నితీశ్ బాట‌‌లో బాబు!? లోకేశ్కు ముఖ్యమంత్రి పీఠం.. ఒక్క పవన్ కల్యాణ్ ఆమోదమే తేలాల్సి ఉంది !

నితీశ్ బాట‌‌లో బాబు!? లోకేశ్కు ముఖ్యమంత్రి పీఠం.. ఒక్క పవన్ కల్యాణ్ ఆమోదమే తేలాల్సి ఉంది !

బిహార్ సీఎం నితీశ్‌‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు  నడవనున్నారా? ఏపీలో తనయుడు లోకేశ్‌‌కు పట్టంగట్టి  రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో పలు రాష్ట్రాల్లోనూ రాజకీయ ముఖచిత్రాల మార్పు, పునరేకీకరణలు, వారసత్వ స్థిరీకరణలు కళ్లకు కడుతున్నాయి.

ఉష్ణ మండల దేశం భారత్‌‌లో ‘సన్ స్ట్రోక్’లాగే  దేశ రాజకీయాల్లో ‘సన్’  స్ట్రోక్‌‌లు కూడా ఎక్కువే! వయసు రీత్యా  గౌరవప్రద రాజకీయ ముగింపు కోరుకుంటున్న ఇద్దరు నేతలు, తమ కుమారులకు రాష్ట్రాల్లో పట్టంగట్టి  తాము రాజ్యసభకు వెళ్లే వ్యూహంతో ఉన్నట్టుంది.

పైగా, ఎన్డీఏ రాజకీయాల్లో తమ మాట చెల్లుబాటుకు ఇదే అదునుగా వారు భావిస్తుండవచ్చు.  కేంద్రంలో  దృఢమైన ప్రభుత్వం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తమ మద్దతు మీద ఆధారపడుతున్న ప్రస్తుత సమయాన్ని మించిన మంచి తరుణం వేరొకటి ఉండదు. దృక్పథాల్లో  వైరుధ్యాలున్నా  పలు విషయాల్లో  నితీశ్‌‌కుమార్‌‌కు, చంద్రబాబుకు  దగ్గరి  పోలికలున్నాయి. ఇద్దరికీ రాజకీయ సిద్దాంత నిబద్ధత,  స్థిరత్వం లేదు.  అటు నుంచి ఇటు,  ఇటు నుంచి అటు దూకే  ‘యూ’టర్న్‌‌లు వారిద్దరికీ అలవాటే!

ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యసభకు నామినేషన్ వేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌‌కుమార్ (జేడీయూ) ఎత్తుగడను 24 గంటల ముందువరకు మీడియా ఊహించలేకపోయింది. పార్టీ వర్గాల నుంచి లీక్ వచ్చిన తర్వాతే, నామినేషన్ల రోజున మీడియా కథనాలు వచ్చాయి. అనుకున్నట్టుగానే  రాజ్యసభ స్థానానికి గురువారం నామినేషన్ వేసిన నితీశ్‌‌కుమార్.. తన కుమారుడు నిశాంత్‌‌ను ఈ నెల 18 తర్వాత  బిహార్​కు ఉప ముఖ్యమంత్రి చేస్తారని సమాచారం. నితీశ్ రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి పదవి బీజేపీకి, ఉప ముఖ్యమంత్రి పదవి జేడీయూకి ఇవ్వాలనేది ఆంతరంగిక అంగీకారంగా తెలుస్తోంది.

దేశ రాజకీయాల్లో ఇదొక ఎన్నదగిన కీలక పరిణామమే! ఇదేబాటలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజ్యసభకు వెళ్లిపోతూ తన కుమారుడు, ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడయిన నారా లోకేశ్​ను ముఖ్యమంత్రిని చేస్తారా?  ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (జనసేన) అంగీకరించకుంటే, బిహార్‌‌లో లాగానే  నారా లోకేశ్‌‌ను  ముందు ఉప ముఖ్యమంత్రిని చేసి, పవన్ కల్యాణ్‌‌ను  కొంతకాలంపాటు ముఖ్యమంత్రి  ని చేస్తారా?  ఇదీ ఇప్పుడు తెలుగు రాజకీయ వర్గాల్లో సాగుతున్న రాజకీయ చర్చ.

లోకేశ్కు ముఖ్యమంత్రి పీఠం
ఇటు చంద్రబాబు, అటు నితీశ్ ఇద్దరి రాజకీయ పంథా,  అనుసరించే  వైఖరి, ఇప్పుడున్న పరిస్థితుల్లోని సామ్యం దృ ష్ట్యా బాబు కూడా నితీశ్ బాటలో నడవవచ్చనే ప్రచారం జోరందుకుంది. ఏపీలో చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రిగా ఉన్నారు తప్ప చాలా కీలక నిర్ణయాలు, విధానాలు, పరిణామాలు లోకేశ్ ద్వారానే  జరుగుతున్నట్టు తెలుగుదేశం పార్టీ లోపల, బయట ప్రచారం సాగుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో  కీలక నియామకాలు, బదిలీలు లోకేశ్  ద్వారానే  జరుగుతున్నాయి. 

వచ్చే ఎన్నికల వరకు ఆగకుండా, తగినంత ముందుగానే లోకేశ్‌‌ను  ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తార‌‌ని అధికారానికి సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో రాజ్యసభ దైవార్షిక  ఎన్నికలు వచ్చే ఏప్రిల్‌‌లో  జరగాల్సి ఉంది. నాలుగు ఖాళీలు ఏర్పడతాయి. నాలుగూ  తెలుగుదేశం నేతృత్వంలోని కూటమికే  దక్కే అవకాశాలున్నాయి.

ఇద్దరికీ పోలికలే ఎక్కువ!
రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్​లతో  ప్రభావితుడినయ్యానని చెప్పుకునే కుర్మి నాయకుడు నితీశ్‌‌కుమార్‌‌కు సామ్యవాదిగా, బడుగు -బలహీనవర్గాల నాయకుడిగా పేరుండేది. కానీ, ఆయన  తరచూ రాజకీయ వైఖరి మార్చి బీజేపీకి వ్యతిరేకంగా కొన్నిసార్లు, అనుకూలంగా మరికొన్నిసార్లు రాజకీయాలు నెరపుతారు. రాజకీయ సిద్ధాంత నిబద్ధత జీరో అని, ‘ఏ శిబిరంలో ఉన్నా సరే  నిరంతరం ముఖ్యమంత్రిగా ఉండటమే ఆయన లక్ష్యం’ అని నితీశ్‌‌ను విమర్శించేవరకు పరిస్థితి వెళ్లింది. అంత తేలిక‌‌గా ఎవరినీ నమ్మరు. నమ్మి సహకరించిన నాయకులను, పార్టీలను కూడా ఇట్టే వదిలేసి ప్రత్యర్థి శిబిరాలకు తేలికగా వెళ్లగలరని పేరొచ్చింది.

బీజేపీతో కలిసి బిహార్‌‌లో ఆయన సీఎంగా కూటమి సర్కారు నడుపుతున్నపుడు బీజేపీ జాతీయ సమావేశాలు రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగాయి. బీజేపీ అగ్రనేతలకు  కూటమి  ముఖ్యమంత్రి విందు ఇచ్చేలా ఒక నిర్ణయం జరిగింది. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి  మోదీ ఆ విందులో పాల్గొన‌‌కూడదని, రాష్ట్రంలో ఆయన ప్రచారమే చేయొద్దని ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ (బీజేపీ) ద్వారా నితీశ్ తన షరతు తెలియజేశారు. అందుకు బీజేపీ జాతీయ నాయకత్వం అంగీకరించకపోవడంతో ఆ షరతు వర్తించలేదు.

నితీశ్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినపుడు ఆయనతో ఉన్నవారెవరూ ఇప్పుడు అతనితో లేరు. కొంచెం అటుఇటుగా అటువంటిదే చంద్రబాబు చరిత్ర.  ప్రజాతీర్పు పొందిన ఎన్టీ రామారావును దింపి, 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినపుడు ఆయనకు దన్నుగా ఉన్న ముఖ్యనేతలెవరూ ఇప్పుడాయనతో లేరు.  కొందరు స్వయంగా దూరమయితే మరికొందర్ని ఆయనే దూరం పెట్టారు. 1999, 2014, 2024 మూడు ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు, సహకారంతోనే  చంద్రబాబు గెలిచారు. 

మసీదులు కూల్చే పార్టీ అని, జీవితంలో బీజేపీతో పొత్తుపెట్టుకోనని పొసగనపుడు ప్రతిజ్ఞలు చేశారు. 2019 ఎన్నికలప్పుడు మోదీని విబేధించి, అనరాని మాటలన్నీ తిట్టిపోశారు. 2024 ఎన్నికలప్పుడు  మళ్లీ  బీజేపీతో జట్టుకట్టి మోదీ వంటి నాయకుడు ప్రపంచంలోనే లేరని బాబు పొగిడారు. ఇద్దరూ, ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్ సహకారం పొందినవారే! ‘సుశాసన్ బాబు’ అని నితీశ్ పిలిపించుకుంటే, ‘సీఈవో’ అనిపించుకోవడం బాబుకు ఇష్టం. ఇలా నితీశ్‌‌కు,  బాబుకు పోలికలెక్కువ!

‘సైకో పోవాలి, సైకిల్ రావాలి’ 
2024 ఏపీ ఎన్నికల్లోనూ ‘బాబుకు పట్టం కట్టండి’ అని కాకుండా ‘సైకో పోవాలి, సైకిల్ రావాలి’ అన్న నినాదమే జనంలో క్లిక్ అయింది.  జగన్ చేత ఒకసారి, ఆయన తండ్రి  వైఎస్సార్  చేతిలో రెండుసార్లు ఎదురైన ఓటమి దృష్ట్యా... మరో ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో ? ప్రతికూలంగా ఉంటే ఎదుర్కోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు.

2029 ఎన్నికల నాటికి ఆయన వయసు రీత్యా- ఆరోగ్యం ఎంత సహకరిస్తుందో తెలియదు. నేరుగా లోకేశ్ పేరిట ఎన్నికలకు వెళితే,  లభించే  జనాశీర్వాదంపై  అంతగా  నమ్మకం లేదు.  ప్రస్తుతమున్న సంఖ్యాబలంతో  ఇప్పుడయితేనే అధికార మార్పిడి సముచితమని బాబు భావిస్తుండవచ్చు.

లోకేశ్‌‌ను సీఎం చేయడంపై ఒక్క పవన్ కల్యాణ్ ఆమోదమే  తేలాల్సి ఉంది. ఆయనను కూడా తనతోపాటు  రాజ్యసభకు తీసుకుపోయి, లోకేశ్ కు దారి సుగమం చేయడమా?  బిహార్‌‌లో లాగానే ప్రస్తుతానికి పవన్ కల్యాణ్​ను ముఖ్యమంత్రిని చేసి, లోకేశ్‌‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయడమా? అన్న మీమాంస కూడా ఉండొచ్చు! కూటమిలో ఒక ఆంతరంగిక అంగీకారం ముందే కుదిరితే,  బాబు నేతృత్వంలోనే  తదుపరి  ఎన్నికలకు వెళ్లి,  2029  తర్వాత  అవకాశం ఉంటే  లోకేశ్‌‌ను  అప్పుడు ముఖ్యమంత్రిని చేయడం అనే పంథా  అనుసరించవచ్చు!

ఇంతకీ మోదీ మనసేమిటో?
నితీశ్, చంద్రబాబు ఆలోచనల్ని, రాజకీయంగా వారు పావులు కదపడాన్ని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎలా చూస్తారన్నది  ప్రాధాన్యతాంశమే!  వారసత్వ రాజకీయాలు తనకు నచ్చకపోయినా,  ఇప్పుడున్న సంఖ్యా-సమీకరణాల్లో నేరుగా వారిని కాదని  మనసు నొప్పించే  సాహసం  చేయకపోవచ్చు.  ఆయా రాష్ట్రాల్లో వారికున్న బలం, బీజేపీ బలంగా లేనిచోట  కాంగ్రెస్‌‌ను నిలువరించాల్సిన అవసరం దృష్ట్యా ఆయన మిన్నకుండవచ్చు. ఇంకో రకంగా  ఈ  పరిణామాలు ప్రధానికి కలిసివచ్చేవే! 

రేపటి పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత  తృణమూల్ అధినేత్రి  మమతా బెనర్జీ  పరిస్థితి ఎలా ఉంటుందో? ఏ కారణం చేతయినా ఆమె విపక్ష కేంద్రకంగా ఎదిగి, ఢిల్లీ రాజకీయాల్లోకి వస్తే  నితీశ్,  బాబు వంటి వారు తనకు ఢిల్లీ స్థాయిలో సహాయకారులుగా ఉండటం ఒక రాజకీయ అవసరమే!  వారి ఢిల్లీ  క్రియాశీలతతో బీజేపీకి ఒరిగే  ప్రత్యక్ష నష్టమేమీ ఉండదు కనుక ఈ పరిణామాలను ఆయన  ఉపేక్షించవచ్చు.  ‘నితీశ్‌‌కు  లభించిన ఢిల్లీ క్లియరెన్స్ తనకు మాత్రం లభించకుండా ఉంటుందా?’ అనే  చంద్రబాబు ధీమా 

అసమంజసం కాకపోవచ్చు! బాబుకిది తప్పని సంకటం
చంద్రబాబు తన తనయుడు లోకేశ్‌‌కు రాజకీయ వారసత్వం అప్పగించడానికి ఇదే అదునైన సమయంగా భావిస్తున్నారు. తనకా వయసు పైబడింది,  గౌరవప్రదంగా తప్పుకోవడానికిదే  తగిన  సమయమనే భావన ఆయనను అభిమానించేవారిలోనూ వ్యక్తమౌతోంది. ‘ఇంకెంత కాలం...?  ఇప్పటికే  చాలా నిర్ణయాలు,  నియామకాలు  లోకేశ్ బాబే  చూస్తున్నారు.

ముఖ్యమంత్రిగా బాబు ఇప్పుడొక  ముసుగు మాత్రమే!’ అని, బాబుతో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్ నాయకుడొకరు ప్రయివేటు సంభాషణల్లో చేసిన వ్యాఖ్య పరిస్థితికి అద్దం పడుతోంది.  ఇవాళ  ఏపీలో లోకేశ్ ప్రభావం ఎంతుందనడానికి, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసి,  మరో మిత్రపక్షంలో ఉన్న నాయకుడు సహితం లోకేశ్‌‌నే కాక  ఆయన సతీమణిని,  తనయుడ్ని పొగడటమే నిదర్శనం!  2019లో  సాధారణ జనంలోనూ ‘కావాలి జగన్,  రావాలి జగన్‌‌’ అని వినిపించినట్టు, ‘ఉండాలి  బాబు,  ఏలాలి బాబు’ అని ప్రస్తుతం ఎవరేం అనుకోవటం లేదు.  చినబాబు లోకేశ్ అనుచర గణంలోనూ ఆ భావన లేదు. 

దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.