చట్టం అమలులో ఉన్నా.. పేపర్ లీకులు.. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి కూడా ఒక హెచ్చరిక

చట్టం అమలులో ఉన్నా.. పేపర్ లీకులు.. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి కూడా ఒక హెచ్చరిక

విద్య అనేది కేవలం అక్షరాస్యతను అందించే సాధనం మాత్రమే కాదు. వ్యక్తికి జ్ఞానం, ఉపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక స్వావలంబన కల్పించే అత్యంత శక్తిమంతమైన ఆయుధం. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు కల్పించాలని ఆకాంక్షిస్తుంది. కానీ నేటి పరిస్థితుల్లో విద్య క్రమంగా సేవారంగం నుంచి భారీ వ్యాపారంగా మారిపోయింది.

ముఖ్యంగా పోటీ పరీక్షల చుట్టూ ఏర్పడిన కోచింగ్ పరిశ్రమ, పేపర్ లీకుల మాఫియా, అవినీతి నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లు లక్షలాది మంది యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. భారత్ ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం.

దాదాపు 147 కోట్ల జనాభాలో 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల పనిచేసే వర్గం 60 శాతానికి పైగా ఉంది. ఇది దేశానికి జనాభా వల్ల కలిగే లాభం. అయితే దేశానికి ప్రయోజనకరం కావాల్సిన సమయంలో వారికి సరిపడా ఉద్యోగాలు లేకపోవడం వల్ల అది తీవ్రమైన పోటీగా మారింది.

ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పరిమితంగా ఉండగా,  మరోవైపు ఒక్కో పోస్టు కోసం  వేలాది మంది యువత పోటీపడుతున్నారు. అనేక నియామకాల్లో ఒక ఉద్యోగానికి 400 నుంచి 1000 మంది వరకు అభ్యర్థులు పోటీపడటం సాధారణ విషయంగా మారింది.

ఈ పోటీలో విజయం సాధించాలంటే విద్యార్థులు ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండి కోచింగ్ తీసుకుంటారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ ఆస్తులు అమ్మి, అప్పులు చేసి 
పిల్లలను కోచింగ్ కేంద్రాలకు పంపుతున్నాయి.

ఒక పరీక్షలో విజయం సాధిస్తే తమ కుటుంబ జీవితమే మారిపోతుందనే ఆశతో వారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. కానీ పరీక్ష జరిగే ముందు లేదా తర్వాతగాని  పేపర్ లీక్ కావడం, పరీక్ష రద్దు కావడం, ఫలితాలు నిలిపివేయడం వంటి ఘటనలు వారి జీవితాలను ఒక్క క్షణంలో అస్తవ్యస్తం చేస్తున్నాయి.

ఇది కేవలం ఒక పరీక్ష రద్దు కావడం కాదు. అది ఒక విద్యార్థి కలలు, ఒక కుటుంబం ఆశలు, ఎన్నో సంవత్సరాల కృషి ఒక్కసారిగా కుప్పకూలిపోవడమే.  తిరిగి పరీక్ష ఎప్పుడు జరుగుతుందో తెలియని అనిశ్చితి,  మళ్లీ అదే స్థాయిలో పరీక్షకు సిద్ధం కావాల్సిన ఒత్తిడి,  పెరుగుతున్న ఆర్థికభారం,  సమాజం ఎదుట ఎదురయ్యే నిరుద్యోగ అవమానం ఇవి అన్నీ కలిసి అనేకమంది యువతను  తీవ్ర మానసిక ఒత్తిడిలోకి నెడుతున్నాయి.

యువతలో పోటీ పరీక్షల ఒత్తిడి
ప్రతి సంవత్సరం యువత పోటీ పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఫలితాల ఆలస్యం, పేపర్ లీకులు,  వైఫల్యాల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా  నమోదవుతున్నాయి. ఒక విద్యార్థి ప్రాణం కోల్పోవడం అంటే కేవలం ఒక కుటుంబానికే కాదు, దేశ భవిష్యత్తుకూ నష్టం. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి కూడా ఒక హెచ్చరిక.

ఇక్కడ మరో ప్రమాదకరమైన అంశం విద్య చుట్టూ ఏర్పడిన అక్రమ వ్యవస్థ. కొన్ని ప్రైవేట్ కోచింగ్ సంస్థలు, బ్రోకర్లు, అవినీతి అధికారులు, పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన వ్యక్తులు  కుమ్మక్కై పేపర్ లీకులను కోట్ల రూపాయల వ్యాపారంగా మార్చుతున్నారనే ఆరోపణలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

డబ్బున్నవారికి అక్రమ మార్గాల్లో అవకాశాలు కల్పిస్తే, నిజాయితీగా కష్టపడి చదివిన విద్యార్థి నష్టపోతున్నాడు. ప్రతిభకు బదులుగా డబ్బు ఉద్యోగాన్ని నిర్ణయించే పరిస్థితి ఏర్పడితే అది విద్యావ్యవస్థ పతనానికి నాంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలోని సమాన అవకాశాల స్ఫూర్తి  దెబ్బతింటుంది.   గౌరవంగా జీవించే హక్కు, సమాన అవకాశాల హక్కు వంటి రాజ్యాంగ విలువలు కూడా పరోక్షంగా ప్రభావితమవుతాయి. పరీక్షలపై ప్రజలు విశ్వాసం కోల్పోతే ప్రభుత్వ వ్యవస్థలపైనా నమ్మకం దెబ్బతింటుంది.

పరీక్షల్లో అక్రమాలకు చట్టంతో చెక్‌‌‌‌‌‌‌‌
ఈ నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం  పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామినేషన్స్‌‌‌‌‌‌‌‌ (ప్రివెన్షన్‌‌‌‌‌‌‌‌  ఆఫ్​ అన్‌‌‌‌‌‌‌‌ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీన్స్‌‌‌‌‌‌‌‌) యాక్ట్‌‌‌‌‌‌‌‌ 2024ను  అమలులోకి  తీసుకొచ్చింది. 2024 జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ఉద్దేశం పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను పూర్తిగా అరికట్టడం.  గతంలో  పేపర్ లీకులపై కఠినమైన ప్రత్యేక చట్టం లేకపోవడంతో నిందితులు తేలికగా బెయిల్‌‌‌‌‌‌‌‌పై బయటకు వచ్చేవారు. విచారణలు సంవత్సరాల తరబడి సాగేవి.  కానీ కొత్త చట్టం ఈ నేరాలను అత్యంత తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తోంది. 

ఈ చట్టం ప్రకారం పరీక్షల నిర్వహణలో భాగమైన అధికారులు, ప్రైవేట్ సంస్థలు, ఇతర వ్యక్తులు  కలిసి పేపర్ లీకులకు పాల్పడితే దాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తారు. అలాంటి వారికి మూడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు కనీసం రూ.1 కోటి జరిమానా విధించే అవకాశం ఉంది.

అంతేకాకుండా లీకేజీ ద్వారా లాభపడిన కోచింగ్ సెంటర్లు,  సంబంధిత  వ్యక్తుల ఆస్తులను జప్తు చేసి, పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం చేసిన ఖర్చును వారి నుంచే వసూలు చేసే అధికారం కూడా ఈ చట్టం కల్పించింది. చట్టంలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులు నాన్-బెయిలబుల్. అంటే నిందితులు సులభంగా బెయిల్ పొందే అవకాశం ఉండదు. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) లేదా అసిస్టెంట్ కమిషనర్ స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న అధికారులు ఈ కేసులను విచారించలేరు.  దీనిద్వారా విచారణ నాణ్యతను పెంచాలన్న  ఉద్దేశం  స్పష్టంగా  కనిపిస్తోంది. 

యువత చేతుల్లో దేశ భవిష్యత్తు 
విద్యార్థులు కూడా ఒక పరీక్షే జీవితానికి అంతిమ గమ్యం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.  కుటుంబాలు ర్యాంకుల కంటే పిల్లల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యాసంస్థలు, కోచింగ్ కేంద్రాలు కేవలం ఫలితాల ప్రకటనలతో  కాకుండా  విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బాధ్యతను తీసుకోవాలి. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. ఆ యువత భవిష్యత్తు  విద్యా వ్యవస్థపై ఆధారపడి ఉంది.  పరీక్షలపై నమ్మకం కోల్పోతే దేశం తన ప్రతిభను కోల్పోతుంది.

పేపర్ లీక్ అనేది ఒక ప్రశ్నపత్రం దొంగిలించటం మాత్రమే కాదు. అది లక్షలాది మంది విద్యార్థుల నమ్మకాన్ని, కుటుంబాల ఆశలను,  దేశ భవిష్యత్తును దోచుకోవడం.  అందుకే  పేపర్ లీకులకు పాల్పడేవారిని చట్టం ఉక్కు పాదంతో అణచివేసి కఠినంగా వ్యవహరించాలి. విద్యను వ్యాపారంగా మార్చే మాఫియాను నిర్మూలించడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యంగా మారాలి. ప్రతీ పరీక్ష నిజాయితీగా జరిగితేనే.. ప్రతీ విద్యార్థికి న్యాయం జరుగుతుంది. ప్రతీ విద్యార్థికి న్యాయం జరిగినప్పుడే భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.

చట్టం అమలులో ఉన్నా.. పేపర్​ లీకులు
నా ప్రశ్నలు ఏమిటంటే.. పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామినేషన్స్‌‌‌‌‌‌‌‌ (ప్రివెన్షన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్​ అన్‌‌‌‌‌‌‌‌ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీన్స్‌‌‌‌‌‌‌‌) యాక్ట్‌‌‌‌‌‌‌‌ 2024 చట్టం ఉండటమే సరిపోతుందా? అమలు ఎంత సమర్థంగా జరుగుతోంది? చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్లు కూడా పూర్తి కాక ముందే పలు పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు దేశాన్ని కలచివేస్తున్నాయి. చట్టం భయం నిజంగా నేరస్థుల్లో కనిపిస్తుందా? లేక అది కేవలం పుస్తకాలకే పరిమితమైందా?  ప్రభుత్వాలు కేవలం చట్టాలు చేయడం వద్ద ఆగిపోకూడదు.

పరీక్షల ప్రశ్నపత్రాల తయారీ నుంచి పంపిణీ వరకు సంపూర్ణ డిజిటల్ భద్రత, బహుళస్థాయి పర్యవేక్షణ, సైబర్ ఆడిట్, బాధ్యులపై వేగవంతమైన విచారణ, ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా త్వరితగతిన తీర్పులు, విజిల్‌‌‌‌‌‌‌‌బ్లోయర్ రక్షణ వ్యవస్థ వంటి సంస్కరణలు అత్యవసరం. అలాగే పరీక్షలు రద్దయినప్పుడు విద్యార్థులకు సమయపాలిత ప్రత్యామ్నాయ షెడ్యూల్ ప్రకటించడం, మానసిక ఆరోగ్య సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు కోచింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించడం కూడా అంతే ముఖ్యం.

జి. శ్రీలత, సీనియర్ జర్నలిస్ట్

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.