వెలుగు ఓపెన్ పేజీ : బలమైన ముఖ్యమంత్రుల శకం

వెలుగు ఓపెన్ పేజీ :  బలమైన ముఖ్యమంత్రుల శకం

భారతదేశంలో  సహజంగానే  ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు సర్వశక్తిమంతులుగా ఉంటారు, ఎందుకంటే ఆ పార్టీ వారి అధీనంలో ఉంటుంది.  కానీ  జాతీయ పార్టీలకు కూడా బలమైన ముఖ్యమంత్రులు ఉన్న ప్రస్తుత తరుణంలో  ఇది 'బలమైన ముఖ్యమంత్రుల శకం' అని అంగీకరించాల్సిన సమయం ఇది.  ప్రస్తుతం, బీజేపీ,  కాంగ్రెస్ పార్టీలలో బలమైన ముఖ్యమంత్రులు ఉన్నారు.  చిన్నవైన  ఈశాన్య రాష్ట్రాలను పక్కన పెడితే, పంజాబ్,  కాశ్మీర్,  జార్ఖండ్,  తమిళనాడు,  ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లకు  ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు ఉన్నారు.  

పంజాబ్‌‌‌‌‌‌‌‌లో మాత్రం  ఆమ్‌‌‌‌‌‌‌‌ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత  కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిపై  తన ఆధిపత్యం చెలాయిస్తున్నారు.  కొందరు ఆయా పార్టీల  పొత్తుల కారణంగా  ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు. తమిళనాడులో టీవీకే  ప్రభుత్వానికి మిత్రపక్షాలు అండగా నిలవడంతో  విజయ్ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. అయితే,   జాతీయ పార్టీలు  తమ  ముఖ్యమంత్రులను  అధిష్టానం కంటే  బలవంతులుగా మారడానికి అనుమతించవు.  అలాంటి ముఖ్యమంత్రులు పార్టీని వీడి తమ సొంత పార్టీలను  ఏర్పాటు చేసుకుంటారేమోనని జాతీయ పార్టీల అధినాయకత్వం భయపడుతుంది.  ఎందుకంటే  గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. 


జాతీయ పార్టీలను  వీడి  సొంత పార్టీలను ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రులైన నాయకులు భారత రాజకీయ చరిత్రలో గణనీయంగానే ఉన్నారు.   జాతీయ పార్టీలు తమ పార్టీ ముఖ్యమంత్రులు హైకమాండ్‌‌‌‌‌‌‌‌ను ధిక్కరిస్తే పదవి నుంచి తప్పించడం  సర్వసాధారణంగా జరుగుతుంది.  ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు  మొదటి  బీజేపీ ముఖ్యమంత్రి అయిన కల్యాణ్ సింగ్‌‌‌‌‌‌‌‌ను  బీజేపీ నుంచి బహిష్కరించారు.  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో కూడా జాతీయ నాయకత్వం బలమైన ముఖ్యమంత్రులను సహించదు.  2026 మేలో  బెంగాల్‌‌‌‌‌‌‌‌లో  మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి భారత రాజకీయాల్లో గందరగోళం నెలకొంది.  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు  కేవలం  నలుగురు  ముఖ్యమంత్రులు  మాత్రమే ఉన్నారు, ప్రస్తుతం ముఖ్యమంత్రులు ఆధిపత్యం చెలాయించడాన్ని సహించడం తప్ప కాంగ్రెస్​ అధినాయకత్వానికి  మరో ప్రత్యామ్నాయం లేదు.   మరోవైపు  బీజేపీలో  చాలామంది  ముఖ్యమంత్రులు అంతగా  తెలియనివారే పదవిలో  కొనసాగుతున్నారు.  మీరు  రాజస్థాన్, ఒడిశా,  చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ ముఖ్యమంత్రుల పేర్లు చెప్పగలరా?   చాలామంది   సులభంగా  చెప్పగలిగే  బీజేపీ ముఖ్యమంత్రులు అస్సాంకు చెందిన  హిమంత బిశ్వ శర్మ, బెంగాల్‌‌‌‌‌‌‌‌కు చెందిన సువేందు అధికారి,  ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు  చెందిన యోగి ఆదిత్యనాథ్ మాత్రమే.

కాంగ్రెస్ పార్టీకి చెందిన బలమైన ముఖ్యమంత్రులు

కర్నాటకకు చెందిన  డీకే శివకుమార్  కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి అయ్యారు.  ఆయన  ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.  తమిళనాడు,  బెంగాల్ ఎన్నికల్లో ఓటములు,  కేరళలో సతీశన్ నాయకత్వ మార్పు కోసం జరిగిన అంతర్గత పోటీ ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో..  కర్ణాటకలో  కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను పక్కనపెట్టి శివకుమార్‌‌‌‌‌‌‌‌ను ముఖ్యమంత్రిని చేయాల్సి వచ్చింది. 2028 అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివకుమార్  పార్టీలో  అత్యంత శక్తిమంతమైన  నేతగా  ఎదుగుతారనే భయం ఆయన సొంత పార్టీలోని  ప్రత్యర్థులలో ఉంది.  కేరళ  ముఖ్యమంత్రి సతీశన్  నాయకత్వ పోరును జాతీయ స్థాయి చర్చనీయాంశంగా మార్చారు. కాంగ్రెస్ అధిష్టానం  కేసీ వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌ను  అభ్యర్థిగా భావించింది,  ఆయనకు 90 శాతం మంది ఎమ్మెల్యేల  మద్దతు కూడా ఉండేది.  కానీ  సతీశన్ చాలా తెలివిగా  తిరుగుబాటు వ్యూహాన్ని అమలు చేయడంతో  ఆయనను  ముఖ్యమంత్రిని చేయడం తప్ప కాంగ్రెస్​ అధిష్టానానికి మరో మార్గం లేకుండా పోయింది. 

బలమైన సీఎంగా రేవంత్​రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోసి 2023 ఎన్నికల్లో విజయాన్ని సాధించారు. అప్పటినుంచి రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలోని  అత్యంత కీలకమైన ముఖ్యమంత్రులు,  నాయకులలో  ఒకరుగా నిలిచారు.  పదవీకాలం పరంగా చూస్తే  డీకే శివకుమార్,  సతీశన్  ఇద్దరి కంటే  రేవంత్ రెడ్డే  సీనియర్.   ప్రస్తుత పరిస్థితుల్లో  కాంగ్రెస్ పార్టీ  రేవంత్‌‌‌‌‌‌‌‌
రెడ్డి, డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సతీశన్.. ఈ ముగ్గురు బలమైన  ముఖ్యమంత్రులను  విస్మరించే పరిస్థితిలో లేదు.


బీజేపీ బలమైన ముఖ్యమంత్రులుఉత్తరప్రదేశ్  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  

నిస్సందేహంగా  భారతదేశంలోనే అత్యంత బలమైన బీజేపీ ముఖ్యమంత్రి.  ఆయన లేకుండా 2027లో జరగబోయే ఎన్నికలను బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోలేదు. ఉత్తరప్రదేశ్ వ్యవహారాల్లో  బీజేపీ అధిష్టానం పెద్దగా జోక్యం చేసుకోదు.  ఆ రాష్ట్ర వ్యవహారాలను  బీజేపీ చాలా జాగ్రత్తగా నిర్వహిస్తోంది.   అస్సాం ముఖ్యమంత్రి  హిమంత బిశ్వ శర్మ జాతీయ స్థాయి నాయకుడిగా,  బీజేపీకి  విజయవంతమైన  ముఖచిత్రంగా ఎదిగారు. 2015లో  ఆయన బీజేపీలో చేరడానికి ముందు,  ఆ పార్టీ  అస్సాంలో అధికారాన్ని చేపట్టడం కష్టంగా అనిపించేది. ఇప్పుడు హిమంత శర్మ అస్సాంలో అత్యంత ప్రభావవంతమైన బీజేపీ నాయకుడిగా ఉన్నారు.  బీజేపీ అధిష్టానం కూడా ఆయనకు సూచనలు లేదా ఆదేశాలు ఇవ్వడానికి చాలా జాగ్రత్త వహిస్తుంది.  బెంగాల్ సీఎం  సువేందు అధికారి బీజేపీకి దొరికిన ఒక గొప్ప నాయకుడు. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ నుంచి 2020లో  ఆయన బీజేపీలో చేరారు.  మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బలమైన పోరాటం నడిపిన సువేందు అధికారి ఆమెను  ఓడించారు.  మరొక  బీజేపీ నాయకుడు ఇలా చేయగలిగేవారా అని చెప్పడం కష్టం. ఈ విజయం ఆయనను బలమైన బీజేపీ ముఖ్యమంత్రులలో ఒకరిగా నిలబెట్టింది.

సమర్థులే కానీ 'బలమైన' నాయకులు కాదు

ఈ విభాగంలో  మహారాష్ట్రకు  చెందిన దేవేంద్ర ఫడ్నవీస్  అత్యంత  సమర్థుడిగా కనిపిస్తారు.  అయితే, మహారాష్ట్రలోని కుల,  ప్రాంతీయ విభేదాలు,  అలాగే తమ సొంత పార్టీలకు నాయకత్వం వహిస్తున్న అనేకమంది ఉద్దండ నాయకుల ఉనికి కారణంగా  పైన పేర్కొన్న నాయకుల స్థాయి ‘బలమైన ముఖ్యమంత్రి’గా దేవేంద్ర ఫడ్నవీస్ ను పరిగణించడం సాధ్యం కాదు.   ఇప్పుడు  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీలో  బలమైన ముఖ్యమంత్రులు  ఉన్నారు.  ప్రాంతీయ నాయకులను వారి పోరాటాలు వారే చేసుకునేలా  వదిలేయడం తప్ప  కాంగ్రెస్  పార్టీకి  మరో ప్రత్యామ్నాయం లేదు. ఒకప్పుడు ఇందిరా గాంధీ హయాంలో ఉన్న వనరులు గానీ,  ఓట్లను ఆకర్షించే శక్తిగానీ  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు  ఇప్పుడు లేవు. అందువల్ల, ఈ ముఖ్యమంత్రులు తమంతట తామే నెగ్గుకొచ్చారు. వారి రాష్ట్రాలలో వారికి నిజమైన  గట్టి పోటీదారులు ఎవరూ లేరు. తాను అధికారంలో లేని రాష్ట్రాలలో బీజేపీ ఇతర పార్టీలకు చెందిన బలమైన ముఖ్యమంత్రుల పట్ల సహనం వహించి  ప్రోత్సహించడం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో యోగి ఆదిత్యనాథ్ పదిహేను సంవత్సరాల తర్వాత బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు.  అస్సాం,  బెంగాల్‌‌‌‌‌‌‌‌లో,  హిమంత శర్మ,  సువేందు అధికారి లేకుండా విజయాన్ని అందించగల బలమైన  నాయకులు ఎవరూ లేరు. అందువల్ల  బీజేపీ వారిని ప్రోత్సహించింది.  ఇప్పుడు వారితో సర్దుకుపోవాల్సి వస్తోంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్  రెండింటికీ అటువంటి బలమైన నాయకులు అవసరమయ్యారు.

సమర్థులైన ముఖ్యమంత్రుల భవిష్యత్తు

దేశంలో బలమైన సీఎంల  భవిష్యత్తు సురక్షితం.  కానీ బలమైన ముఖ్యమంత్రులు మంచి పరిపాలన అందించాలి.  తమ పార్టీలు గెలిచేలా చూడాలి.  కుంభకోణాలను నివారించాలి.  అంతేకాకుండా ఈ బలమైన ముఖ్యమంత్రులు తమ హైకమాండ్ అభద్రతాభావానికి  గురికాకుండా నిరంతరం చూసుకుంటూ,  వినయంగా వ్యవహరించాలి. ఇద్దరికీ  ఒకరికొకరు అవసరం.  దీర్ఘకాలంలో  సవాళ్లు ఉంటాయి.  కానీ ప్రస్తుతం, ఈ ఆరుగురు ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో చాలా బలంగా ఉన్నారు.  కానీ భవిష్యత్తు మనం ఊహించినట్లుగా ఎప్పుడూ జరగదు. ఏమైనా జరగవచ్చు.  అభిమాన అభ్యర్థులను తొలగించిన సందర్భాలు డజన్ల కొద్దీ ఉన్నాయి. 200 సంవత్సరాల క్రితం గొప్ప ఫ్రెంచ్ ఆర్థికవేత్త ప్రౌధోన్  చెప్పినట్లుగా భవిష్యత్తు కచ్చితంగా ఊహించలేనిది.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్​

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.