్యాన్ చేస్తే బాగుంటుందని సూచన వచ్చింది. ఆ వయసు లోపు వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతాం. 13–-16 ఏండ్లలోపు వారికి సంబంధించి ఏం చేయాలన్నదానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోకూడదు. దానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది” అని చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని, బానిసైతే జీవితాలు నాశనమవుతాయన్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి.. నిపుణుల అభిప్రాయాలు తీసుకొని ఏ వయస్సు వరకు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలనే అంశంపై చర్చించిన తరువాత స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు.
సోషల్ మీడియా బ్యాన్ అంశంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పటికే పార్లమెంటులో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. చిన్న పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టడానికి జాతీయస్థాయిలో చట్టం రావాలని ఆయన ఆకాంక్షించారు.
కర్నాటక సర్కారు సంచలన నిర్ణయం..
పదహారేండ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలని కర్నాటక సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నది. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. మొబైల్, సోషల్ మీడియా వాడకంతో పిల్లలపై పడుతున్న చెడు ప్రభావాలను ఆయన ప్రస్తావించారు.
ప్రస్తుత కాలంలో పెరుగుతున్న మొబైల్ వినియోగం, పిల్లలపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యమని సిద్ధరామయ్య తెలిపారు. ‘‘ఫోన్ వాడకం పెరుగుతున్నందున కలిగే హానికర ప్రభావాలను నివారించడానికే 16 ఏండ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మన దేశంలో పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన తొలి రాష్ట్రంగా కర్నాటక రికార్డుకెక్కనుంది.
ఇప్పటికే ఆస్ట్రేలియాలో అమల్లోకి
ప్రపంచవ్యాప్తంగా పిల్లల మానసిక ఆరోగ్యం, నిద్ర, భద్రతపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించాలని పలు దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఆస్ట్రేలియాలో అయితే 16 ఏండ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ ఇప్పటికే అమల్లోకి వచ్చింది. బ్రిటన్‌లో సోషల్ మీడియాతోపాటు గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో ఎలాంటి నిబంధనలు పెట్టాలనేదానిపై తల్లిదండ్రులు, పిల్లల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. యూరప్‌లోని కొన్ని దేశాలు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి.
నిషేధం వెనుక ఉన్న ప్రధాన కారణాలివే..
- చిన్న వయస్సులో సోషల్ మీడియాకు అలవా టు పడటం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, డిప్రెషన్‌లాంటి సమస్యలు వస్తున్నాయి.
- మొబైల్ ఫోన్లలో గంటల తరబడి గడపడం వల్ల విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు.
- వడపోతలేని సోషల్ మీడియాలో పిల్లలు హానికరమైన, హింసాత్మకమైన కంటెంట్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
- తెలియని వ్యక్తులతో పరిచయాలు, సైబర్ బుల్లింగ్‌లాంటి పిల్లల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి.
- పిల్లల్లో మొబైల్ వ్యసనాన్ని అరికట్టడం ద్వారా వారిని తిరిగి ఆటపాటలు, పుస్తక పఠనం వైపు మళ్లించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నది. త్వరలోనే దీనిపై విద్యావేత్తలు, మానసిక నిపుణులతో చర్చించి అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.
